ఉక్కు లాంటి మాట చెప్పు కుమారస్వామి !

విశాఖ ఉక్కు ని ప్రైవేట్ పరం చేసేది ఉండదని ఇక ఆ విషయం మరచిపోవచ్చునని లాభాల బాటను తొందర్లోనే పట్టిస్తామని కుమారస్వామి ఇప్పటికే చెప్పారు.

Update: 2025-01-29 17:30 GMT

విశాఖ ఉక్కు కర్మాగారానికి భారీ ఆర్ధిక ప్యాకేజీ కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన తరువాత కేంద్ర ఉక్కు మంత్రి కుమారస్వామి ఈ నెల 30న విశాఖ వస్తున్నారు. ఆయన ఉక్కు కర్మాగారాన్ని సందర్శించి ఉన్నతాధికారులతో కీలక సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. విశాఖ ఉక్కు ని ప్రైవేట్ పరం చేసేది ఉండదని ఇక ఆ విషయం మరచిపోవచ్చునని లాభాల బాటను తొందర్లోనే పట్టిస్తామని కుమారస్వామి ఇప్పటికే చెప్పారు.

అయితే భారీ ప్యాకేజీ తరువాత కూడా ఉక్కు కార్మిక లోకం అసంతృప్తిని వ్యక్తం చేస్తోంది. వరసబెట్టి కాంట్రాక్టు సిబ్బందిని తీసేస్తున్నారని మరో వైపు వీఆర్ ఎస్ ద్వారా రెండు వేల మంది పర్మినెంట్ ఉద్యోగులను సాగనంపాలని లక్ష్యంగా పెట్టుకున్నారని ఆరోపిస్తోంది. గత నాలుగు నెలలుగా కార్మికులకు జీతాలు సరిగ్గా ఇవ్వడం లేదని ఉక్కుని ప్రైవేట్ దిశగా నడిపిస్తున్నారని ఆరోపిస్తున్నారు.

తాము డిమాండ్ చేసినట్లుగా విశాఖ ఉక్కుని సెయిల్ లో విలీనం చేయాలని లేదా సొంత గనులు కేటాయించి ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేట్ పరం చేయబోమని ప్రకటించాలని విశాఖ ఉక్కు కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. విశాఖ ఉక్కు విషయంలో అనేక సందేహాలు ఉన్న వేళ విశాఖ వస్తున్న కేంద్ర మంత్రి కుమార స్వామి వాటిని తీర్చాలని వారు కోరుతున్నారు.

అయితే విశాఖ వస్తున్న కేంద్ర మంత్రిని కలవాలని కార్మిక సంఘాలు చూస్తున్నా వారికి అపాయింట్మెంట్ అయితే లేదని అంటున్నారు. కేవలం అధికారులతో సమీక్ష చేసి విశాఖ ఉక్కు కర్మాగారం గురించి గ్రౌండ్ రియాలిటీని తెలుసుకోవడానికే కేంద్ర మంత్రి వస్తున్నారుని అంటున్నారు.

అయితే కేంద్ర మంత్రి విశాఖ స్టీల్ ప్లాంట్ ని సందర్శించడాన్ని తమకు అనుకూలంగా మార్చుకుంటోంది బీజేపీ. కేంద్ర మంత్రికి ఘన స్వాతగం పలకడం ద్వారా భారీ ప్యాకేజిని తాము ప్రకటించామని ఆ క్రెడిట్ ని పూర్తిగా తీసుకోవాలని చూస్తోంది. జేడీఎస్ కి చెందిన కేంద్ర మంత్రికి విశాఖలో అయితే రాజకీయ లాభం లేదు. ఆ పార్టీ కూడా ఏపీలో లేదు.

దాంతో బీజేపీ తమ ఘనత ఇదంతా అని చెప్పుకుంటోంది. అయితే బీజేపీ ఈ క్రెడిట్ తీసుకోవడానికి ముందు చేయాల్సినవి చాలా ఉన్నాయని కార్మిక సంఘాలు అంటున్నాయి. తమ డిమాండ్లు నెరవేరిస్తే తామే కేంద్రాన్ని మెచ్చుకుంటామని అంటున్నారు. అయితే విశాఖ వస్తున్న కుమార స్వామి ఏమి చెబుతారు ఏ రకమైన ప్రకటనలు చేస్తారు అన్నది అంతా చర్చిస్తున్నారు.

స్టీల్ ప్లాంట్ కి సొంత గనులు కేటాయిస్తామని చెబుతారా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అలాగే కార్మికులను తొలగించమని కూడా స్పష్టమైన హామీ ఇవ్వాలని కోరుతున్నారు. అయితే కుమారస్వామి పర్యటన మాత్రం పెద్ద ఎత్తున ఘన స్వాగతంతో సాగేలా చూడాలని బీజేపీ చూస్తోంది. మరి కార్మిక సంఘాలు కుమారస్వామి మేము చేసిన నేరమేమి అని అంటున్నారు. తమతో కేంద్ర మంత్రి భేటీ కావాలని తమ సమస్యలను ఆయన పూర్తిగా విని వాటిని పరిష్కరించాలని కోరుతున్నారు. మొత్తానికి కుమారస్వామి పర్యటన అయితే సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది. ఏమి జరుగుతుందో చూడాల్సి ఉంది.

Tags:    

Similar News