బీజేపీ, బీఆర్ఎస్.. జీహెచ్ఎంసీలో కాంగ్రెస్ కు లోక్ సభ సంకటం

అయితే, సమర్థులైన అభ్యర్థులు ఎవరా అనేది తర్జనభర్జన పడుతోంది. జీహెచ్ఎంసీ పరిధిలో మూడు లోక్ సభ సీట్లు ఉన్నాయి.

Update: 2024-03-09 13:30 GMT

రాష్ట్రంలో అధికారంలో ఉండి కూడా జీహెచ్ఎంసీ పరిధిలో ఎంపీ అభ్యర్థులు ఎవరా? అని కాంగ్రెస్ పార్టీ వెదుకులాడుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో పెద్దగా సీట్లు దక్కని ఈ ప్రాంతంలో లోక్ సభ సీట్లనైనా గెలవాల్సిన అనివార్యత నెలకొంది. అయితే, సమర్థులైన అభ్యర్థులు ఎవరా అనేది తర్జనభర్జన పడుతోంది. జీహెచ్ఎంసీ పరిధిలో మూడు లోక్ సభ సీట్లు ఉన్నాయి. వీటిలో హైదరాబాద్ పై ఎంఐఎంకు తప్ప ఏ పార్టీకీ ఆశలు ఉండవనేది స్పష్టం. అయితే, ఆ పార్టీకి దీటుగా పోటీ ఇవ్వాల్సిన అవసరం కూడా ఉందనేది కాదనలేం.

సికింద్రాబాద్ లో ఎవరు?

సికింద్రాబాద్ లో 2004 నుంచి పదేళ్ల పాటు కాంగ్రెస్ తరఫున అంజన్ కుమార్ యాదవ్ ప్రాతినిధ్యం వహించారు. గత రెండు ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ కు గెలుపు దక్కలేదు. గత ఎన్నికల్లో అంజన్ కుమారుడు అనిల్ కుమార్ యాదవ్ పోటీ చేసినా ఓడిపోయారు. ఈసారి ఆయనకు రాజ్యసభ ఇచ్చారు. దీంతో అనిల్ తండ్రి అంజన్ కు టికెట్ ఇస్తారా? ఒకే కుటుంబంలో రెండు టికెట్లు .. అది కూడా ఎంపీ టికెట్లు ఇస్తారా? అనేది చూడాలి. వాస్తవానికి ఈ స్థానం నుంచి బొంతు రామ్మోహన్ లేదా ఆయన భార్య పేరు వినిపిస్తోంది. పార్టీలో చేరి నెల కూడా కాకముందే వారికి టికెట్ ఇవ్వాల్సిన పరిస్థితి. దీనిపై సమీకరణాలు ఎలా ఉంటాయో చూడాలి. బొంతు మొన్నటివరకు బీఆర్ఎస్ అధిష్ఠానానికి అత్యంత సన్నిహితులు. ఇప్పుడు ఆయనకు లేదా ఆయన భార్యకు టికెట్ ఇవ్వడాన్ని కాంగ్రెస్ శ్రేణులు ఎలా తీసుకుంటాయో?

హైదరాబాద్ లో కష్టమేనా?

హైదరాబాద్ లో ఎంపీ అసదుద్దీన్ ఒవైసీని ఓడించడం దాదాపు అసాధ్యం. అయితే, అధికార పార్టీ కాబట్టి కాంగ్రెస్ పోటీ ఇవ్వకుండా మాత్రం ఉండకూడదు. మరోవైపు హైదరాబాద్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఫిరోజ్ ఖాన్ ను దింపుతారా? లేదా? చూడాలి. గత అసెంబ్లీ ఎన్నికల్లో నాంపల్లి నుంచి గట్టి పోటీ ఇచ్చిన ఫిరోజ్ ఖాన్ ఎంపీగా పోటీకి ఏమంటారో? లేకపోతే జూబ్లీహిల్స్ నుంచి పోటీకి దిగి ఓడిన టీమిండియా మాజీ కెప్టెన్ మొహమ్మద్ అజహరుద్దీన్ ను దింపుతారా?. బీజేపీ తొలిసారి ఓ మహిళ (మాధవీ లత)ను నిలిపింది. ఇప్పటికే ఈమె స్వచ్ఛంద సేవ ద్వారా తన ఉనికి చాటుకున్నారు.

మల్కాజిగిరి.. చాలా గురి..

మూడు లోక్ సభ సెగ్మెంట్లలో మల్కాజిగిరి మరీ ముఖ్యమైనది. సీఎం రేవంత్ రెడ్డి ఇటీవలి వరకు ఇక్కడనుంచి ప్రాతినిధ్యం వహించారు. సిటింగ్ స్థానమే కాక.. సీఎంను అందించిన సీటు. కాబట్టి ఇక్కడ పోటీకి దిగే కాంగ్రెస్ అభ్యర్థి అన్నివిధాలా సమర్ధుడై ఉండాలి. బీఆర్ఎస్ నుంచి కేటీఆర్ పోటీకి దిగుతారనే కథనాలు వచ్చాయి. మాజీ మంత్రి మల్లారెడ్డి కుమారుడు భద్రారెడ్డి వంటి వారు పోటీలో ఉన్నారు. బీజేపీ అయితే, ఏకంగా మాజీ మంత్రి ఈటల రాజేందర్ నే దింపింది. మరి కాంగ్రెస్ టికెట్ మైనంపల్లి హనుమంతరావుకు ఇస్తారా? లేక సీఎం రేవంత్ సోదరుడికి దక్కుతుందా? అన్నది సందిగ్ధం. మొత్తానికి జీహెచ్ఎంసీలో లోక్ సభ ఎన్నికల అభ్యర్థుల ఎంపిక కత్తిమీద సామే.

Tags:    

Similar News