రోజాకు దెబ్బ మీద దెబ్బ.. షాకింగ్ గా కేజే శాంతి వీడియో

నగరిలో రోజా వ్యతిరేకలను ఒక చోటుకు చేర్చి మరి.. ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ రాజీ చేసినా ఫలితం లేకపోయింది.

Update: 2024-06-06 12:57 GMT

అసలే ఓటమి. అందునా దారుణ పరాజయం. మంత్రిగా తిరుగులేని అధికారాన్ని అనుభవించిన వేళ.. మరోసారి అధికారం చేతికి వస్తుందన్న నమ్మకాన్ని బలంగా చెప్పిన వైసీపీ నేతల్లో ఆర్కే రోజా ఒకరు. చంద్రసేన సునామీలో కొట్టుకుపోయిన ఫైర్ బ్రాండ్ పరిస్థితి ఇప్పుడు మరింత ఇబ్బందికరంగా మారింది. కారణం.. ఇప్పుడు ఆమెపై మండిపడుతున్నది ఇతర పార్టీల వారు కాదు. సొంత పార్టీకి చెందిన వారు. నగరి ఎమ్మెల్యేగా.. మంత్రిగా అత్యున్నత స్థానాలకు చేరుకున్నప్పటికీ.. స్థానికంగా ఉన్న అసమ్మతిని తగ్గించుకోవటంలో ఆమె ఫెయిల్ అయ్యారు. నగరిలో రోజా వ్యతిరేకలను ఒక చోటుకు చేర్చి మరి.. ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ రాజీ చేసినా ఫలితం లేకపోయింది.

ఆర్కే రోజాకు చాలామంది అసమ్మతులు ఉన్నప్పటికీ.. వారిలో బలమైన గొంతు నగరి మున్సిపల్ మాజీ ఛైర్ పర్సన్ కేజే శాంతి. మంత్రిగా ఉన్న రోజా తనను మున్సిపాల్టీ గేటు తాకనివ్వనని చెప్పారన్న ఆమె.. ఇప్పుడు ఆమె ఓటమితో నగరికి పట్టిన శని విరగడైందని.. ప్రజలంతా పండుగ చేసుకుంటున్నట్లుగా పేర్కొన్నారు. దీనికి సంబంధించి ఆమె విడుదల చేసిన వీడియో ఇప్పుడు పెను సంచలనంగా మారింది. ఆమె విడుదల చేసిన సెల్ఫీ వీడియోలో పేర్కొన్న అంశాల్లో కొన్ని వ్యాఖ్యల్ని ఆమె మాటల్లోనే చదివితే..

‘‘ఈ రోజు నగరి ప్రజలందరికి చాలా సంతోషకరమైన.. పండుగ వాతావరణాన్ని దేవుడు ఇచ్చిన రోజు. ఈ ఆనందాన్ని నగర ప్రజలందరితో మేం కూడా పంచుకుంటున్నాం. పదేళ్లుగా నగరికి పట్టిన శని పీడ విరగడైన రోజు కాబట్టి.. ఈ రోజు ఆనందంగా ఉన్నాం. ఈ శని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో అడుగు పెట్టిందో.. పార్టీకి శని పట్టిందని మా బాధ. ఈసారి దీనికి టికెట్ ఇవ్వకుండా తరిమి కొట్టి ఉండి ఉంటే వైఎస్సార్ పార్టీకి ఇంత పరిస్థితి వచ్చి ఉండేది కాదు’’

‘‘కుటుంబ పరిపాలన.. అరాచకం.. అక్రమాలు.. అవినీతి.. అన్యాయం చేసి నగరి నా అడ్డా..నా గడ్డ అంటూ మాట్లాడింది. నగరి ఎవరి అడ్డా? ఎవరి అడ్డాలోకి వచ్చి ఎవరేం చేశారు? నగరిలో చిత్తుచిత్తుగా ఓడించి భూస్థాపితం చేశారు చూశావా రోజా? అర్థమైందా? నగరి ప్రజల గురించి. మమ్మల్ని నగరి మున్సిపాలిటీ గేటు తాకనివ్వనని అన్నావు. నగరి కాదు.. మున్సిపాలిటీ గేటు కాదు.. అసెంబ్లీ కాదు.. ఏపీ కాదు.. రాష్ట్రంలో ఎక్కడా కూడా కనిపించవు నువ్వు’’ అంటూ ఆమెపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

‘‘గుడికి కూడా వెళ్లే అర్హత లేని ఆడదానివి. నగరిని నాశనం చేసినావు. దేవుడు ఉన్నాడు.. మంచికి.. న్యాయానికి దేవుడు ఉన్నాడని మరోసారి రుజువైంది. నిన్ను నగరి నుంచి భూస్థాపితం చేసేందుకు ప్రజలు కంకణం కట్టుకున్నారు. అది జరిగింది. నగరి మంచి బాటలో నడుస్తుంది. ప్రజలంతా అన్నాదమ్ముళ్ల మాదిరి ఉంటారు. రాజకీయాలు చేయటం తెలియని వ్యక్తివి. అందరితోనూ విరోధంపెట్టుకున్న వ్యక్తివి నువ్వు. అర్థమైందా రోజా? బై రోజా.. బై. ఎక్కడెక్కడ షూటింగ్ లకు పోయి అడుక్కుతింటావో తిను’’ అంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

Tags:    

Similar News