కిక్కూ...మొక్కూ..లక్కూ...!

రేపు రూపు తెలియదు కాబట్టి బాగుంటుంది. ఇదే గుడ్డి నమ్మకం. దాంతోనే కొత్త ఏడాది అంటూ లెక్కలేని మోజుతో మిక్కిలిగా ప్రేమిస్తూ పోతాడు.

Update: 2025-01-01 09:52 GMT

మనిషి చాలా విచిత్రమైనవాడు . అన్నీ తన చేతిలో ఉంచుకుని ప్రకృతి నుంచి ఏదేదో ఎంతెంతో ఆశిస్తాడు. కాలం వైపు దాని బాహ్య రూపంగా తాను ఏర్పాటు చేసుకున్న క్యాలెండర్ వైపు ఆశగా చూస్తాడు. అంకెల గారడితో జీవితం గాడితో పడుతుందని భ్రమిస్తాడు. కాలం నిరంతర ప్రవాహం లాంటిది. దానికి కొత్త పాత అన్నది లేదు.

దానికి విభజన కూడా లేదు. కాలం అఖండం. దాని ముందు మనిషి గడ్డి పోచ కూడా కాడు. అందుకని తనకు అనుకూలంగా కాలాన్ని ముక్కలు చేసి ఆశల రెక్కలు తొడిగి మరీ ఏటేటా మొక్కులు చెల్లిస్తూ ఉంటాడు. నిన్న పాతది రోతది అవుతుంది.

రేపు రూపు తెలియదు కాబట్టి బాగుంటుంది. ఇదే గుడ్డి నమ్మకం. దాంతోనే కొత్త ఏడాది అంటూ లెక్కలేని మోజుతో మిక్కిలిగా ప్రేమిస్తూ పోతాడు. కొత్త ఏడాదిలో నిండుగా పన్నెండు నెలలు ఉంటాయి కాబట్టి ఏదో ఒక రోజు తన జాతకం తిరగబడక మానకపోతుందా అన్న అమాయకమైన ఆరాటంతో ఆర్భాటం చేస్తూ పోతాడు.

కొత్త ఏడాదికి సుస్వాగతం అంటూ బార్లలో కనబడిన దార్లలో మద్యం ఏరులలో తడుస్తూ పోతాడు. ఆ కిక్కులో టిక్కు టిక్కుమనే గడియారం లెక్కలు కూడా తెలియనంతగా మత్తుగా గమ్మత్తుగా సొమ్మసిల్లుతూ వచ్చే కాలమంతా తనదే అని మురిసిపోతాడు.

రాత్రల్లా కొలమానాలు లేని తీరుతో బార్లా తాగేసి ఒళ్ళంత తుళ్ళింతగా చేసుకుని పరవశమైపోతాడు. తన వశం తాను కాకుండా పోతాడు. రాత్రంతా ఇదే డ్యూటీ చేసినా తెల్లారేసరికి మాత్రం ఎక్కడ లేని భక్తీ వేదాంతం వచ్చి పడుతుంది. రాత్రి రక్తిలో చేసిన రాద్ధాంతం అంతా పక్కన పెట్టేసి తూచ్ అనుకుంటూ గుళ్ళూ గోపురాలు వెతుక్కుంటూ అక్కడ కనబడిన దేవుళ్ళందరికీ కడు భక్తిగా మొక్కులు మొక్కుతాడు.

లక్కు ఎక్కడైనా చిక్కకపోతుందా అని దైవారాధనలోనే పగలల్లా పరితపించేస్తాడు. ఇలా రాత్రి రక్తి, పొద్దున భక్తితో న్యూ ఇయర్ కి భలే తమాషాగా వెల్ కమ్ చెబుతాడు. తన ఒంట్లో సత్తువను పర్సులో సొమ్ముని కూడా ఒకే ఒక్క రోజు కోసం ఖర్చు రాసేసి మరీ అక్కడికి తానేదో ఘనకార్యం చేసినట్లుగా కొత్త ఏడాది మొదటి రోజున రాజులా వెలిగిపోతాడు.

ఆ కిక్కూ ఈ మొక్కూ అన్నీ లెక్క తేలాక రెండవ రోజు కాలెండర్ తో గిర్రున తిరిగాక కానీ అసలు చిక్కు ఏంటో అర్ధం కాదు. కొత్త ఏడాది వచ్చినా పాత బతుకు పాత జీవితం అన్నీ రోతగా కనిపిస్తూంటే విరక్తిగా మారి చేయాల్సిన తన డ్యూటీలోకి భారంగా అడుగులు వేస్తాడు. మళ్లీ మూడు వందల అరవై నాలుగు రోజులను లెక్క బెట్టుకుంటూ కొత్త ఏడాది కోసం వేచి చూస్తూ బతుకు దిగులుగా వెళ్ళదీస్తాడు.

ఇలా దివారాత్రాలు ఎన్ని కష్టపడినా ఎన్ని కొత్త ఏడాదులు వచ్చినా తనకు అందని కాలం ఏ మహిమా చేయదని తాను రెక్కలు తొడిగిన కాలెండర్ గోడ మీద నుంచి చోద్యం చూస్తూ అలాగే వెర్రి నవ్వు నవ్వుతుందని అర్ధం అయ్యేసరికి జీవితం ఎక్కడికో పోతుంది. అయినా కొత్త మోజూ పోదూ ఈ ఆశల ఆరాటాలు పోరాటాలు ఎప్పటికీ ఆగేవి కావు. ఎందుకంటే కాల ప్రవాహంలో కొట్టుకుపోవడం తెలిసిన సగటు జీవి కధ ఇంతే. కాలాన్ని నిలువరించి తాను అనుకున్న లక్ష్యాన్ని వరించిన వారికి ఏ క్యాలెండర్ తోనూ పని లేదు, ఏ కొత్త అనుభూతులతోనూ అసలు అవసరం లేనే లేదు. ఇదే వెనకటి కాలం వచ్చే కాలం కూడా చెప్పే పరమ సత్యం.

Tags:    

Similar News