కూటమి ప్రభుత్వం సూపర్స్ సిక్స్ లో సగం పాసైనట్లేనా?

ఏపీ శాసనసభలో 2025-26 వార్షిక బడ్జెట్ ను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టారు.;

Update: 2025-03-01 00:30 GMT

ఏపీ శాసనసభలో 2025-26 వార్షిక బడ్జెట్ ను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టారు. ఇందులో భాగంగా.. రూ.3.22 లక్షల కోట్లతో బడ్జెట్ ను తీసుకొచ్చారు. ఈ సమయంలో ప్రధానంగా సూపర్ సిక్స్ పథకాలకు కేటాయింపులపై ప్రజలు ఎంతో ఆతృతగా ఎదురు చూశారని అంటున్నారు. ఈ సమయంలో సూపర్ సిక్స్ పథకాల్లో కూటమి ప్రభుత్వం ఏ మేరకు పాస్ అయ్యిందనేది ఆసక్తిగా మారింది.

ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారిగా పూర్తిస్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ప్రధానంగా సూపర్ సిక్స్ పథకాలకు కేటాయించిన నిధులపై తీవ్ర చర్చ మొదలైంది. దీనిపై వైసీపీ నేతలు విమర్శలు గుప్పించడం మొదలుపెట్టారు. ఈ సందర్భంగా... సూపర్ సిక్స్ హామీలు ఏమిటి.. వాటికి ఎంత నిధులు అవసరం.. ప్రభుత్వం కేటాయించింది ఎంత అనేది ఇప్పుడు చూద్దామ్..!

కూటమి ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల్లో మొట్ట మొదటి హామీ.. నెలకు రూ.3000 నిరుద్యోగ భృతి అనే సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రాష్ట్రంలో సుమారు 50 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారని అంటున్నారు. అయితే... ఈ బడ్జెట్ లో ఈ సూపర్ సిక్స్ ఫస్ట్ హామీకి ఒక్క రూపాయి కూడ కేటాయించలేదనే విమర్శ బలంగా వినిపిస్తుంది. ఇది కూటమికి కాస్త ఇబ్బందికరమైన విషయమే అని అంటున్నారు.

ఇక సూపర్ సిక్స్ హామీల్లో రెండో హామీ అయిన "స్కూలుకు వెళ్లే ప్రతీ విద్యార్థికీ ఏడాదికి రూ.15,000 (తల్లికి వందనం) పథకానికి కూటమి ప్రభుత్వం ఈ 2025-26 విద్యా సంవత్సరానికి కేటాయింపులు చేసింది. ఇందులో భాగంగా... ఈ పథకానికి రూ.9,407 కోట్లు కేటాయించింది. అయితే... రాష్ట్రంలో 81 లక్షల మంది విద్యార్థులు ఉన్నారని.. వారికి రూ.12వేల కోట్లు అవసరమని వైసీపీ చెబుతోంది.

అంటే.. ఈ పథకానికి సుమారు ఇంకా రూ.3వేల కోట్లు అవసరమనేది వైసీపీ మాట. దీంతో... సుమారు 20 లక్షల మంది విద్యార్థులను ఏమి చేద్దామనుకుంటున్నారనేది వైసీపీ ప్రశ్నగా ఉంది. ఈ విషయంలో ప్రభుత్వం నుంచి స్పష్టత వస్తే బెటరని అంటున్నారు. లేదంటే.. పిల్లలను స్కూల్స్ కి పంపే తల్లుల్లో 20 లక్షల మంది ఆగ్రహం చవి చూడాల్సి రావొచ్చని అంటున్నారు!

ఇదే సమయంలో... సూపర్ సిక్స్ హామీల్లో మూడోది అయిన "ప్రతి రైతుకు ఏటా రూ.20,000 ఆర్థిక సాయం (అన్నదాత సుఖీభవ)" పథకం! పేరు వేరైనా గతంలో వైసీపీ ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద సుమారు 50 లక్షల మందికి ఆర్థిక సాయం అందించిందని చెబుతున్నారు. ఇప్పుడు వారి సంఖ్య 54 లక్షలు వరకూ ఉండోచ్చనేది అంచనా.

ఆ లెక్కన చూసుకుంటే.. ఇప్పుడు ఈ పథకానికి సుమారు రూ.10,400 కోట్ల వరకూ నిధులు అవసరం కాగా.. ఈ బడ్జెట్ లో రూ.6,300 కోట్లు మాత్రమే కేటాయించడంపైనా విమర్శలు వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో... ధరల స్థిరీకరణ నిధికి రూ.300 కోట్లు మాత్రమే కేటాయించడంపైనా వైసీపీ నేతలు మండిపడుతున్నారు!

సూపర్ సిక్స్ హామీల్లో నాలుగో హామీ విషయానికొస్తే... "ప్రతీ ఇంటికీ ఉచితంగా ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు (దీపం పథకం)"! ఈ పథకానికి ప్రభుత్వం రూ.2,601 కోట్లు కేటాయించింది. ఇది కూడా పూర్తి మొత్తం కాదనేది వైసీపీ వాదన. ఎందుకంటే... కోటీ 55 లక్షల మంది దీపం పథకానికి అర్హులైతే.. దాన్ని 95 లక్షలకు కుదించారని వైసీపీ ఆరోపిస్తుంది.

ఈ నేపథ్యంలో... దీనికి 4వేల కోట్లకు పైగా నిధులు అవసరమైతే.. తాజా బడ్జెట్ లో రూ.2,601 కోట్లే కేటాయించడాన్ని ఎలా అర్థం చేసుకోవాలనేది వారి ప్రశ్న.

సూపర్ సిక్స్ హామీల్లో ఐదో హామీ విషయానికొస్తే... "ప్రతీ మహిళకు నెలకు రూ.1,500" పథకం. దీన్ని టీడీపీ నేతలు బలంగా ప్రమోట్ చేశారు కూడా! దీనికోసం ఏడాదికి సుమారు రూ.32 వేల కోట్లు అవసరం అవ్వగా.. ఈ బడ్జెట్ లో ఒక్కరూపాయి కూడా కేటాయించలేదనేది విపక్షల నుంచి బలంగా వినిపిస్తున్న విమర్శగా ఉంది.

ఇక సూపర్ సిక్స్ హామీల్లో ఆరో హామీ కూడా చాలా పవర్ ఫుల్ అనే చెప్పాలి. అదే... "మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం" పథకం. ఈ పథకానికి నెలకు సుమారు రూ.350 కోట్లు ఖర్చవుతుందని అంచనా. అయితే... ఈ పథకానికి కూడా బడ్జెట్ లో కేటాయింపులు శూన్యం అనేది బలమైన విమర్శగా ఉంది. ఇది మహిళా లోకంలో కాస్త ఆగ్రహం తెప్పించే అంశమే అని అంటున్నారు.

ఈ లెక్కన చూస్తే... సూపర్ సిక్స్ హామీలో తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, దీపం పథకాలకు మాత్రమే (ఎంతోకొంత) నిధులు కేటాయించగా.. మిగిలిన మూడు హామీల ఊసే బడ్జెట్ లో లేకపోవడం గమనార్హం! ఈ నేపథ్యంలోనే... ఈ బడ్జెట్ విషయంలో కూటమి ప్రభుత్వం జగన్ కి దొరికేసినట్లేనా అనే చర్చ మొదలైందని అంటున్నారు. మరోపక్క.. ఆరింటిలో మూడింట పాసైనట్లే అనే కామెంట్లు వినిపిస్తున్నాయి!

Tags:    

Similar News