హనీట్రాప్.. బతికుండగానే కాలువలో పడేశారు..!

కూతురుపై ఉన్న మమకారం.. కిడ్నాప్ చేశారన్న కోపంతో హనీట్రాప్ చేశారు. ఇంకేముంది ఆ వ్యక్తిని బతికుండగానే బండ రాయి కట్టి కాలువలో పడేశారు.

Update: 2024-12-22 08:20 GMT

కూతురుపై ఉన్న మమకారం.. కిడ్నాప్ చేశారన్న కోపంతో హనీట్రాప్ చేశారు. ఇంకేముంది ఆ వ్యక్తిని బతికుండగానే బండ రాయి కట్టి కాలువలో పడేశారు. భర్తతో కలిసి ఓ మహిళ ఈ దారుణానికి పాల్పడింది. చివరకు అరెస్టయి జైలు పాలు కావాల్సి వచ్చింది.

2023 మార్చి నెలలో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఆటో డ్రైవర్ కనిపించడం లేదని అతని బంధువులు ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు దర్యాప్తు చేశారు. అయితే.. ఏడాదిన్నర తరువాత హత్యకు గల కారణాలు.. హత్య చేసిన వ్యక్తుల పేర్లు బయటకువచ్చాయి. ఈ హత్యోదంతం ఓ సినిమాను తలపించేలా చోటుచేసుకుంది. చివరకు పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి జైలుకు పంపించారు.

హైదరాబాద్‌లోని నిజాంపేట్‌కు చెందిన కుమార్(30) ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎన్టీఆర్ జిల్లా మైలవరానికి చెందిన ఓ కారు డ్రైవర్ తన భార్య, కూతురుతో కలిసి జగద్గిరిగుట్టలో ఉంటున్నాడు. ఆయన కూతురు ఏడో తరగతి చదువుతోంది. ఆ బాలికను గతేడాది ఆటో డ్రైవర్ తీసుకెళ్లి యూసుఫ్‌గూడోని ఓ గదిలో బంధించాడు. లైంగికదాడికి యత్నించగా.. ఆమె తప్పించుకుని పారిపోయింది. బాలానగర్ పోలీసుల కంట పడింది. అనాథనని చెప్పడంతో వారు ప్రత్యేక శిబిరానికి తీసుకెళ్లారు. మరోవైపు.. బాలిక కోసం తల్లిదండ్రులు వెతికారు. అయినా ఆమె ఆచూకీ వారికి లభించలేదు. కరోనా సమయంలో ఆమె కోసం కొనుగోలు చేసిన ల్యాప్‌టాప్‌ను పరిశీలించారు. స్నాప్ చాట్‌లో ఉన్న ఓ ఫోన్ నంబర్‌ను గుర్తించారు. అది ఆటో డ్రైవర్ కుమార్‌ది అని తేలింది.

కుమారే తమ కుమార్తెను కిడ్నాప్ చేశాడని ఆ తల్లిదండ్రులు అనుమానం పెట్టుకున్నారు. దాంతో బాలిక తల్లి స్నాప్‌చాట్‌లో ఓ ఐడీని క్రియేట్ చేసుకుంది. హనీట్రాప్ చేసి ఆ యువకుడిని మియాపూర్ వరకు రప్పించింది. ఆ వెంటనే ఆ బాలిక తల్లిదండ్రులు కుమార్ మీద దాడికి పాల్పడ్డారు. కారులో కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి తమ కుమార్తె సమాచారం కోసం ఆరా తీశారు. దాంతో వాళ్ల కూతురు తన నుంచి తప్పించుకుని పోయిన విషయాన్ని డ్రైవర్ ఆ పేరెంట్స్‌కు చెప్పాడు. అనంతరం ఆ దంపతులు కుమార్‌పై దాడికి పాల్పడ్డారు. ఆ దెబ్బలను భరించలేక అతను అపస్మారక స్థితికి చేరుకున్నాడు. ఆ వెంటనే అతడిని కారులో సూర్యాపేట వైపు తీసుకెళ్లి కాళ్లు చేతులు కట్టిపడేసి పెద్ద బండరాయి కట్టి బతికుండగానే నాగార్జున సాగర్ ఎడమ కాల్వలో పడేశారు. దాంతో కుమార్ చనిపోయాడు.

కుమార్ మిస్సింగ్‌పై బొరబండ పోలీసుస్టేషన్‌లో కేసు నమోదైంది. ఆ తరువాత కారు డ్రైవర్ కుమార్తె వారి వద్దకు చేరుకుంది. మరోవైపు.. కుమార్ ఆటోను ఆ కారు డ్రైవర్ వాడుతున్నాడు. దానిని అతని బంధువులు గుర్తించారు. వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో కేసు అసలు విషయం వెలుగుచూసింది. సూర్యాపేట జిల్లా కోదాట పోలీసులు గుర్తు తెలియని మృతదేహం ఎముకలను డీఎన్ఏ టెస్టుల కోసం పంపించారు. బోరబండ పోలీసులు ఆ దంపతులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Tags:    

Similar News