కొప్పుల హరీశ్వర్‌ రెడ్డి ఇకలేరు!

హరీశ్వర్‌ రెడ్డి అంత్యక్రియలు శనివారం మధ్యాహ్నం 3 గంటలకు పరిగిలో నిర్వహించనున్నారు.

Update: 2023-09-23 03:52 GMT

రెండు తెలుగు రాష్ట్రాల్లో కీలక నేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ లో శాసనసభ డిప్యూటీ స్పీకర్‌ గా పనిచేసిన కొప్పుల హరీశ్వర్‌ రెడ్డి (78) కన్నుమూశారు. గత కొన్నాళ్లుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో సెప్టెంబర్‌ 22 రాత్రి తుదిశ్వాస విడిచారు.

పరిగిలో నివాసముంటున్న ఆయనకు శుక్రవారం రాత్రి 10.10 గంటల సమయంలో గుండెపోటు వచ్చింది. దీంతో కుటుంబ సభ్యులు వెంటనే పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ మరణించారని హరీశ్వర్‌ రెడ్డి కుటుంబసభ్యులు తెలిపారు.

కాగా వార్డు సభ్యుడిగా రాజకీయ జీవితం ప్రారంభించిన హరీశ్వర్‌ రెడ్డి పరిగి ఉపసర్పంచ్‌గా, 1978లో సర్పంచ్‌ గా, సమితి వైస్‌ చైర్మన్‌ గా పనిచేశారు. 1983లో పరిగి నుంచి ఇండిపెండెంట్‌ గా పోటీ చేసి కేవలం 56 ఓట్ల తేడాతో ఓడిపోయారు.

1985లో టీడీపీ ఎమ్మెల్యేగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిగి నుంచి మొదటిసారి హరీశ్వర్‌ రెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1989 ఎన్నికల్లో ఓడిపోయిన ఆయన 1994, 1999, 2004, 2009 ఎన్నికల్లో వరుసగా టీడీపీ తరఫున గెలుపొందారు. తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడిగా పనిచేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ లో డిప్యూటీ స్పీకర్‌ గానూ ఆయన విధులు నిర్వర్తించారు.

తెలంగాణ ఆవిర్భావం తరువాత 2014లో బీఆర్‌ఎస్‌ లో చేరిన ఆయన పరిగి నుంచి ఆ పార్టీ తరఫున పోటీ చేసి 5 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఇక 2018లో బీఆర్‌ఎస్‌ తరఫున హరీశ్వర్‌ రెడ్డి కుమారుడు కొప్పుల మహేశ్‌ రెడ్డి పోటీ చేసి విజయం సాధించారు.

హరీశ్వర్‌ రెడ్డి కన్నుమూయడం పట్ల తెలంగాణ సీఎం కేసీఆర్‌ సంతాపం తెలిపారు. ప్రజలకు హరీశ్వర్‌ రెడ్డి చేసిన సేవలను ఈ సందర్భంగా ఆయన గుర్తుచేసుకున్నారు. హరీశ్వర్‌ రెడ్డి కుటుంబ సభ్యులకు కేసీఆర్‌ ప్రగాఢ సానుభూతి తెలిపారు.

హరీశ్వర్‌ రెడ్డి అంత్యక్రియలు శనివారం మధ్యాహ్నం 3 గంటలకు పరిగిలో నిర్వహించనున్నారు. హరీశ్వర్‌ రెడ్డికి భార్య, ఇద్దరు కుమారులు, కూతురు ఉన్నారు. పెద్ద కుమారుడు మహేశ్‌ రెడ్డి ప్రస్తుతం పరిగి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు.

Tags:    

Similar News