పేర్ని నాని పరేషాన్ అవుతున్నారా ?
మాజీ మంత్రి పేర్ని నాని వైసీపీ అధికారంలో ఉన్నపుడు ఒక రకంగా హవా చలాయించారు.
మాజీ మంత్రి పేర్ని నాని వైసీపీ అధికారంలో ఉన్నపుడు ఒక రకంగా హవా చలాయించారు. మూడేళ్ల పాటు ఆయన మంత్రిగా పనిచేశారు. అందులోనూ కీలకమైన సమాచార శాఖ మంత్రిగా ఉన్నారు. ఆయన మాటకారి తనం, ఆయన సామాజిక నేపథ్యం, ఉన్న జిల్లా అన్నీ కలసి మంచి ప్రయారిటీ ఇచ్చేలా చేసాయి.
ఇక ఆయన జగన్ కి అత్యంత సన్నిహితులు అన్నది కూడా తెలిసిందే. ఆయన వైసీపీని ఒక కాపు కాశారు ప్రత్యర్ధులు ఎవరైనా విమర్శలు చేస్తే క్షణాలలో ఘాటుగా ధీటుగా వైసీపీ నుంచి రెస్పాండ్ అయ్యేవారు. అంతవరకూ ఎందుకు వైసీపీ ఓడాక కూడా ఆ పార్టీకి బలమైన వాయిస్ గా ఆరు నెలల నుంచి నిలుస్తూ వస్తున్నారు.
అటువంటి పేర్ని నాని ఈ రకమైన పరిస్థితి వస్తుందని అనుకోలేకపోయారు. ఆయన గొడౌన్ నుంచి రేషన్ బియ్యం మాయమైంది అన్న ఆరోపణలతో కేసులు కట్టడంతో ఆయన ఏ 6గా ఉన్నారు. ఇక ఆయన తన సతీమణి మీద ఏ వన్ గా పెడుతూ కేసు కట్టడంతో చాలా ఆవేదనకు గురి అయ్యారు.
అయితే ఆ సమయంలో ఆయన చంద్రబాబు మహిళలను అరెస్ట్ చేయవద్దని వారించారని అంటూ బాబు పట్ల సాఫ్ట్ కార్నర్ ప్రదర్శించారు. తన సతీమణిని అరెస్ట్ చేయాలని ఒక మంత్రి ఎంత పట్టుదలగా పోయినా బాబు వల్లనే అది ఆగిందని అన్నట్లుగా మాట్లాడారు. కానీ కట్ చేస్తే కేసులూ తప్పడం లేదు, ఇక అరెస్టులకు మార్గాలూ పెరుగుతున్నాయి.
దీంతో పేర్ని నాని బాబుని పొగిడినా ఫలితం లేకపోతోంది అని అంటున్నారు. అంతేకాదు ఆయన ఉన్నట్లుంది బాబుని పొగడం పట్ల అటు టీడీపీలోనూ ఇటు వైసీపీలోనూ మంట రేగింది. టీడీపీ మంత్రి కొల్లు రవీంద్ర అయితే పేర్ని నాని మీద చాలా హాట్ కామెంట్స్ చేశారు. అలాగే అనంతపురానికి చెందిన మాజీ మంత్రి జేసీ ప్రభాకరరెడ్డి అయితే పేర్ని నాని మీద చాలా పెద్ద విమర్శలే చేశారు.
ఇంకో వైపు చూస్తే పేర్ని నాని తనదాకా వస్తే ఇలా వ్యవహరిస్తారా అన్న చర్చ కూడా సాగుతోంది. చంద్రబాబుని ఆయన పొగడడం కూడా వైసీపీ హార్డ్ కోర్ ఫ్యాన్స్ కి నచ్చడం లేదు అని అంటున్నారు. ఇక వైసీపీ అధినాయకత్వం అయితే ఈ విషయంలో సైలెంట్ గా ఉన్నా పేర్ని నాని వ్యాఖ్యల పట్ల భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
సరే బాబుని పొగిడినా డిప్యూటీ సీఎం పవన్ అయితే నాడు బూతులు నేడు నీతులా అంటూ పేర్ని నానికి కౌంటర్ ఇచ్చేసారు. దాంతో అయన అరెస్ట్ తప్పదా అన్న చర్చ కూడా వస్తోంది. కోర్టుల ద్వారా తాత్కాలికంగా ఊరట లభిస్తున్నా ఆయన విషయంలో కూటమిలోని కొందరు పట్టుదలగానే ఉన్నారు అని అంటున్నారు. మొత్తానికి పేర్నికి ఊహించని వైపు నుంచి కష్టం వచ్చిపడింది ఆ సమయంలో ఆయన డీల్ చేసే విధానంలో తడబడుతున్నారా అన్న చర్చ సాగుతోంది. ఇక ఈ కేసులు వ్యవహారం ఒక కొలిక్కి వచ్చాక ఆయన రాజకీయం ఈ విధంగా ఉంటుంది అన్నది కూడా చర్చగా ఉంది. చూడాలి మరి ఏమి జరుగుతుందో.