జగన్ డౌట్ కరెక్టేనా...ఆ ఎమ్మెల్యే జంపేనా ?

వైసీపీలో కొంతమంది ఎమ్మెల్యేలు పార్టీ మారుతారు అని జోరుగా ప్రచారం సాగుతోంది. ఆ ప్రచారం నిజమా కాదా అన్న చర్చ కూడా ఉంది.

Update: 2025-02-28 23:30 GMT

వైసీపీలో కొంతమంది ఎమ్మెల్యేలు పార్టీ మారుతారు అని జోరుగా ప్రచారం సాగుతోంది. ఆ ప్రచారం నిజమా కాదా అన్న చర్చ కూడా ఉంది. అయితే ఏపీలో రాజకీయం చూస్తే ఏమి జరిగినా ఆశ్చర్యం అయితే లేదు అని అంటున్నారు. ఎందుకంటే ఈ ఫిరాయింపులు కొత్తేమీ కాదు. పైగా ఓడిన పార్టీని మరింతగా బలహీనం చేసేందుకు అధికార పక్షం ఎత్తులు వేయడం సహజం.

ఇక అయిదేళ్ళ పాటు అధికార పక్షం నుంచి ఇబ్బందులను తట్టుకోలేని వాతావరణం కూడా వర్తమాన రాజకీయాల్లో ఉంటోంది. ఈ క్రమంలో ఏమైనా జరగవచ్చు. ఇవ్వన్నీ పక్కన పెడితే జగన్ ఇటీవల నిర్వహించిన వైసీపీ శాసనసభా పక్ష సమావేశంలో ఒక వైసీపీ ఎమ్మెల్యే పార్టీ కండువా కప్పుకోలేదని ప్రశ్నించినట్లుగా ప్రచారం సాగింది.

కండువా మరచిపోయారా లేక అని వైసీపీ అధినేత వ్యాఖ్యానించినట్లు వార్తలు వచ్చాయి. అయితే సదరు ఎమ్మెల్యే ప్రకాశం జిల్లా ఎర్రగుండపాలెం కి చెందిన తాటిపర్తి చంద్రశేఖర్ అన్నది తెలిసిందే. ఆయన వైసీపీ తరఫున గట్టిగా మీడియాలో మాట్లాడుతూంటారు. ప్రజా సమస్యల మీద గత తొమ్మిది నెలల కామలో అధికార కూటమి ప్రభుత్వాన్ని నిలదీస్తూ వస్తున్నారు.

అటువంటి ఎమ్మెల్యే మీద వైసీపీ అధినాయకత్వం ఎందుకు అనుమానాలు పెట్టుకుంటోంది అన్న చర్చ కూడా వచ్చింది. అయితే అది అనుమానం కాదని ఒక విధంగా జరుగుతున్న ప్రచారం ప్రభావం అధినాయకత్వం మీద పడింది అని అంటున్నారు.

ప్రకాశం జిల్లాలో ప్రస్తుతం ఈ ప్రచారం సాగుతోందిట. వచ్చే నెలలో పిఠాపురంలో జరిగే జనసేన ప్లీనరీలో భారీ చేరికలు ఉంటాయని అందులో ఈ వైసీపీ ఎమ్మెల్యే కూడా ఒకరని అంటున్నారు. దీని కోసం ప్రకాశం జిల్లాకు చెందిన మాజీ మంత్రి జనసేనలో చేరిన కీలక నాయకుడు బాలినేని శ్రీనివాసరెడ్డి తన శక్తివంచన లేకుండా ప్రయత్నాలు చేస్తున్నారు అని అంటున్నారు.

బాలినేని ఈ ఎమ్మెల్యేను జనసేనలోకి ఆహ్వానిస్తున్నారు అని అంటున్నారు. ఇప్పటికే మాజీ మంత్రి శిద్ధా రాఘవరావుని జనసేన వైపు తిప్పిన బాలినేని తరువాత టార్గెట్ గా ఈ ఎమ్మెల్యే ఉన్నారని అంటున్నారు. అయితే తాటిపర్తి చంద్రశేఖర్ పార్టీ మారుతారా అది నిజమా అంటే అది పుకారుగానే చెబుతున్నారు. పైగా దానిని సొంత పార్టీవారే చేయిస్తున్నారు అని అంటున్నారు. తొలిసారి నెగ్గిన చంద్రశేఖర్ నియోజకవర్గంలో దూకుడుగా ఉండడంతో సీనియర్ వైసీపీ నేతలు తట్టుకోలేకనే ఆయన పార్టీ మారుతారని ప్రచారం మొదలెట్టారని అంటున్నారు.

ఇక మాజీ మంత్రి అదే నియోజకవర్గానికి చెందిన ఆదిమూలం సురేష్ వర్గీయులు ప్రధానంగా ఈ ప్రచారం చేస్తున్నారు అని అంటున్నారు. సురేష్ 2009, 2014, 2019లలో మూడు సార్లు ఇదే నియోజకవర్గం నుంచి వరసగా గెలిచారు. జగన్ కేబినెట్ లో అయిదేళ్ళ పాటు సీఎం గా పనిచేశారు.

ఇక ఎన్నికల ముందు భారీ మార్పులు చేసిన నేపధ్యంలో ఆదిమూలం సురేష్ ని కొండెపికి మార్చారు. అక్కడ పోటీ చేసిన ఆయన ఓటమి పాలు అయ్యారు. దాంతో తిరిగి తన సొంత నియోజకవర్గం ఎర్రగుండపాలెం వైపు చూస్తున్నారు అని అంటున్నారు.

దాంతోనే తాటిపర్తి చంద్రశేఖర్ ని పొమ్మకుండానే పొగపెట్టేలా మాజీ మంత్రి వర్గీయులు ఈ ప్రచారాన్ని ఎత్తుకున్నారు అని అంటున్నారు. అదే సమయంలో ఎమ్మెల్యే వర్గీయులు కూడా ఆదిమూలం సురేష్ టీడీపీలో చేరుతారు అని రివర్స్ ప్రచారం చేస్తున్నారని అంటున్నారు.

మొత్తం మీద చూస్తే వైసీపీ హై కమాండ్ కి మాత్రం ఈ ప్రచారాలు కలవరాన్ని పుట్టించేలా ఉన్నాయని అంటున్నారు. పార్టీ ఇపుడు కష్టకాలంలో ఉంది. ఎవరు ఉంటారో లేదో తెలియని వేళ ప్రతీ వార్తా అనుమానాన్ని పెంచుతోంది. అందుకే జగన్ కూడా తాటిపర్తి విషయంలో అలా రియాక్ట్ అయ్యారని అంటున్నారు. అయితే ప్రకాశం జిల్లాలో జనసేన జెండా పాతాలని గట్టిగా భావిస్తున్న బాలినేని ఇపుడు వైసీపీని గట్టిగానే టార్గెట్ చేస్తున్నారు. దాంతో ఇవి పుకార్లా నిజాలా అన్నది కాలమే తేలుస్తుంది అని అంటున్నారు.

Tags:    

Similar News