మాధవ్ కి ఇంకా సమాచారం రాలేదంట... పాతమాటకే కట్టుబడి ఉంటారా?
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార వైసీపీలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్న సంగతి తెలిసిందే.
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార వైసీపీలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా పలు నియోజకవర్గాల్లో ఇన్ ఛార్జ్ ల మార్పుకు జగన్ శ్రీకారం చుట్టారు. అందుకు పలు లెక్కలు, మరికొన్ని సమీకరణలను ఆయన ప్రాతిపధికగా తీసుకుంటున్నారని తెలుస్తుంది. ఈ సమయంలో హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ తన పోటీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
అవును... రాబోయే ఎన్నికల్లో పలు సమీకరణల దృష్ట్యా వైఎస్ జగన్ అభ్యర్థులను మారుస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఇప్పటికే 11 మంది ఇన్ ఛార్జ్ లను మారుస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మరో 30 - 40 స్థానాల్లో ఇన్ ఛార్జ్ ల మార్పు ఉంటుందని కథనాలొస్తున్నాయి. ఈ సమయంలో గత ఎన్నికల్లో అనూహ్యంగా సీటు సంపాదించుకుని గెలిచిన హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ కు ఈ దఫా టిక్కెట్ కష్టమనే చర్చ జరుగుతుంది.
కారణాలు ఏవైనప్పటికీ ఈదఫా హిందూపురం లోక్ సభ స్థానానికి వైసీపీ అభ్యర్థిని మారుస్తున్నారని.. ఈసారి ఒక మహిళకు కేటాయించబోతున్నారని కథనాలొస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాడేపల్లిలోని సీఎం క్యాంపు ఆఫీసు చుట్టూ మాధవ్ ప్రదిక్షణలు చేస్తూ కనిపిస్తున్నారు! ఈ సందర్భంగా తన టికెట్ విషయంలో ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఇందులో భాగంగా... తన సీటు విషయంలో సీఎం జగన్ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని అన్నారు. జగన్ ఇంకా నిర్ణయం తీసుకోనప్పుడు, తనకు ఎలాంటి సమాచారం లేనప్పుడు... తాను ఎమ్మెల్యేగా లేదా ఎంపీగా పోటీ చేస్తానని చెప్పలేనని చెప్పుకొచ్చారు! సర్వే రిపోర్టుల ఆధారంగా సీఎం జగన్ అభ్యర్థులను నిర్ణయిస్తారని తెలిపారు.
ఇదే సమయంలో మరో మూడు నాలుగు రోజుల్లో అభ్యర్థుల జాబితాపై ఓ నిర్ణయం వస్తుందని అభిప్రాయం వ్యక్తం చేసిన హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్... తాను ఎక్కడి నుంచి పోటీ చేయాలనే విషయం జగనే నిర్ణయిస్తారని.. ఈ విషయంపై ప్రస్తుతానికి తానేమీ చెప్పలేనని అన్నారు. తానింకా జగన్ ని కలవలేదని తెలిపారు.
కాగా... రెండు రోజుల క్రితం ఈ విషయంపై స్పందించిన మాధవ్... తనకు టిక్కెట్ వచ్చినా రాకపోయినా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎవరికి టికెట్ ఇచ్చినా, జెండా మోసే కార్యకర్తగా వారి గెలుపు కోసం పనిచేస్తాను అని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో... ఉమ్మడి అనంతపురం జిల్లాలో కురబ సామాజిక వర్గం బలంగా ఉందని గుర్తుచేశారు కూడా!