కేవీపీ వర్సెస్ వైఎస్ షర్మిల.. పొలిటికల్ రచ్చ!
అయితే.. కేవీపీ మాత్రం సైలెంట్‌గా ఉన్నారని.. ఏమన్నా కూడా.. వివాదం ముదురుతుందని ఆయన భావిస్తున్నట్టు సమాచారం.
కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ రాజ్యసభ సభ్యుడు, పార్టీ అధిష్టానంతో నేరుగా సత్సంబంధాలు ఉన్న నాయకుడు కేవీపీ రామచంద్రరావు. అలాంటి సీనియర్ దిగ్గజ నాయకుడితో ఏపీ కాంగ్రెస్ పార్ట చీఫ్, వైఎస్ కుమార్తె షర్మిల ఉప్పు-నిప్పుగా ఉంటున్నట్టు తెలుస్తోంది. అంతర్గత చర్చల్లో కేవీపీని అవమానించేలా షర్మిల వ్యాఖ్యానించారని ఏపీ నేతల మధ్య చర్చ సాగుతుండడం గమనార్హం. అయితే.. కేవీపీ మాత్రం సైలెంట్‌గా ఉన్నారని.. ఏమన్నా కూడా.. వివాదం ముదురుతుందని ఆయన భావిస్తున్నట్టు సమాచారం.
సుదీర్ఘ బంధం!
2004-2009 మధ్య ఉమ్మడి ఏపీలో ఏర్పడిన వైఎస్ రాజశేఖరరెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కారుకు కళ్లు-చెవులు అన్న విధంగా వ్యవహరించిన కేవీపీ రామచంద్రరావు గురించి గల్లీ నుంచి ఢిల్లీ వరకు అందరికీ తెలిసిందే. ఆయన వైఎస్‌కు నమ్మిన బంటు. ఒకానొక దశలో కేవీపీతో సంప్రదించకుండా.. వైఎస్ ఎలాంటి నిర్ణయం తీసుకునేవారు కూడా కాదని అంటారు. అందుకే.. ఇరువురి మధ్య బంధాన్ని `ఆత్మ` గా పేర్కొన్నారు. వైఎస్ ఆత్మగా కేవీపీకి ఇప్పటికీ పేరుంది.
అయితే.. వైఎస్ మరణం తర్వాత.. కేవీపీకి.. వైఎస్ కుటుంబానికి మధ్య దూరం పెరిగింది. జగన్ సొంత పార్టీ వైసీపీ పెట్టుకున్నప్పుడు.. కేవీపీని ఆయన ఆహ్వానించారు. అయితే.. కేవీపీ.. అసలు ప్రత్యేకంగా పార్టీ పెట్టొద్దని సూచించారు. కాంగ్రెస్‌లో ఉంటే ఇప్పుడు కాకపోతే..ఎప్పటికైనా సీఎం అయ్యే చాన్స్ వస్తుందని కూడా చెప్పారు. దీనిని పట్టించుకోని జగన్ కేవీపీని పక్కన పెట్టారు. అప్పటి నుంచి కేవీపీ జగన్ జోలికి రాలేదు.
కానీ, షర్మిల సొంతగా రాజకీయ పార్టీ పెట్టుకుని.. తర్వాత దానిని కాంగ్రెస్‌లొ విలీనం చేసే వరకు కేవీపీ కీలక పాత్ర పోషించారు. కర్ణాటకకు చెందిన డీకే శివకుమార్ సహా.. కేవీపీ వంటి వారు.. ఓ మీడియా అధినే త కూడా.. కలిసి షర్మిల పార్టీని విలీనం చేయడం.. ఏపీలో ఆమెను పార్టీకి ఇంచార్జ్‌గా తీసుకురావడం వరకు కథనడిచింది. అంటే ఒక రకంగా కేవీపీ.. షర్మిలకు మేలే చేశారు. మరి విభేదాలు ఎక్కడ వచ్చాయి? ఎందుకు వచ్చాయన్నది సమస్య.
ఆ ఒక్కటే రీజన్!
షర్మిల వర్సెస్ కేవీపీల మధ్య వివాదం రావడానికి ఆమె సొంత అజెండాను అమలు చేయడమేనని తెలు స్తోంది. ఎన్నికలకు ముందు.. తర్వాత కూడా.. షర్మిల సొంత అజెండాను అమలు చేయడాన్ని సీనియర్లు కూడా భరించలేదు. ఇప్పటికీ వారు విమర్శలు చేస్తూనే ఉన్నారు. ముఖ్యంగా జగన్‌ను ఏకపక్షంగా విమర్శి స్తే.. కాంగ్రెస్ ఓటు బ్యాంకు పెరగదన్నది కేవీపీ మాట. వ్యక్తిగత కక్షలకు కాంగ్రెస్‌ను వాడుకోవద్దన్నది కూడా ఆయన మేలిమి సూచన. కానీ, షర్మిల వాటిని పక్కన పెట్టడంతోపాటు.. ``కాలం చెల్లిన నేతలు.. కబుర్లు చెబుతున్నారు`` అంటూ.. అంతర్గత సమావేశంలోనే విరుచుకుపడ్డారని తెలిసింది. ఇదే ఇరువురి మధ్య వివాదానికి కారణమైందని సమాచారం.