పవన్ కు నచ్చిన ఐఏఎస్ ను ఏపీకి రప్పించేస్తున్నారా?

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా.. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ, సైన్స్ & టెక్నాలజీ శాఖల మంత్రిగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ బాధ్యతలు తీసుకున్న సంగతి తెలిసిందే

Update: 2024-06-20 06:12 GMT

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా.. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ, సైన్స్ & టెక్నాలజీ శాఖల మంత్రిగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ బాధ్యతలు తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో పవన్ అత్యంత నమ్మకస్తుడు, సమర్థుడు, అవినీతి మరకలు అంటని ఒక కీలక అధికారి ని ఎంపిక చేసుకునే పనిలో ఉన్నారని.. ఈ విషయంలో ఇప్పటికే ఒక క్లారిటీకి వచ్చారని అంటున్నారు.

అవును... ఏపీలో అత్యంత కీలకమైన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి వంటి కీలక శాఖల బాధ్యతలు తీసుకున్నారు పవన్ కల్యాణ్. ఏపీలో ప్రభుత్వ పాలనకు ప్రధానంగా ఈ రెండు శాఖలు అద్దంపడుతుంటాయి. గ్రామీణ ప్రాంతంలో ప్రజలకు ఈ రెండు శాఖలూ దగ్గరగా ఉంటాయి. దీంతో వీటిని సమర్ధంగా నడిపించడం ఇప్పుడు జనసేనాని ముందున్న ప్రధాన కర్తవ్యం.

దీంతో... ప్రధానంగా ఈ రెండు శాఖలపైనా పవన్ మనసుపెట్టారని అంటున్నారు. దీనికోసం నిరంతరాయంగా పనిచేయాల్సి ఉంటుందని భావిస్తున్నారని అంటున్నారు. అయితే... పవన్ సినిమాలను పూర్తిగా దూరంపెట్టరనే కామెంట్లు వినిపిస్తున్న నేపథ్యంలో... నమ్మకస్తుడు, పనిచేయాలనే కసి ఉన్న అధికారి కోసం పవన్ ఎదురుచూస్తున్నారని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఒక అధికారి పేరు ప్రముఖంగా వినిపిస్తుంది.

ఇందులో భాగంగా... కేరళ క్యాడర్ తెలుగు ఐఏఎస్ అధికారి కృష్ణతేజపై పవన్ మనసుపెట్టుకున్నట్లు తెలుస్తుంది. తెలుగువారైన కృష్ణతేజ తన పనితీరుతో జాతీయస్థాయిలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. పైగా అతనిపై అవినీతి మరకలు లేవని చెబుతున్నారు. దీంతో కృష్ణతేజను ఏపీకి డిప్యుటేషన్ పై రప్పించి ఆపరేషన్ ఆన్ స్పెషల్ డ్యూటీగా నియమించుకోవాలని పవన్ ప్రయత్నిస్తున్నారని తెలుస్తుంది.

గతంలో పవన్ ను కృష్ణతేజ ఓసారి కలుసుకున్నారు కూడా. ఈ సమయంలోనే ఇద్దరికీ వేవ్ లెంగ్త్ బాగా కలిసిందని.. అందువల్ల కృష్ణతేజ ను ఏపీకి రప్పించే ప్రయత్నాల్లో పవన్ బిజీగా ఉన్నారని అంటున్నారు. పైగా కేంద్రంలో ఉన్నది ఎన్డీయే ప్రభుత్వమే కావడంతో... కృష్ణతేజను ఏపీకి రప్పించుకోవడం పెద్ద విషయం కాదని అంటున్నారు. అన్నీ అనుకూలంగా జరిగితే... వీలైనంత తొందర్లోనే కృష్ణతేజ ఏపీకి వచ్చి పవన్ శాఖలో పనిచేస్తారని అంటున్నారు.

Tags:    

Similar News