నోట్ల కట్టల గుట్టలు... నోరు విప్పిన కాంగ్రెస్ ఎంపీ కీలక వ్యాఖ్యలు!
ఈ క్రమంలో సుమారు రూ.353 కోట్ల డబ్బుతో పాటు కొన్ని కిలోలా బంగారం, మరికొన్ని డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు.
బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ కేంద్రం లోని బీజేపీ సర్కార్ విపక్ష నేతలను టార్గెట్ చేస్తూ ఐటీ, ఈడీ వంటి దాడులకు పాల్పడుతుందని నిత్యం విమర్శలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో దేశంలో అతిపెద్ద విషయం తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా కాంగ్రెస్ ఎంపీ ధీరజ్ సాహూ కంపెనీలపై జరిగిన ఐటీ సోదాల్లో నోట్ల కట్టల గుట్టలు వెలుగులోకి వచ్చాయి. దీంతో మరోసారి రాజకీయ దుమారం రేగింది. ఈ సమయంలో తాజాగా సాహూ స్పందించారు.
అవును... ఇటీవల కాంగ్రెస్ ఎంపీ ధీరజ్ సాహు కంపెనీలకు చెందిన ప్రాంగణాలతో పాటు మరికొన్ని చోట్ల ఆదాయపు పన్ను అధికారులు సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సుమారు రూ.353 కోట్ల డబ్బుతో పాటు కొన్ని కిలోలా బంగారం, మరికొన్ని డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ సమయంలో ఆ నోట్ల కట్టలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ గా కూడా మారాయి.
క్యాష్ మిషన్ లతో రికవరీ సొమ్మును లెక్కించేందుకు ఉద్యోగులు ఏకంగా 5 రోజులపాటు శ్రమించడం కూడా హాట్ టాపిక్ గా మారింది. ఈ క్రమంలో తాజాగా ఈ వ్యవహారంపై తొలిసారిగా కాంగ్రెస్ ఎంపీ నోరు విప్పారు. ఇందులో భాగంగా ఐటీ సోదాల్లో దొరికిన సొమ్ము మొత్తం తన కంపెనీలకు చెందినదేనని వెల్లడించారు.
ఈ సందర్భంగా స్పందించిన ఆయన... ఐటీ అధికారులు రికవరీ చేసిన సొమ్ము తన సంస్థకు చెందినదే అని తాను ఖచ్చితంగా చెప్పగలని ఎంపీ వెల్లడించారు. ఐటీ దాడులు జరిగిన సమయంలో తాను ఢిల్లీలో ఉన్నానని.. పలు కారణాలతో మీడియా ముందుకు స్పందించేందుకు రాలేదని పేర్కొన్నారు. ఇదే క్రమంలో... సుమారు వందేళ్లుగా తమ కుటుంబం మద్యం వ్యాపారం చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు.
ఇక, తాను రాజకీయాల్లో ఉన్నానని.. కుటుంబ సభ్యులు వ్యాపారాన్ని చూసుకుంటున్నారని చెబుతున్న ధీరజ్ సాహు... తనది చాలా పెద్ద కుటుంబమని, వ్యాపారంలో ఆరుగురు సోదరుల పిల్లలు ఉన్నారని తెలిపారు. వాస్తవానికి మద్యం వ్యాపారానికి సంబంధించిన లావాదేవీలు ఎక్కువగా నగదు రూపంలో జరుగుతాయని.. అది పూర్తిగా వ్యాపారానికి సంబంధించిన మెుత్తమని అన్నారు. ఆ సొమ్ముతో తన కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని వెల్లడించారు.
కాగా... ఇటీవల ఐటీ శాఖ అధికారులు మూడు రాష్ట్రాల్లో ధీరజ్ సాహుకు సంబంధించిన కార్యాలయాలలో దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో డబ్బుతో నిండి ఉన్న సుమారు 176 బస్తాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సమయంలో అధికారులు ఎంతో సమయం వెచ్చించి ఈ నోట్ల కట్టలను లెక్కించగా.. అవి మొత్తం రూ.353 కోట్లు అని వెల్లడైంది! ఈ క్రమంలో తాజాగా ఆ డబ్బు మొత్తం తనకు సంబంధించిందే అని, పార్టీకి ఎలాంటి సంబంధం లేదని ఆయన వెల్లడించారు.