మాట్లాడే మాటలకు అర్థముందా కొడాలి?

తాజాగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

Update: 2024-01-09 05:02 GMT

నోటికి వచ్చినట్లుగా మాట్లాటం ఇంట్లోనూ పనికి రాని పరిస్థితులు ఇప్పుడున్నాయి. మారిన కాలానికి తగ్గట్లు మారకుంటే.. తామే మారిపోవాల్సిన పరిస్థితి వస్తుందన్న విషయం మాజీ మంత్రి కొడాలి నానికి ఎప్పుడు అర్థమవుతుంది? తాను ఒక బాధ్యత కలిగిన నేతన్న విషయాన్ని ఆయన పూర్తిగా మర్చిపోయినట్లున్నారు. తాజాగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

ఎవరినైనా సరే.. నోటికి పని చెప్పే అలవాటున్న కొడాలి నాని తాజా వ్యాఖ్యలు రెండు తెలుగు రాష్ట్రాల సంబంధాలపైనా ప్రభావం పడుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత.. ఏపీ ముఖ్యమంత్రి జగన్ శుభాకాంక్షలు చెప్పకపోవటాన్ని ప్రశ్నించిన మీడియా ప్రతినిధులతో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.

సీఎం రేవంత్ రెడ్డికి జగన్ ఎందుకు శుభాకాంక్షలు చెప్పాలన్న ఆయన.. మాకేం పని లేదా? అంటూ వ్యాఖ్యలు చేయటం గమనార్హం. సోదర రాష్ట్రానికి కొత్త ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నేతకు శుభాకాంక్షలు చెప్పటంలో ఉండే ఇబ్బందేమిటో కొడాలికే తెలియాలి. అదే సమయంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిసేందుకు హైదరాబాద్ వెళ్లారు కదా? అన్న మీడియా ప్రతినిధుల మాటకు.. రేవంత్ కు ఏమైనా తుంటి విరిగిందా? పరామర్శించేందుకు అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు అనుచితంగా ఉన్నాయంటున్నారు.

తన గురించి తాను ఎన్ని చెప్పుకున్నా ఫర్లేదు. కానీ.. తమ అధినేతకు సంబంధించి చేసే వ్యాఖ్యల విషయంలో ఆయనకు ఇబ్బంది కలుగకుండా చూసుకోవాలన్న ధ్యాస లేకుండా కొడాలి తీరు ఉందంటున్నారు. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రిని ఉద్దేశించి వ్యాఖ్యలు చేసే సమయంలో సంయమనం అవసరమన్న చిన్న విషయాన్ని ఆయన మర్చిపోయారంటున్నారు. ఇలాంటి తీరు.. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఉండే సంబంధాలపై ప్రభావాన్ని చూపుతుందంటున్నారు.

Tags:    

Similar News