దమ్ముంటే అరెస్ట్ చేయండి.. కేటీఆర్ ఇంటి వద్ద హైడ్రామా
తెలంగాణ రాష్ట్రంలో లగచర్ల ఘటన హాట్‌హాట్‌గా మారింది. రెండు రోజులుగా ఈ వివాదం రాష్ట్రం మొత్తాన్ని కుదిపేస్తోంది.
తెలంగాణ రాష్ట్రంలో లగచర్ల ఘటన హాట్‌హాట్‌గా మారింది. రెండు రోజులుగా ఈ వివాదం రాష్ట్రం మొత్తాన్ని కుదిపేస్తోంది. ఏకంగా కలెక్టర్ మీద దాడికి ప్రయత్నించడంతో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగులు నిరసనలకు దిగారు. మరోవైపు.. ఈ ఘటన రాజకీయ పరంగానూ సెన్సేషనల్ అయింది. మరోవైపు ఈ అంశాన్ని ప్రభుత్వం కూడా సీరియస్‌గా తీసుకుంది.
ఇప్పటికే ఈ ఘటనలో సురేశ్ అనే వ్యక్తి ప్రధాన నిందితుడిగా పోలీసులు భావిస్తున్నారు. దాడి చేసినప్పటి నుంచి అతను పరారీలో ఉన్నాడు. అయితే.. సురేశ్‌తో కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డితో సంబంధాలు ఉండడం, దాడికి నరేందర్ రెడ్డినే ఉసిగొల్పడాన్ని పోలీసులు కనిపెట్టారు. నరేందర్ రెడ్డి ప్రజలను, రైతులను రెచ్చగొట్టారన్న ఆరోపణలు రావడమే కాకుండా.. సురేశ్‌తో ఆయన 82 సార్లు ఫోన్లు మాట్లాడినట్లుగానూ పోలీసులు గుర్తించారు. ఇదే క్రమంలో నిన్న నరేందర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనను ఏ1 నిందితుడిగానూ చేర్చారు. అయితే.. పోలీసులు రూపొందించిన రిమాండ్ రిపోర్టులో మరిన్ని కీలక అంశాలు జోడించారు.
ఈ కేసులో నరేందర్ రెడ్డి కేటీఆర్ పేరును సైతం ప్రస్తావించారు. కేటీఆర్, నరేందర్ రెడ్డి డైరెక్షన్‌లోనే ఈ దాడి జరిగినట్లుగా రిమాండ్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు. దీంతో ఈ కేసులో ఇప్పటికే నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేయగా.. కేటీఆర్‌ను సైతం అరెస్ట్ చేస్తారని నిన్న రాత్రి నుంచి ప్రచారం జరుగుతోంది. దాంతో రాత్రికి రాత్రి చాలా మంది బీఆర్ఎస్ నేతలు, మద్దతుదారులు కేటీఆర్ ఇంటికి చేరుకున్నారు. భారీ గుంపు తరలిరావడంతో రాత్రంతా కేటీఆర్ ఇంటి వద్ద హైడ్రామా కొనసాగింది.
ఇక ఈ రోజు ఉదయం తన అరెస్టుపై కేటీఆర్ స్పందించారు. చేతనైతే తనన అరెస్ట్ చేయాలని సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. రూ.50 లక్షల లంచం తీసుకుంటూ పట్టుబడిన వ్యక్తి రేవంత్‌కు అన్నీ కుట్రగానే కనిపిస్తాయని, అల్లుడి ఫార్మా కంపెనీకి రైతులు నిరసన తెలిపితే కుట్ర ఎలా అవుతుందని నిలదీశారు. ఇద్దరు వ్యక్తులు ఫోన్‌లో మాట్లాడుకుంటే కూడా కుట్ర అవుతుందా అని ప్రశ్నించారు. తొమ్మిది నెలలుగా సీఎం అపాయింట్మెంట్ కోసం రైతులు ప్రయత్నిస్తున్నా దొరకడం లేదని, అందుకే వారు తిరుగుబాటుకు దిగారని పేర్కొన్నారు. అది కూడా కుట్రే అవుతుందా అని అన్నారు. పేద రైతు కుటుంబాలపై అర్ధరాత్రి దాడులు చేసి.. అక్రమ అరెస్టులు చిత్రహింసలకు గురిచేసినందుకు ప్రశ్నిస్తే తాను చేసింది కుట్రనా అని నిలదీశారు. తనను అరెస్ట్ చేయండి అని సవాల్ చేశారు. తెలంగాణ రైతులకు అండగా నిలిచినందుకు తల నిమురుతూ జైలుకు వెళ్తాను అని చెప్పారు.