బ్రేక్ డ్యాన్సుల వ్యాఖ్యలపై వివరణ ఇచ్చిన కేటీఆర్!
ఈ సమయంలో... మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం విషయంలో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను తెలంగాణ మహిళా కమిషన్ సుమోటోగా తీసుకుంది.
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం విషయంలో బీఆరెస్స్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో... మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం విషయంలో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను తెలంగాణ మహిళా కమిషన్ సుమోటోగా తీసుకుంది. ఈ నేపథ్యంలో కేటీఆర్ రియాక్ట్ అయ్యారు!
అవును... మహిళల పట్ల కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయని, తెలంగాణ మహిళలను కించపరిచేలా ఉన్నాయని రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ శారద నేరెళ్ల స్పందించిన సంగతి తెలిసిందే. దీంతో... ఈ వ్యాఖ్యలను సుమోటోగా తీసుకున్నారు. ఈ వ్యవహారం తీవ్ర వివాదం అవుతోంది. మరోపక్క కేటీఆర్ వ్యాఖ్యలను ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు.
దీంతో... కేటీఆర్ స్పందించారు. ఇందులో భాగంగా.. "నిన్న పార్టీ సమావేశంలో యథాలాపంగా చేసిన వ్యాఖ్యల వల్ల మా మహిళా సోదరీమణులకు మనస్తాపం కలిగితే, నేను విచారం వ్యక్తం చేస్తున్నాను. నా అక్కచెల్లెమ్మలను కించపరిచే ఉద్దేశ్యం ఎప్పుడూ లేదు" అని కేటీఆర్ రియాక్ట్ అయ్యారు. ఈ మేరకు ఎక్స్ లో పోస్ట్ పెట్టారు.
కాగా... బస్సుల్లో అల్లం వెల్లుల్లి, కుట్లు అల్లికలు చేసుకుంటే తప్పేమిటి అంటూ తెలంగాణ పంచాయతీరాజ్, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ రియాక్ట్ అవుతూ కొన్ని అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... బస్సులో అల్లం వెల్లుల్లి, కుట్లు అల్లికలే కాదు అవసరమైతే బ్రేక్ డ్యాన్సులు కూడా వెసుకోవచ్చు అని అన్నారు!
దీంతో.. మంత్రి సీతక్క గట్టిగా తగులుకున్నారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలు బ్రేక్ డ్యాన్సులు, రికార్డింగ్ డ్యాన్సులు చేసుకోవచ్చంటూ కేటీఆర్ జుగుప్సకరంగా మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్ తండ్రి ఆయనకు నేర్పిన సంస్కారం ఇదేనా అంటూ ప్రశ్నించారు. కేటీఆర్ కు మహిళలు అంటే గౌరవం లేదని ఫైర్ అయ్యారు. కేటీఆర్.. తెలంగాణ మహిళా లోకానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు!
ఈ నేపథ్యంలోనే స్పందించిన కేటీఆర్... తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో మహిళ ప్రయాణం విషయంలో తాను చేసిన వ్యాఖ్యలు యథాలాపంగా చేసినవి అని ఆయన చెప్పుకొచ్చారు! ఈ విషయంలో మహిళా సోదరీమణులకు మనస్తాపం కలిగితే, దానికి తాను విచారం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. దీంతో.. ఈ వివాదం సద్దుమణిగినట్లేనా అనే కామెంట్లు వినిపిస్తున్నాయి!