ఐటీ ఉద్యోగుల కోసం అసెంబ్లీలో పోరాడుతున్న ఏకైక ఎమ్మెల్యే!

దీంతో ఐటీ ఉద్యోగుల కోసం నిలబడ్డ ఆ ఎమ్మెల్యేపై ప్రశంసలు కురుస్తున్నాయి. ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే? ఏంటా కథ తెలుసుకుందాం.;

Update: 2025-03-25 07:13 GMT
CPI MLA Koonaneni Stands Up for IT Workers

అసెంబ్లీ అంటే తిట్టుకోవడం.. కొట్టుకోవడం.. విమర్శలు, ప్రతివిమర్శలేనా..? అధికార, ప్రతిపక్షాలు వ్యక్తిగత దూషణలకు కూడా దిగుతున్న రోజులివీ.. ప్రజా సమస్యలకు వేదిక కావాల్సిన అసెంబ్లీలు ఇప్పుడు పార్టీల మధ్య వైరాలకు కేంద్రబిందువు అవుతున్నాయి. ప్రజా సమస్యలు ఎప్పుడో పక్కకు పోయాయి. ఇక ఉద్యోగులు, ఇతర వర్గాల వారి సమస్యలకు దిక్కే లేకుండా పోయింది. కానీ ఒక్కరున్నారు.. అంతమందిలో ఒక ఎమ్మెల్యే మాత్రం ఐటీ ఉద్యోగుల గురించి ఆలోచించారు. వారి బాధను అర్థం చేసుకున్నాడు. నిండు అసెంబ్లీలో నిలదీశారు. దీంతో ఐటీ ఉద్యోగుల కోసం నిలబడ్డ ఆ ఎమ్మెల్యేపై ప్రశంసలు కురుస్తున్నాయి. ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే? ఏంటా కథ తెలుసుకుందాం.

ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి, ఎల్ అండ్ టి ఛైర్మన్ ఎస్.ఎన్. సుబ్రమణ్యన్ , మాజీ నీతి ఆయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్ వంటి ప్రముఖులు ఎక్కువ పని గంటల కోసం వాదిస్తుండటంతో, భారతీయ ఐటీ ఉద్యోగులు మరింత సవాలుతో కూడిన పని-జీవితం మధ్య సంఘర్షణను ఎదుర్కొంటున్నారు. కొన్ని టెక్ కంపెనీలు ఇప్పటికే వారానికి 45-50 గంటలు పనిచేసేలా ఉద్యోగులను ఒత్తిడి చేస్తున్నాయని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో కొత్తగూడెం సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తెలంగాణ అసెంబ్లీలో హైదరాబాద్‌లోని ఐటీ ఉద్యోగుల దుస్థితిపై గళం విప్పారు. తెలంగాణలోని సాఫ్ట్‌వేర్ కంపెనీలలో ఎంత మంది ఐటీ ఉద్యోగులు పనిచేస్తున్నారో, వారికి కార్మిక చట్టాలు వర్తిస్తాయో లేదో ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. చాలా మంది సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకు రోజుకు 10 గంటల పని తప్పనిసరి అని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

వారికి పదవీ విరమణ వయస్సు ఉందా . చట్ట ప్రకారం ఏదైనా పదవీ విరమణ ప్రయోజనాలు లేదా ఇతర సౌకర్యాలు ఉన్నాయా అని కూనంనేని నిలదీశారు. ఐటీ దిగ్గజాలు తమ అమాయక ఉద్యోగుల శ్రమను దోచుకుంటున్నారని ఆయన ఆవేదన చెందారు. కంపెనీలు వారి యవ్వనం, శక్తి , తెలివితేటలను దోచుకుంటున్నాయి. లక్షల కోట్లు సంపాదిస్తున్నాయి, కానీ ఉద్యోగులకు సరైన గుర్తింపు ఇవ్వడం లేదని ఆయన విమర్శించారు.

దీని ఫలితంగా ఈ ఉద్యోగులు 50 ఏళ్లకే కీళ్ల , నడుము నొప్పితో వృద్ధులవుతున్నారని కూనంనేని ఆవేదన వ్యక్తం చేశారు. వారు తమ తల్లిదండ్రులతో సమయం గడపలేకపోతున్నారని, భార్యాభర్తలు బయటకు వెళ్లి సినిమా చూడలేరని లేదా తమ పిల్లలతో ఆడుకోలేకపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ఇలా నిండు అసెంబ్లీలో ఏవేవో పక్కదారి పట్టించే టాపిక్ లపై చర్చ జరుగుతున్న వేళ సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని ఐటీ ఉద్యోగుల సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించి వారి పాలిట ఆదర్శప్రాయుడు అయిపోయాడు. ఐటీ ఉద్యోగులపై గళమెత్తిన ఏకైక ఎమ్మెల్యే కూనంనేని అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

Tags:    

Similar News