నామినేటెడ్ పదవుల లిస్ట్ లీక్...కీలక పోస్టులకు వారేనట ?

అయితే ఎవరికి ఏ పదవులు దక్కుతాయి అన్నది పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది.

Update: 2024-08-11 11:09 GMT

నామినేటెడ్ పదవుల గంప కిందకు దిగబోతోంది. దానికి ముహూర్తం కూడా నిర్ణయించారు. ఆగస్టు 15 హడావుడి ముగిసిన తరువాత ఆగస్టు 16న నామినేటెడ్ సందడికి తెర తీస్తారు అని అంటున్నారు. అయితే ఎవరికి ఏ పదవులు దక్కుతాయి అన్నది పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది.

ఈ పోస్టులకు సమంభించి లిస్ట్ కూడా లీక్ అయింది అని అంటున్నారు. మరి ఈ లిస్ట్ లో ఉన్న పేర్లు నిజం అవునో కాదో ప్రకటించేటంతవ్రకూ తెలియదు కానీ ఈ లిస్ట్ లో పేర్లు చూస్తే మాత్రం చాలా ఆసక్తిని పెంచేలాగానే ఉన్నాయి. ఏపీలో మొత్తం 90 దాకా కార్పోరేషన్లు వాటి చైర్మన్లు అందులో మెంబర్లు వెరసి దాదాపుగా వందలలోనే పోస్టులు ఉన్నాయి. ఇందులో మొత్తం పోస్టులను ఒకేసారి భర్తీ చేయరు అని అంటున్నారు. మొదటి విడతలో ముప్పయి శాతం పదవులనే ప్రకటిస్తారు అని అంటున్నారు. ఈ విధంగా చూస్తే లీక్ అయిన జాబితాలో చాలా పేర్లే కనిపిస్తున్నాయి.

ముందుగా చూస్తే తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పోస్టుతో పాటు ఒక పద్నాలుగు కార్పోరేషన్లకు అందులో మెంబర్ల పోస్టులకు ఉన్న ఖాళీలు భర్తీ చేస్తారు అని అంటున్నారు. టీటీడీ చైర్మన్ పదవికి ఒక మీడియా అధిపతి పేరుని ప్రముఖంగా చెబుతున్నారు. ఆయనతో పాటుగా ఉండి ఎమ్మెల్యే రఘురామ క్రిష్ణం రాజు పేరు కూడా పరిశీలనలో ఉంది అని అంటున్నారు. అలాగే ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన మాజీ మంత్రి సీనియర్ నేత కిమిడి కళా వెంకటరావు పేరు కూడా రేసులో ఉందని అంటున్నారు.

ఇక టీటీడీ బోర్డు మెంబర్స్ గా తెలంగాణా నుంచి నర్శిరెడ్డి, ప్రొఫెసర్ తిరునగరి జ్యోత్స్న పేర్లు ఖరారు అయ్యాయని అంటున్నారు. ఏపీ నుంచి చూస్తే నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, దినేష్ రెడ్డి, ఉత్తరాంధ్రా నుంచి కూన రవికుమార్, జనసేన నుంచి బొలిశెట్టి శ్రీనివాస్ పేర్లు వినిపిస్తున్నాయి.

కీలకమైన ఆర్టీసీ చైర్మన్ పదవిని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకు ఇస్తారని అంటున్నారు. అలాగే ఎంతో ప్రాముఖ్యత కలిగిన ఏపీఐఐసీ, పౌర సరఫరాల శాఖ, మహిళా కమిషన్, ఎస్సీ కమిషన్, ఎస్టీ కమిన్షన్ లకు చైర్మన్లు ఖరారు చేశారు అని ప్రచారం సాగుతోంది. ప్రొద్దుటూరు టికెట్ ని ఇటీవల ఎన్నికల్లో అధినాయకత్వం అదేశానుసారం త్యాగం చేసిన ప్రవీణ్ కుమార్ రెడ్డికి ఏపీఐఐసీ చైర్మన్ పదవి ఇస్తారని అంటున్నారు.

అలాగే పౌర సరఫరాల శాఖ చైర్మన్ పదవిని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి అయిన పట్టాభికి ఇస్తారని తెలుస్తోంది. ఎస్సీ కమిషన్ చైర్మన్ గా మాజీ మంత్రి పీతల సుజాత, ఎస్టీ కమిషన్ చైర్మన్ గా మాజీ మంత్రి కిడారి శ్రావణ్ కుమార్, అమరావతి డెవలప్మెంట్ కార్పోరేషన్ చైర్మన్ పదవిని ఆలపాటి రాజాకు ఇస్తున్నారు అని ప్రచారం సాగుతోంది.

ఇక పార్టీ పదవుల విషయానికి వస్తే కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మికి ఏపీ తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు పదవిని ఇస్తారని అంటున్నారు. ఈ పదవిలో ఇప్పటిదాకా వంగలపూడి అనిత కొనసాగుతున్నారు. అలాగే తెలుగు యువత విద్యార్ధి, రైతు సహా అనేక అనుబంధ పదవులునకు కూడా కీలక నేతలకు ఇస్తారని అంటున్నారు.

ఇక నామినేటెడ్ పదవులలో అరవి నుంచి డెబ్బై శాతం టీడీపీ వారికే ఇస్తారని అంటున్నారు. జనసేనకు ఇరవై శాతం నుంచి పాతిక శాతం, బీజేపీకి పది శాతం పదవులు ఇస్తారని అంటున్నారు. అన్ని పదవులూ ఒక్కసారే భర్తీ చేస్తే ఆశావహులు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి అసంతృప్తి ఎక్కువగా ఉండొచ్చు అన్న ఆలోచనతో దఫ దఫాలుగా పదవులను భర్తీ చేయడం ద్వారా టీడీపీ తమ్ముళ్లను దారికి తెచ్చుకునే వ్యూహం అనుసరిస్తారు అని అంటున్నారు. ఏది ఏమైనా రఘురామకు టీటీడీపీ చైర్మన్ పదవి ఇస్తే మాత్రం అది హాట్ టాపిక్ అవుతుంది. చూడాలి మరి ఏమి జరుగుతుందో.

Tags:    

Similar News