సీఎం రేవంత్ అలా చెబుతుంటే.. ఈ సవాళ్లేంది కేటీఆర్?
అయితే.. ఈ మాటల్ని మాజీ మంత్రి కేటీఆర్ అస్సలు పట్టించుకోవటం లేదు. తన మానాన తాను చెప్పాల్సింది చెప్పుకుంటూ పోతున్నారు.
నిద్ర లేచింది మొదలు పడుకునే వరకు మాజీ మంత్రి కేటీఆర్ తీరు చూస్తే.. తాను అనుకున్నది మాత్రమే తప్పించి.. ఎదుటోళ్లు చెప్పిందేదీ వినిపించుకునే స్థితిలో ఆయన లేనట్లుగా కనిపిస్తోంది. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలే దీనికి నిదర్శనం. ఒకవైపు రైతుల రుణమాఫీపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టంగా చెప్పేస్తున్నప్పటికీ.. ఆ వివరాల్ని పట్టించుకోకుండా తన ధోరణిలో తాను చెప్పుకుంటూ పోతున్న వైనం విచిత్రంగా ఉందని చెప్పాలి. రూ.2 లక్షల వరకు రుణమాఫీని చేసుకుంటూ పోతున్నట్లుగా ముఖ్యమంత్రి రేవంత్ స్పష్టంగా చెబుతున్నారు. అయితే.. ఈ మాటల్ని మాజీ మంత్రి కేటీఆర్ అస్సలు పట్టించుకోవటం లేదు. తన మానాన తాను చెప్పాల్సింది చెప్పుకుంటూ పోతున్నారు.
తాజాగా రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో మాట్లాడిన కేటీఆర్.. ‘‘రూ.49వేల కోట్ల నుంచి రూ.7500 కోట్లకు రుణమాఫీని తీసుకొచ్చారు. ఎన్నికలకు ముందు ఓట్ల కోసం ఎలాంటి షరతులు లేకుండా డిసెంబరు 9నాడే మొదటి సంతకం చేసి రూ.లక్షల వరకు రుణమాఫీ చేస్తామని సోనియాగాంధీ మీద ఒట్టేసి చెప్పిన రేవంత్ అధికారంలోకి రాగానే తప్పించుకునేందుకు లెక్కలు చెబుతున్నాడు. మొదట రూ.49వేల కోట్లు బ్యాంకులకు చెల్లిస్తామని చెప్పాడు. ఆ తర్వాత కాబినెట్ లో దాన్ని రూ.31 వేల కోట్లకు తగ్గించాడు. అనంతరం బడ్జెట్ లో రూ.26 వేల కోట్లు మాత్రమే పెట్టాడు. తర్వాత కనీసం రూ.17 వేల కోట్లు అయినా మాఫీ అయ్యాయని అనుకుంటుంటే.. రైతుల ఖాతాల్లోకి రూ.7500 కోట్లే జమ అయినట్లుగా డిప్యూటీ సీఎం భట్టి చెప్పారు’’ అంటూ మండిపడ్డారు.
ఇప్పటివరకు రైతులకు రుణమాఫీ కింద రూ.12వేల కోట్లు ఖర్చు చేసిన విషయాన్ని స్పష్టం చేస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మిగిలిన మొత్తాన్ని తమ ప్రభుత్వం ఇస్తుందని చెబుతున్న ఆయన.. ప్రతి జిల్లా కలెక్టరేట్ లో కేంద్రాల్ని ఏర్పాటు చేశామని.. రుణమాఫీ కాని రైతులు రోడ్లు ఎక్కే కన్నా.. కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి అధికారుల్ని కలిస్తే సమస్యకు పరిష్కారం దొరుకుతుందని సీఎం రేవంత్ స్పష్టం చేస్తున్నారు.
మరోవైపు కేటీఆర్ వ్యాఖ్యలు ఇంకోలా ఉన్నాయి. రాష్ట్రంలోని ఏ గ్రామానికైనా నువ్వు.. నేను ఇద్దరం కలిసి వెళదాం. నీ సొంతూరు కొండారెడ్డి పల్లి అయినా.. కొడంగల్ అయినా సరే. రుణమాఫీ వంద శాతం జరిగిందని నిరూపిస్తూ నేను అక్కడికక్కడే రాజీనామా చేసి వెళ్లిపోతా’’ అంటూ సవాలు విసిరారు కేటీఆర్. ఓవైపు ముఖ్యమంత్రి రేవంతే.. రుణమాఫీ జరుగుతోందని.. కొందరు రైతులకు కాలేదని.. సాంకేతిక అంశాల కారణంగా వాటిని పూర్తి చేస్తామని చెప్పిన తర్వాత కూడా.. ఆ మాటల్ని పరిగణలోకి తీసుకోకుండా సవాలు విసరటంలో అర్థముందా? అన్నది అసలు ప్రశ్న.
ఇక్కడే ఒక అంశాన్ని ప్రస్తావించాలి.డబుల్ బెడ్రూం ఇళ్లను వేలాదిగా నిర్మించిన కేసీఆర్ ప్రభుత్వం.. తన పదేళ్ల కాలంలో కట్టించిన వాటిని సైతం పంపిణీ చేయలేదు. మరి.. దీన్ని ఏమనాలి? కానీ.. ఎన్నికల ప్రచారంలో డబుల్ బెడ్రూం ఇళ్లను తాము ఇచ్చినట్లుగా చెప్పుకున్నారు. అంటే.. ఒక పథకాన్ని అమలు చేస్తున్నప్పుడు.. దాన్ని సంపూర్ణంగా పూర్తి చేశామని ప్రభుత్వం ప్రకటిస్తే.. ఇలాంటి సవాళ్లు విసరటంలో అర్థముంది. అందుకు భిన్నంగా.. ప్రభుత్వమే.. ఒకవైపు రుణమాఫీ కార్యక్రమం జరుగుతుందని చెప్పిన తర్వాత.. దాని మీద హడావుడి సవాళ్లు విసరటంలో ఏమైనా అర్థముందా కేటీఆర్? అన్న మాట పలువురి నోట వినిపిస్తోంది.