కువైట్ లో భారీ అగ్నిప్రమాదం... మృతుల్లో భాతీయులు!
ఇందులో ప్రధానంగా కేరళ, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ కు చెందినవారు ఉన్నారని అంటున్నారు.
కువైట్ లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 41 మంది మరణించగా.. మరో 50 మందికిపైగా తీవ్ర గాయాలపాలైనట్లు తెలుస్తుంది. ఇలా మృతి చెందినవారితో పాటు, గాయపడినవారిలోనూ ఎక్కువమంది భారతీయులు ఉన్నారని చెబుతున్నారు. ఇందులో ప్రధానంగా కేరళ, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ కు చెందినవారు ఉన్నారని అంటున్నారు.
అవును... కువైట్ లోని ఓ ఆరు అంతస్తుల బిల్డింగ్ లో బుధవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం జరిగినట్లు స్థానిక మీడియా తెలిపింది. అయితే... ఈ ప్రమాదానికి గల కారణాలు మాత్రం వెల్లడించలేదు. అయితే ప్రస్తుతానికి మంటలు మాత్రం అదుపులోకి వచ్చినట్లు తెల్లుస్తుంది. ఈ సందర్భంగా ఈ ఘటనపై పూర్తిస్థాయి దర్యాప్తులు ఆదేశించారు ఆ దేశ ఉప ప్రధాని ఫహాద్ యూసఫ్ అల్ సబా.
ఇదే సమయంలో ఆ బిల్డింగ్ యజమానిపైనా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు చెబుతున్నారు. ఈ బిల్డింగ్ ను కార్మికులను ఉంచడానికి ఉపయోగించారని.. అక్కడ పెద్ద సంఖ్యలో కార్మికులు ఉన్నారని.. వారిలో చాలామందిని రక్షించామని.. అయితే మంటలు బాగా వ్యాపించడం, దట్టమైన పొగ అలుముకోవడంతో చాలా మంది మరణించారని పోలీసులు వెల్లడించారు!
మరోపక్క ఈ ఘటనపై భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో సుమారు 40 మంది మరణించగా.. 50మందికి పైగా బాధితుల్లు తీవ్రంగా గాయపడినట్లు తెలిపారు. వారంతా ప్రస్తుతం ఆసుపత్రిలో చేరినట్లు తెలిసిందని వెల్లడించారు.
ఈ సందర్భంగా మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేసిన ఆయన... విషయం తెలిసిన వెంటనే కువైట్ లోని ఇండియన్ ఎంబసీ అధికారులు ఘటనా స్థలాన్ని సందర్శించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా బాధితులకు పూర్తి సహకారం అందిస్తామని అన్నారు. అయితే ఈ ఘటనపై స్థానిక అధికారుల నుంచి పూర్తి సమాచారం కోసం ఎదురుచూస్తున్నట్లు తెలిపారు.