ఎవరీ భానుప్రియ మీనా? ఈ వీడియో చూస్తే ఆమె మరింత అర్థమవుతారు
అప్పటికే సెర్చ్ అయిపోయిందని.. అరెస్టు వారెంట్ ప్రొడ్యూస్ చేసిన తర్వాత కూడా కుటుంబ సభ్యులు లోపలికి రావొద్దని ఎలా చెప్తున్నారు? అంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.
భానుప్రియ మీనా. తెలుగు రాష్ట్రాల్లోని తెలుగు ప్రజలు ఇప్పుడు ఆమె గురించి ఆసక్తికరంగా చర్చించుకుంటున్నారు. ఢిల్లీ మద్యం కేసులో ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేసే సందర్భంలో మాజీ మంత్రి కేటీఆర్ ఆమెతో వాగ్వాదం చేయటం తెలిసిందే. విచారణ చేస్తున్న వేళ.. గది లోపలకు ఎలా వస్తారంటూ కేటీఆర్.. హరీశ్ రావులను నిలదీయటం.. ఈ అంశాన్ని వీడియో తీయాలంటూ మరో ఈడీ అధికారికి ఆమె ఆదేశించటం.. ఈ క్రమంలో ఆమెతో కేటీఆర్ వాగ్వాదానికి దిగారు.
అప్పటికే సెర్చ్ అయిపోయిందని.. అరెస్టు వారెంట్ ప్రొడ్యూస్ చేసిన తర్వాత కూడా కుటుంబ సభ్యులు లోపలికి రావొద్దని ఎలా చెప్తున్నారు? అంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ నోటి నుంచి 'భానుప్రియ మీనా' పేరును పలుకుతూ ఆయన మాట్లాడిన మాటల వీడియో వైరల్ అయ్యింది. ఈ వీడియోను టీఆర్ఎస్ వర్గాలు విడుదల చేసినట్లుగా చెబుతున్నారు. ఇందులో కేటీఆర్ మాట్లాడుతూ.. 'ఎలాంటి ట్రాన్సిట్ వారెంట్ లేకుండా.. మేజిస్ట్రేట్ ముందు హాజరుపర్చకుండానే కేసు చేస్తామంటున్నారు. కావాలనే శుక్రవారం వచ్చి అరెస్టు చేస్తున్నారు. మీరు ఎలాంటి తీవ్ర చర్యలు తీసుకోబోమని సుప్రీంకోర్టుకు అండర్ టేకింగ్ ఇచ్చారు. ఇప్పుడు దాన్ని మీరే ఉల్లంఘిస్తున్నారు. దీని వల్ల సీరియస్ ట్రబుల్ లో పడతారు'' అంటూ కేటీఆర్ మాటల వీడియో పెద్ద ఎత్తున షేర్ అయ్యింది.
అయితే.. విచారణ వేళలో గదిలోకి రావటాన్ని ఐఆర్ఎస్ అధికారి భానుప్రియ మీనా అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎలాంటి జంకు లేకుండా ఆమె డ్యాషింగ్ గా మాట్లాడిన తీరు అందరిని ఆకర్షిస్తోంది. తనిఖీలు జరుగుతున్నప్పుడు అనుమతి లేకుండా కేటీఆర్.. హరీశ్ రావులు రావటాన్ని ఆమె తప్పుపట్టారు. ఈ తీరుతో ఎవరీ భానుప్రియ మీనా అన్నదిప్పుడు ఆసక్తికరంగా మారింది.
2015 బ్యాచ్ కు చెందిన ఐఆర్ఎస్ అధికారిణి అయిన ఆమె.. ప్రస్తుతం ఈడీలో డైరెక్టర్ హోదాలో పని చేస్తున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాంను ఆమె పర్యవేక్షిస్తున్నారు. ఆమెతో పాటు.. ఈడీ ఉన్నతాధికారులు తమను టార్చర్ పెడుతున్నట్లుగా ఆర్ రాజ్య సభ సభ్యుడు ఒకరు గతంలో తీవ్ర ఆరోపణలు చేయటం ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. ఇక.. భానుప్రియ మీనా విషయానికి వస్తే.. విధి నిర్వహణలో ముక్కుసూటిగా ఉంటారని చెబుతున్నారు. బయటకు పెద్దగా రాని ఆమె.. రెండేళ్ల క్రితం ఒక పాడ్ కాస్ట్ ఇచ్చారు. దాదాపు అరగంట నిడివి ఉన్న ఈ వీడియోలో ఆమె పలు అంశాల్ని ప్రస్తావించారు.
ఆమె మాటల్ని చూసినప్పుడు.. ఆమె భావజాలంతో పాటు.. ఆమె ఎలా వ్యవహరిస్తారన్న విషయం అర్థమవుతుంది. ఒక స్వతంత్ర భావాలున్న మహిళగా.. తాను చేస్తున్నపనికి సంబంధించి నిబద్దతతో వ్యవహరించే అధికారిణిగా ఆమెను చెప్పాల్సి ఉంటుంది. ఈ తరం మహిళగా తన అభిప్రాయాల్ని ఎలాంటి మొహమాటం లేకుండా చెప్పే ఆమె.. సోషల్ మీడియాను ఎక్కువగా ఫాలో అవుతుంటారు. సోషల్ మీడియాతో పాటు.. ఆన్ లైన్ సమాచారాన్ని తరచూ చెక్ చేసుకోవటం ఆమెకు ఒక అలవాటుగా చెబుతున్నారు. మొత్తంగా ఆమె తీరు గురించి తెలుసుకోవటానికి యూట్యూబ్ లో అందుబాటులో ఉన్న ఈ వీడియో మరింత ఉపయోగంగా ఉంటుందని చెప్పక తప్పదు.