కోరుట్ల ఘటనలో మల్లారెడ్డి, రాంచరణ్ ఎందుకు ఇరుక్కుంటున్నారంటే..
అయితే, ఇదే సమయంలో తెలంగాణ మంత్రి మల్లారెడ్డి, ప్రముఖ సినీ హీరో రాంచరన్ టాపిక్ పేర్లు సైతం సోషల్ మీడియాలో చర్చకు వస్తుండటం గమనార్హం
తెలంగాణలోని కోరుట్లలో అక్కని చంపి బంగారం తీసుకొని ప్రియుడితో లేచిపోయిన అమ్మాయి ఘటన తెలుగు రాష్ట్రాలలో కలకలంగా మారిన సంగతి తెలిసిందే. అత్యంత అవమానకరంగా జరిగిన ఈ ఉదంతంతో ప్రస్తుత జనరేషన్‌లో పిల్లల తీరు, పెంపకంలో తల్లిదండ్రులు పాత్ర, సమాజం, సినిమాలు, ఓటీలు, విద్యాసంస్థలు, నైతిక విలువలు, లవ్ జిహాద్‌లు... ఇలా అన్ని టాపిక్‌లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే, ఇదే సమయంలో తెలంగాణ మంత్రి మల్లారెడ్డి, ప్రముఖ సినీ హీరో రాంచరన్ టాపిక్ పేర్లు సైతం సోషల్ మీడియాలో చర్చకు వస్తుండటం గమనార్హం.
ఏపీ మూలాలు ఉండి హైదరాబాద్‌లో సెటిల్ అయి బీటెక్‌లో తనకు సీనియర్ అయిన ఒమర్ అనే వ్యక్తిని ప్రేమంచిన చందన అనే కోరుట్ల అమ్మాయి, అతన్నే వివాహం చేసుకునేందుకు నిర్ణయం తీసుకోవడం, ఇందుకు అడ్డు వచ్చిన అక్కను అత్యంత దారుణంగా చంపి ఇంటి నుంచి పారిపోయిన ఘటన అత్యంత వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై సోషల్ మీడియాలో అనేకానేక చర్చలు జరుగుతున్నాయి. ''మనం ఎంత సంపాదిస్తున్నాం అన్నది కాదు ముఖ్యం.. మన పిల్లలను ఎంత బాధ్యత, క్రమశిక్షణ, విలువలు, సభ్యత, సంస్కారాలతో పెంచుతున్నామన్నదే ముఖ్యం.'' అంటూ ఓ నెటిజన్ స్పందించారు.
''ఎదవ సమాజాన్ని ఉద్ధరించడం ఎవరి తరం కాదు కానీ.. ఇంట్లో ఆడపిల్లలని కాపాడుకోండయ్యా బాబు ముందు! కాలేజీలు, ఉద్యోగాల్లో వాళ్ళు ఎవరిని కలుస్తున్నారు? ఎవరితో మాట్లాడుతున్నారు? ఎవరెవరు మీ ఇంటికి వస్తున్నారు గమనించండి. దిశ, నిర్భయ, పోక్సో కాదు కదా.. ఇంకెన్ని చట్టాలు వచ్చినా వాళ్ళలో భయం రాదు, పోయిన ప్రాణాలు తిరిగి రావు.. బాధిత తలిదండ్రులకి ఎప్పటికీ న్యాయం జరగదు. #తస్మాత్‌జాగ్రత్త 🙏'' అంటూ ఓ సీనియర్ పాత్రికేయుడు తన ఆక్రోశాన్ని వ్యక్తం చేశారు.
మరో నెటిజన్ మాత్రం చిత్రమైన కామెంట్ చేశారు. 'చందన చదివింది మంత్రి మల్లారెడ్డి కాలేజీలో. సాక్షాత్తు ఆయనే గతంలో ఓ సారి అమ్మాయిలను ప్రేమించడం, డబ్బున్న వాళ్లకు లైన్ వేయడానికి రాంచరణ్‌ను స్ఫూర్తిగా తీసుకోండి అని లెక్చర్ ఇచ్చారు. బహుశా ఈ ఇద్దరు స్టూడెంట్లు ఆయన మాటలను సీరియస్‌గా తీసుకున్నట్లున్నారు' అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.