ఒక నియోజకవర్గంలో 130 బెల్ట్ షాపులు... టీడీపీ ఎమ్మెల్యే రచ్చో రచ్చ!

ఈ సమయంలో పలు సమస్యలు తెరపైకి వచ్చాయని అంటున్న నేపథ్యంలో.. ప్రధానంగా బెల్ట్ షాపులపై చర్చ విపరీతంగా జరుగుతుందని అంటున్నారు.

Update: 2024-12-17 14:12 GMT

ఏపీలో కూటమి ప్రభుత్వం నూతన మద్యం పాలసీని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా.. ఇప్పుడు మద్యం వ్యాపారం ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వచ్చింది. ఈ సమయంలో పలు సమస్యలు తెరపైకి వచ్చాయని అంటున్న నేపథ్యంలో.. ప్రధానంగా బెల్ట్ షాపులపై చర్చ విపరీతంగా జరుగుతుందని అంటున్నారు.

దీనిపై చంద్రబాబు సీరియస్ గా ఉన్నట్లు చెబుతున్నారు. ప్రధానంగా పలు ప్రాంతాల్లో సంతలో బహిరంగంగా ప్రదర్శిస్తూ మరీ బెల్ట్ షాపులు నడుపుతున్నారనే కథనాలు మీడియాలో దర్శనమిచ్చాయని అంటున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ వ్యవహారంపై టీడీపీ ఎమ్మెల్యే ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పుడు ఈ విషయం వైరల్ గా మారింది.

అవును... కొలికపూడి శ్రీనివాసరావు తిరువూరులో హల్ చల్ చేశారు. ఇందులో భాగంగా... తిరువూరూ నియోజకవర్గంలో ఉన్న బెల్టు షాపులను ఎక్సైజ్ అధికారులు 24 గంటల్లో తొలగించాలంటూ ఆదేశాలు జారీ చేశారు. ఇదే సమయంలో... బెల్ట్ షాపులకు లిక్కర్ సరఫరా చేసే షాపుల లైసెన్సులు రద్దు చేయాలని సూచించారు.

మంగళవారం తురువురులోని వైన్ షాపుల పక్కన ఏర్పాటు చేసిన బెల్ట్ షాపులలో ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా పట్టణంలో మద్యం విక్రయిస్తున్న బెల్ట్ షాపులను తనిఖీ చేసి పోలీసులకు పట్టించారు. ఈ సందర్భంగా పాఠశాలలు, గృహాలు, బస్టాఫ్ సమీపంలో ఉన్న లిక్కర్ షాపులను పట్టణ శివారుకు తరలించాలని డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా మాట్లాడిన శ్రీనివాసరావు... తిరువూరు పట్టణంలో అధికారికంగా నాలుగు మద్యం షాపులు ఉన్నాయని.. అయితే తనకొచ్చిన సమాచారం ప్రకారం పట్టణంలో 35 బెల్టు షాపులు ఉన్నాయని తెలిపారు. వీటితో పాటు నియోజకవర్గంలోని మొత్తం నాలుగు మండలాల్లోనూ మొత్తం 130 వరకూ బెల్ట్ షాపులున్నాయని అన్నారు.

దీంతో... ఒక్కసారిగా ఈ విషయం సంచలనంగా మారింది. ఒక్క నియోజకవర్గంలో 130 బెల్ట్ షాపులు ఉన్నాయంటే.. రాష్ట్రంలో మద్యం ఏ స్థాయిలో పారుతుందో అనే చర్చ తెరపైకి వచ్చిందని అంటున్నారు. స్వయంగా టీడీపీ ఎమ్మెల్యే తెరపైకి తెచ్చిన ఈ విషయంపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందనేది వేచి చూడాలని అంటున్నారు.

Tags:    

Similar News