అంత్యక్రియలు జరిగిన 18 నెలల బతికొచ్చింది!

మధ్యప్రదేశ్‌లోని మండ్సర్ జిల్లాలో ఓ విచిత్రమైన సంఘటన వెలుగులోకి వచ్చింది.;

Update: 2025-03-22 13:30 GMT

మనిషి జీవితంలో జననం, మరణం సహజమైన ప్రక్రియలు. పుట్టిన ప్రతి ఒక్కరూ ఎప్పుడో ఒకప్పుడు మరణించక తప్పదు. మరణించిన తర్వాత వారి సంప్రదాయాల ప్రకారం అంత్యక్రియలు నిర్వహిస్తారు. ఆ తర్వాత తిరిగి బతకడం అనేది అరుదైన విషయం. కానీ మధ్యప్రదేశ్ లో ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. 18 నెలల క్రితం చనిపోయిందని భావించిన ఒక మహిళ తిరిగి రావడంతో అందరూ ఆశ్చర్యపోయారు.

మధ్యప్రదేశ్‌లోని మండ్సర్ జిల్లాలో ఓ విచిత్రమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. అదృశ్యమైన 18 నెలల తర్వాత లలితా బాయి అనే మహిళ తిరిగి తన ఇంటికి చేరుకుంది. అయితే, ఆమె చనిపోయిందని భావించిన ఆమె కుటుంబ సభ్యులు, పోలీసులు అప్పగించిన ఓ మృతదేహానికి అంత్యక్రియలు కూడా నిర్వహించడం గమనార్హం. తాజాగా లలితా బాయి తిరిగి రావడంతో కుటుంబ సభ్యులు ఆశ్చర్యానికి గురయ్యారు.

వివరాల్లోకి వెళితే.. మండ్సర్ జిల్లాకు చెందిన లలితా బాయి దాదాపు 18 నెలల క్రితం కనిపించకుండా పోయింది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొంతకాలానికి పోలీసులు ఓ మృతదేహాన్ని గుర్తించి, అది లలితా బాయిదేనని భావించి ఆమె కుటుంబ సభ్యులకు అప్పగించారు. వారు కూడా అది లలితా బాయి మృతదేహమేనని నమ్మి అంత్యక్రియలు పూర్తి చేశారు.

అయితే ఊహించని విధంగా లలితా బాయి తాజాగా తన ఇంటికి తిరిగి రావడంతో అందరూ షాక్‌కు గురయ్యారు. వెంటనే కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు లలితా బాయిని విచారించగా ఆమె సంచలన విషయాలు వెల్లడించింది. తనను ఎవరో ఒక వ్యక్తి రూ.5 లక్షలకు అమ్మేశాడని, ఆ తర్వాత ఇన్నాళ్లు తాను బందీగా ఉన్నానని ఆమె పోలీసులకు తెలిపింది.

లలితా బాయి చెప్పిన విషయాలను పోలీసులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఆమెను ఎవరు అమ్మారు, ఎక్కడ బందీగా ఉంచారు అనే విషయాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 18 నెలల క్రితం అంత్యక్రియలు చేసిన మృతదేహం ఎవరిదనే విషయం కూడా పోలీసులకు ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. పోలీసులు అన్ని కోణాల్లోనూ విచారణ జరుపుతున్నారు.

Tags:    

Similar News