రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టకూడదా? కేటీఆర్ వాదనలో పస ఎంత?
ఎవరు అవునన్నా.. కాదన్నా రాజకీయాలు కక్షలు.. కార్పణ్యాలు తెచ్చి పెడుతుంటాయి.
ఎవరు అవునన్నా.. కాదన్నా రాజకీయాలు కక్షలు.. కార్పణ్యాలు తెచ్చి పెడుతుంటాయి. రోజులు గడిచే కొద్దీ ఈ తీరు అంతకంతకూ ఎక్కువ అవుతోంది. ఇలాంటి తీరును స్వాగతిద్దామా? అన్నది ప్రశ్న. సచివాలయం ఎదుట రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామన్న రేవంత్ రెడ్డి ప్రకటనకు.. ఏ మాత్రం ఊహించని రీతిలో రియాక్టు అయ్యారు కేటీఆర్. రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే.. తాము అధికారంలోకి వచ్చిన మొదటిరోజే కూల్చేస్తామన్న సంచలన వ్యాఖ్య చేశారు.
ఇప్పటివరకు తెలంగాణకు లేని సరికొత్త కల్చర్ ను కేటీఆర్ తన మాటలతో తీసుకొస్తున్నారన్నది చెప్పాలి. అధికారం చేజారిన తర్వాత నుంచి కేటీఆర్ మాట తీరులో మార్పు వచ్చేసింది. అవసరానికి మించిన ఆవేశాన్ని ఆయన ప్రదర్శిస్తున్నారు. అత్యుత్సాహాన్ని చూపిస్తున్నారు. రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఎలా ఏర్పాటు చేస్తారని ప్రశ్నిస్తున్నారు. కేటీఆర్ తానా అంటే తందానా అనేందుకు సిద్దంగా ఉండే మరికొందరు గొంతు కలుపుతూ.. నిజమే కదా.. రాజీవ్ కు తెలంగాణకు ఏం సంబంధం ఉందంటూ కొత్త లా పాయింట్ తెర మీదకు తెస్తున్నారు.
మాజీ ప్రధానమంత్రిగా కానీ మరో రకంగా కానీ రాజీవ్ గాంధీని మర్చిపోవచ్చు. ఆయనకు తెలంగాణకు పెద్దగా లింకులు లేవని సర్ది చెప్పుకోవచ్చు. కానీ.. దశాబ్దాల డిమాండ్ ను.. కలలా మిగిలిపోతుందా అన్న తెలంగాణ ఆవిర్భావాన్ని కాదంటూ.. తాను ఉన్నానంటూ సోనియాగాంధీ ఇచ్చిన మాట మీద నిలబడి తెలంగాణ స్వప్నాన్ని సాకారం చేసిన విషయాన్ని మర్చిపోకూడదు. సోనియాకు బహుమతిగా తెలంగాణ ప్రజలు ఇప్పటివరకు ఇచ్చిందేమీ లేదు. అధికారాన్ని సైతం పదేళ్ల తర్వాత ఇచ్చారు.
అలాంటప్పుడు సోనియాగాంధీ భర్తగా రాజీవ్ గాంధీనికి ఎందుకు గుర్తుంచుకోకూడదు. తెలంగాణ సాకారానికి వీలుగా తానే అంతా అయి నడిచిన సోనియమ్మ పట్ల కృతజ్ఞతను ప్రదర్శించే ఏ చిన్న అవకాశాన్ని ఎందుకు వదులుకోవాలి? తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ చెప్పినట్లు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయటంలో తప్పేముంది? కానీ.. ఏర్పాటు చేసిన విగ్రహాన్ని అధికారంలోకి వచ్చిన మొదటి రోజునే కూల్చేస్తామన్న మాటలు ఏ మాత్రం మంచివి కావు. గడీలను బద్ధలు కొట్టాలే కానీ.. తెలంగాణ స్వప్నాన్ని సాకారం చేసిన వ్యక్తి భర్త విగ్రహాన్ని ఏర్పాటు చేయటం తప్పేం కాదు.
నిత్యం ఏదో ఒకటి మాట్లాడాలి. తానో సంచలనంగా మారాలన్నట్లుగా మాజీ మంత్రి కేటీఆర్ మాటలు ఉంటున్నాయి. తనకు మించిన తెలివైనోడు మరెవరూ ఉండరన్నట్లుగా కేటీఆర్ తీరు ఉంటోంది. ఈ తరహా వ్యవహారశైలి తెలంగాణ ప్రజలకు ఏ మాత్రం నచ్చదన్న చిన్న విషయాన్ని కేటీఆర్ ఎందుకు మిస్ అవుతున్నారు. ఏ అహంభావాన్ని తిరస్కరిస్తూ.. పదేళ్లు ఇచ్చిన అధికారాన్నితిరిగి వాపసు తీసేసుకున్న తర్వాత కూడా తెలంగాణ ప్రజలు తమ నుంచి ఏం కోరుకుంటున్నారన్న కనీస విషయాన్ని కేటీఆర్ ఎందుకు గుర్తించలేకపోతున్నట్లు? అన్నది అతి పెద్ద ప్రశ్న.