టీడీపీ కూటమికి టీడీపీ మీడియానే వ్యతిరేకమా?
ఏపీలో తొమ్మిది నెలల చంద్రబాబు పాలనపై ప్రజలు ఎలాంటి అభిప్రాయంతో ఉన్నారోగానీ ఆ పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్న సోషల్ మీడియాతోపాటు మెయిన్ స్ట్రీమ్ మీడియా వ్యతిరేక కథనాలతో దుమ్ము రేపుతోంది.
మీడియాకి రాజకీయానికి మధ్య సన్నని గీత చెరిగిపోయింది. ప్రస్తుత రోజుల్లో మీడియాను రాజకీయాలను కలిపే చూస్తున్నారు. మరీ ముఖ్యంగా చెప్పాలంటే ప్రతి పార్టీకి ఏదో ఒక మీడియా సపోర్టు ఉంటూనే ఉంది. ఇక ఏపీ రాజకీయాల్లో ప్రధాన పార్టీలకు మద్దతుగా మీడియా పనిచేయడం ఎప్పటి నుంచో ఉంది. టీడీపీ అనుకూల మీడియాను ఎల్లో మీడియా అని.. వైసీపీ అనుకూల మీడియాను బ్లూ మీడియా అంటూ నిందించుకుంటుంటారు. ఎన్నికల్లో విజయం వరకు ఆయా మీడియా సంస్థలు తమ అనుకూల పార్టీల కోసం విస్తృతంగా ప్రచారం చేశాయి. ఇక ఎన్నికల తర్వాత రూటు మార్చి తాము మద్దతు పలికిన పార్టీపైనే రివర్స్ అటాక్ చేస్తున్నాయి. ప్రధానంగా అధికార టీడీపీకి అనుకూలంగా చెప్పే టీవీ చానల్స్ లో ప్రసారమవుతున్న కథనాలు, నిర్వహిస్తున్న డిబేట్లు కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండటం గమనార్హం.
ఏపీలో తొమ్మిది నెలల చంద్రబాబు పాలనపై ప్రజలు ఎలాంటి అభిప్రాయంతో ఉన్నారోగానీ ఆ పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్న సోషల్ మీడియాతోపాటు మెయిన్ స్ట్రీమ్ మీడియా వ్యతిరేక కథనాలతో దుమ్ము రేపుతోంది. ముఖ్యంగా సీఎం చంద్రబాబునే టార్గెట్ చేస్తూ ఆయన వైఖరిని ప్రశ్నిస్తుండటం ఆసక్తికరంగా మారుతోంది. ఇప్పటికీ ప్రతిపక్షమే అధికారం చెలాయిస్తుందని, ముఖ్యమంత్రి చంద్రబాబుకు రాజకీయాలే తెలియవన్నట్లు టీడీపీ అనుకూల మీడియాగా భావించే చానెల్స్ ల్లో న్యూస్ ప్రసారమవడం కూటమి నేతల్లో చర్చకు దారితీస్తోంది.
ఇక గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాలపై ఆరోపణలు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికీ చర్యలు తీసుకోకపోవడంపై టీడీపీ మీడియాలో ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. చర్యలు తీసుకోవాల్సిన స్థాయిలో ఉండి కూడా ఇంకా ఆరోపణలు చేయడమేంటంటూ నిలదీస్తుండటంతో ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళుతున్నాయి. చంద్రబాబు ఏం చేయాలో ఎలా చేయాలో కూడా టీడీపీ అనుకూల మీడియా చెబుతుండటం గతంలో ఎప్పుడూ వినలేదు, చూడలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఇక ఒక ఛానల్ ఎండీ ప్రతివారం స్వయంగా రాసే కాలమ్ లో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబుపై విమర్శలు చేస్తుండటం చర్చకు తావిస్తోంది. 42 రెండేళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు మారానను చెబుతూనే తన పాలనలో పాత వాసనలు వదలడం లేదని, క్యాడరును నిర్లక్ష్యం చేస్తున్నారని నిందిస్తున్నారు. సొంత మీడియాలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వంపై ఇలాంటి విమర్శలు వస్తుండటం ప్రతిపక్షాలకు అస్త్రంగా మారుతోందని అంటున్నారు. ఒకవైపు చర్యలు తీసుకోమని టార్గెట్ విధించడం, అధికారులకు గత పాలకులతో లింకులు పెట్టి ప్రభుత్వాన్ని ఒంటరిని చేసే ప్రయత్నం జరుగుతోందని అంటున్నారు.
మెయిన్ స్ట్రీమ్ మీడియాతోపాటు సోషల్ మీడియా సైతం టీడీపీ పాలనను టార్గెట్ చేస్తోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇటీవల ఆ పార్టీ నేత జీవీ రెడ్డి విషయంలోనూ సోషల్ మీడియాలో ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తాయి. జీవీ రెడ్డితో రాజీనామా చేసేంతవరకు సమస్యను నిర్లక్ష్యం చేయడం వల్లే ప్రభుత్వ పరువు బజారున పడిందనే అభిప్రాయం ఆ పార్టీ సోషల్ మీడియాలో వ్యక్తమవుతోంది. ఈ ట్రోలింగ్స్, డిబేట్స్ వల్ల ముఖ్యమంత్రి చంద్రబాబు సామర్థ్యాన్నే ప్రశ్నిస్తుండటం గమనార్హం.