సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన గంటల వ్యవధిలోనే సంచలన నిర్ణయం!
ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన గంటల వ్యవధిలోనే ఈ నిర్ణయం ప్రభుత్వం నుంచి వెలువడటం ఇప్పుడు సంచలనంగా మారింది.
ముఖ్యమంత్రి రేసులో అస్సలే లేని నేత.. ఏకంగా ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చునేందుకు వీలుగా అధినాయకత్వం నిర్ణయం తీసుకోవటం.. అందుకు తగ్గట్లే శాసనసభాపక్ష సమావేశంలో పార్టీ ఎమ్మెల్యేలు ఓకే చేస్తూ ఓటు వేయటం ద్వారా సీఎం అయ్యారు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన గంటల వ్యవధిలోనే ఆయన సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు. ప్రార్థనా స్థలాలు.. బహిరంగ ప్రదేశాల్లో లౌడ్ స్పీకర్లను బ్యాన్ చేయాలంటూ సాహసోపేతంగా వ్యవహరించారు. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన గంటల వ్యవధిలోనే ఈ నిర్ణయం ప్రభుత్వం నుంచి వెలువడటం ఇప్పుడు సంచలనంగా మారింది.
మతపరమైన ప్రదేశాలు.. ఇతర ప్రదేశాల్లో నియంత్రణ లేని.. ముందస్తుగా అనుమతి తీసుకొని అనియంత్రిత లౌడ్ స్పీకర్ల వినియోగాన్ని బ్యాన్ చేస్తూ తాజా మార్గదర్శకాల్ని జారీ చేయటం ఆసక్తికరంగా మారింది. నియంత్రిత లౌడ్ స్పీకర్లపై ఎలాంటి పరిమితి లేదని స్పష్టం చేస్తున్నారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉజ్జయిని సౌత్ ఎమ్మెల్యేగా గెలుపొందిన మోహన్ యాదవ్ భోపాల్ లో ప్రమాణస్వీకారం చేయటం తెలిసిందే.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.. గవర్నర్ మంగూభాయ్ సమక్షంలో మోహన్ యాదవ్ ప్రమాణస్వీకారం చేశారు. ఉప ముఖ్యమంత్రులుగా జగదీష్ దేవరా.. రాజేంద్ర శుక్లాలు ప్రమాణస్వీకారం చేశారు. సీఎం మోహన్ యాదవ్ నిర్ణయం నేపథ్యంలో గతంలో సుప్రీంకోర్టు ఆదేశాల్ని గుర్తు చేసుకుంటున్నారు. గతంలో సుప్రీంకోర్టు ఆదేశాల్ని చూస్తే.. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు లౌడ్ స్పీకర్లను ఉపయోగించొద్దని పేర్కొంది.
ఇటీవల జరిగిన మధ్యప్రదేశ్ అసెంబ్లీఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించటం.. 230 స్థానాలున్న అసెంబ్లీలో బీజేపీ ఏకంగా 163 స్థానాల్లో విజయం సాధించటం తెలిసిందే. ఇదిలా ఉంటే.. నాలుగుసార్లు ముఖ్యమంత్రిగా పని చేసిన శివరాజ్ సింగ్ చౌమాన్ ను కాదని.. బీసీ వర్గానికి చెందిన మోహన్ యాదవ్ ను సీఎంగా ఎంపిక చేయటం.. ప్రమాణస్వీకారం చేశారు. సీఎంగా ప్రమాణం చేసిన గంటల వ్యవధిలోనే ప్రార్థనాలయాలు.. మందిరాల వద్ద అనుమతి లేని లౌడ్ స్పీకర్లను నిషేధిస్తూ నిర్ణయం తీసుకున్నారు.