2 తెలుగు రాష్ట్రాలతో సహా నాలుగో విడత ఎక్కడెక్కడంటే?

నాలుగో విడతలో మొత్తం 96 లోక్ సభా స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అదే సమయంలో ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తారు

Update: 2024-04-18 06:15 GMT

సుదీర్ఘంగా సాగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో నాలుగో విడతకు తెర లేచింది. ఈ రోజు (గురువారం) రెండు తెలుగు రాష్ట్రాలతో సహా మొత్తం 10 రాష్ట్రాల్లో లోక్ సభ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. నాలుగో విడతకు సంబంధించి ఏపీ.. తెలంగాణతో.. బిహార్.. జార్ఖండ్.. మధ్యప్రదేశ్.. మహారాష్ట్ర.. ఒడిశా.. ఉత్తరప్రదేవ్.. పశ్చిమ బెంగాల్.. జమ్మూకశ్మీర్ రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి.

నాలుగో విడతలో మొత్తం 96 లోక్ సభా స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అదే సమయంలో ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తారు. నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో ఈ రోజు (గురువారం) నుంచి ఏపీ.. తెలంగాణతో సహా ఆయా రాష్ట్రాల్లో నామినేషన్ల ప్రక్రియ షురూ కానుంది. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. ఎన్నికల ప్రక్రియను చూస్తే.. ఈ రోజు (ఏప్రిల్ 18) నుంచి నామినేషన్లను స్వీకరిస్తారు.

ఇక్కడో విషయాన్ని ప్రస్తావించాలి. నామినేషన్ల ప్రక్రియ ఏప్రిల్ 18-25 వరకు స్వీకరిస్తారు. అయితే.. 18, 19, 24 తేదీల్లో మాత్రమే మంచి ముహుర్తాలు ఉన్నాయి. దీంతో.. నామినేషన్లు మొత్తం ఈ మూడు రోజుల్లోనే దాఖలు కానున్నట్లుగా చెబుతున్నారు. ఇక.. నామినేషన్లను 26న పరిశీలిస్తారు. ఏప్రిల్ 29 వరకు ఉపసంహరణకు గడువు ఉంది. మే 13న ఎన్నికల్లో కీలక ఘట్టమైన పోలింగ్ జరగనుంది. జూన్ 4న ఓట్ల లెక్కింపుతో ఫలితాలు వెల్లడి కానున్నాయి.

ఇప్పటికే హాట్ హాట్ గా మారిన ఎన్నికలు.. నామినేషన్ల దాఖలు నేపథ్యంలో మరింత చురుకుదనం పెరగటం ఖాయం. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తమ నామినేషన్లను నియోజకవర్గ ప్రధాన కేంద్రాల్లో దాఖలు చేస్తే సరిపోతుంది. ఎంపీ అభ్యర్థులు మాత్రం కలెక్టరేట్లలో నామినేషన్లను దాఖలు చేయాల్సి ఉంటుంది.

Tags:    

Similar News