లోకేష్ విచారణ కంటిన్యూ... అరెస్ట్ అన్నది...?

ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్ మెంట్ ని మార్చిన విషయంలో లోకేష్ పాత్ర ఎంత అన్న దాని మీద సీఐడీ ప్రశ్నలు అడిగిందని అంటున్నారు.

Update: 2023-10-10 15:40 GMT

నారా లోకేష్ ఎట్టకేలకు సీఐడీ అధికారుల ముందు ఒక రోజు అంతా కూర్చుని విచారణను ఎదుర్కొన్నారు. దాదాపుగా ముప్పయికి పైగా ప్రశ్నలతో లోకేష్ ని విచారించారని తెలిసింది. ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్ మెంట్ ని మార్చిన విషయంలో లోకేష్ పాత్ర ఎంత అన్న దాని మీద సీఐడీ ప్రశ్నలు అడిగిందని అంటున్నారు.

అదే విధంగా లోకేష్ 2014 టైం లో హెరిటేజ్ సంస్థకు డైరెక్టర్ గా ఉన్నారు. బోర్డు మీటింగులో అమరావతిలో పది ఎకరాల భూమిని కొనుగోలు చేయడానికి తీర్మానించారు అన్నది సీఐడీ వద్ద ఉన్న ఒక ఆధారం. ఆ తరువాత లింగమనేని రమేష్ ఇతరుల వద్ద నుంచి మరో నాలుగున్నర ఎకరాలు కూడా కొన్నారని సీఐడీ అంటోంది.

ఇక లింగమనేని గెస్ట్ హౌస్ లోనే చంద్రబాబు సీఎం గా ఉన్న టైం లో అయిదేళ్ల పాటు ఉన్నారు. అందులోనే లోకేష్ కూడా ఉన్నారు. ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్ మెంట్ మార్పు వల్ల లింగమనేని భూములతో పాటు హెరిటేజ్ సంస్థల భూములు ఇతర పెద్దల భూములు పక్కనే ఉంటూ లాభపడేలా డిజైన్ చేశారన్నది సీఐడీ ఆరోపణ.

ఇక ఈ కేసులో సీఐడీ రెండేళ్ళుగా దర్యాప్తు చేస్తోంది. అదే విధంగా కీలకమైన ఆధారాలు సంపాదించింది అని అంటున్నారు. లోకేష్ విచారణలో వాటితో టాలీ చేసుకోవడానికే అంటున్నారు. అయితే లోకేష్ నుంచి సరైన సమాధానాలు రాకపోవడంతో బుధవారం కూడా విచారణకు పిలిచారు అని అంటున్నారు.

ఇంకో వైపు మాజీ మంత్రి నారాయణ అల్లుడు పునీత్ విచారణ కూడా ఇదే ఇన్నర్ రింగ్ రోడ్ విషయంలో బుధవారం ఉంది. అదే విధంగా మాజీ మంత్రి నారాయణకు ఈ నెల 16 వరకూ ఈ కేసులో ఉపశమనం ఉంది. ఆయన ఆ రోజున సీఐడీ విచారణకు హాజరు కావాల్సి ఉంది అంటున్నారు. నారా లోకేష్ ని నారాయణను ఎదురెదురు పెట్టి విచారిస్తారు అని అంటున్నారు.

ఇక ఆ తరువాత కానీ ముందు కానీ కీలక పరిణామాలు ఏ క్షణం అయినా చోటు చేసుకోవచ్చు అని అంటున్నార్. 41ఏ నోటీసు ఇచ్చి విచారణకు లోకేష్ ని పిలిపించారు. ఇందులో అరెస్ట్ అన్నది లేదు. కానీ తమకు విచారణకు సహకరించకపోతే అరెస్ట్ చేసి కస్టడీలోకి తీసుకుంటామని కోర్టు అనుమతి కోరి లోకేష్ ని అరెస్ట్ చేయవచ్చు అన్న ప్రచారం కూడా వినిపిస్తోంది. మొత్తానికి ఈ విచారణ తరువాత బయటకు వచ్చిన లోకేష్ సీఐడీ తనను వేధించడమే పనిగా పెట్టుకుందని ఆరోపించారు.

ఏమీ లేని కేసులో విచారణ అని మండిపడ్డారు. రేపు కూడా లోకేష్ విచారణ ఉంటుంది. ఆ తరువాత సీఐడీ ఈ నెల 16 దాకా విచారణను కొనసాగించవచ్చు అంటున్నారు. ఏది ఏమైనా ఈ కేసులో లోకేష్ వేధింపులు అంటూంటే సీఐడీ సహకరించకపోవడంతోనే విచారణ అంటున్నట్లుగా చెబుతున్నారు. రానున్న రోజులలో ఏపీలో సంచలన పరిణామాలు చోటు చేసుకుంటాయేమో చూడాలని అంటున్నారు.

Tags:    

Similar News