కోన వెంకట్ దాడి చేశారు: దళిత యువకుడి ఆరోపణ.. ఎస్సీ ఎస్టీ కేసు నమోదు
సిట్టింగ్ ఎమ్మెల్యే, వైసీపీ సీనియర్ నాయకుడు కోన రఘుపతి బంధువు, సినీ రచయిత కోన వెంకట్ తనపై దాడి చేసినట్టు దళిత యువకుడు ఆరోపిస్తున్నారు.
ఎన్నికలకు ముందు నాయకులు పార్టీలు మారినట్టే.. కార్యకర్తలు, చోటా నాయకులు కూడా.. మారుతుంటా రు. ఎవరి ఇష్టం వారిది. అయితే.. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని బాపట్ల నియోజకవర్గం గణపవరంలో చోటు చేసుకున్న ఘటనలో వైసీపీ నుంచి టీడీపీలోకి చేరిన దళిత యువకుడు తనను వైసీపీ నాయకులు కొట్టారని ఆరోపించారు. అది కూడా పోలీసుల ముందే దాడి చేశారని ఆయన ఆరోపించారు. దీంతో పోలీసు అధికారులు ఎస్సైని సస్పెండ్ చేయడం గమనార్హం.
సిట్టింగ్ ఎమ్మెల్యే, వైసీపీ సీనియర్ నాయకుడు కోన రఘుపతి బంధువు, సినీ రచయిత కోన వెంకట్ తనపై దాడి చేసినట్టు దళిత యువకుడు ఆరోపిస్తున్నారు. కోన వెంకట్ కూడా.. వైసీపీ నాయకుడిగా ఉన్న విషయం తెలిసిందే. ఎన్నికల వేళ ఆయనకు కర్లపాలెం మండల ఇంచార్జి బాధ్యతలు అప్పగించారు. ఈయన సదరు దళిత యువకుడిపై పార్టీ మారినందుకు దాడి చేశాడని యువకుడి కుటుంబ సభ్యులు కూడా ఆరోపిస్తున్నారు.
ఇదీ.. ఆరోపణ!
వైసీపీ కార్యకర్తగా ఉన్న కర్లపాలెం మండలానికి చెందిన కత్తి రాజేష్(ఎస్సీ) పోలింగ్‌కు రెండు రోజుల ముందు అంటే.. శనివారం టీడీపీలోకి మారినట్టు తెలిసింది. స్థానిక టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వేగేశ్న నరేంద్ర వర్మ సమక్షంలో ఆయన పార్టీ మారినట్టు ప్రచారం జరుగుతోంది. అయితే.. ఇక్కడ వైసీపీ నాయకులు కీలక ఆరోపణ చేస్తున్నారు. కత్తి రాజేష్.. తమ నుంచి రూ.8 లక్షలు తీసుకున్నాడని.. తర్వాత టీడీపీలో చేరిపోయాడని ఆరోపిస్తున్నారు. దీనిపై కర్లపాలెం పోలీసులకు కూడా కంప్లెయింట్ చేసినట్టు తెలిసింది.
దీంతో కత్తి రాజేష్‌ను పోలీసులు స్టేషన్‌కు తీసుకు వచ్చారని.. ఆ సమయంలో అక్కడే ఉన్న వైసీపీ నాయకులు కోన వెంకట్ సహా కొందరు.. తనపై దాడి చేశారని రాజేష్ ఆరోపించారు. పోలీసుల సమక్షంలోనే తనపై భౌతిక దాడి చేసినా.. పోలీసులు పట్టించుకోలేదని రాజేష్ చెబుతున్నారు. ఇక, ఈ విషయం తెలిసిన టీడీపీ నేతలు.. బాపట్ల ఎంపీ అభ్యర్థి తెన్నేటి కృష్ణప్రసాద్, ఎమ్మెల్యే అభ్యర్థి వేగేశ్న నరేంద్రవర్మ తదితరులు స్టేషన్ వద్దకు చేరుకుని కోన వెంకట్, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేసినట్టు తెలిసింది.
మరోవైపు.. రాజేష్ మాత్రం.. తనను వైసీపీ నాయకులు కోనవెంకట్ సహా కొందరు కొట్టారని ఆరోపిస్తూ.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆయన చేసిన ఫిర్యాదు మేరకు.. కోన వెంకట సహా పలువురిపై పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసులు నమోదు చేసినట్టు తెలిసింది. ఇదిలావుంటే.. ఈ ఘటన విషయంపై స్పందించిన ఎస్పీ.. స్థానిక ఎస్సై జనార్దన్‌ను సస్పెండ్ చేసినట్టు తెలిసింది.