సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ ఎమ్మెల్యేకు హైకోర్టు దిమ్మ తిరిగేలా తీర్పు
ఉదయనిధి స్టాలిన్ మీదా అనుచిత వ్యాఖ్యలు చేసిన ఒక ఎమ్మెల్యేకు మద్రాసు హైకోర్టు అనూహ్య తీర్పును ఇవ్వటం ఆసక్తికరంగా మారింది.
రాజకీయ రంగం అన్నంతనే నోటికి వచ్చినట్లుగా మాటలు అనేయటం.. వెనుకా ముందు చూసుకోకుండా ఎంత మాట పడితే అంత మాట అనేసే పరిస్థితులు ఎక్కువ అవుతున్నాయి. దూకుడు రాజకీయాల్లో తీవ్రమైన నిందలు వేయటం నేతలకు ఒక అలవాటుగా మారింది. ఎవరెంత తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తే.. అంత గొప్ప అన్నట్లుగా పరిస్థితులున్నాయి. ఇలాంటివేళ.. ఒక ఎమ్మెల్యేకు ఒక రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన ఆదేశం దిమ్మ తిరిగేలా మారటమే కాదు.. ఇదే తరహాలో ఇతర కోర్టుల్లో తీర్పులు వెలువడితే మాత్రం.. నేతల నోళ్లకు తాళాలు పడే వీలుందని మాత్రం చెప్పక తప్పదు.
తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ పైనా.. ఆయన కుమారుడు ఉదయనిధి స్టాలిన్ మీదా అనుచిత వ్యాఖ్యలు చేసిన ఒక ఎమ్మెల్యేకు మద్రాసు హైకోర్టు అనూహ్య తీర్పును ఇవ్వటం ఆసక్తికరంగా మారింది. ఏ బహిరంగ సభలో అయితే అనుచిత వ్యాఖ్యలు చేశారో.. ఇప్పుడు అక్కడే మరో బహిరంగ సభను ఏర్పాటు చేసి.. తాను చేసిన వ్యాఖ్యల మీద బహిరంగ క్షమాపణలు చెప్పాలని కోర్టు ఆదేశించింది. అసలేం జరిగిందన్న విషయంలోకి వెళితే..
గత నెల 19న తమిళనాడులోని కల్లాకురిచ్చిలో విపక్ష అన్నాడీఎంకే ఒక బహిరంగ సభను నిర్వహించారు. ఇందులోఆ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే ఆర్ కుమారుగురు పాల్గొన్నారు. సభలో మాట్లాడిన ఆయన.. సీఎం స్టాలిన్.. ఆయన కుమారుడు ఉదయనిధిలను విమర్శిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శ్రుతిమించి రాగాన అన్నట్లుగా అసభ్య పదజాలాన్ని వాడారు. దీన్ని తీవ్రంగా పరిగణించిన అధికార డీఎంకే నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆయనపై ఉద్దేశపూర్వకంగా అల్లర్లకు రెచ్చగొట్టటం.. అసభ్య పదజాలాన్ని వాడటం.. శాంతి భద్రతలకు ఆటంకం కలిగించే సెక్షన్ల కింద ఐపీసీ 153, 294బీ, 504 తదితర సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
దీంతో.. ఆయన్ను అరెస్టు చేసేందుకు పోలీసులు ప్రయత్నించగా.. మాజీ ఎమ్మెల్యే దాన్ని తప్పించుకునేందుకు వీలుగా ముందస్తు బెయిల్ కోసం మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రిపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు సోషల్ మీడియాలో క్షమాపణలు చెప్పారని పేర్కొంటూ.. రాజకీయ ఒత్తిళ్లతోనే పోలీసులు కేసులు నమోదు చేసినట్లుగా వాదనలు వినిపించారు.
ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన జస్టిస్ జి. జయచంద్రన్ ధర్మాసనం, మాజీ ఎమ్మెల్యే తరఫు న్యాయవాది వాదనల్ని పరిగణలోకి తీసుకోలేదు. అంతేకాదు.. ముందస్తు బెయిల్ ను నిరాకరించారు. అంతేకాదు.. అనూహ్య రీతిలో ఆదేశాలు ఇచచారు. ముందస్తు బెయిల్ మంజూరు షరతుగా ఏ బహిరంగ సభలో అయితే ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేశారో.. అక్కడే వేదికను ఏర్పాటు చేసి.. అదే తరహాలో బహిరంగ సభను నిర్వహించి.. అక్కడి నుంచి ముఖ్యమంత్రికి క్షమాపణలు చెప్పాలని.. దానికి సంబంధించిన నివేదికను తమకు సమర్పించాలన్న సూచన చేశారు. అదే సమయంలో క్షమాపణలు చెప్పేందుకు వీలుగా పిటిషనర్ కు బహిరంగ సభను నిర్వహించుకోవటానికి వీలుగా పోలీసులు అనుమతులు ఇవ్వాలని పేర్కొన్నారు. తదుపరి విచారణను అక్టోబరు 11కు వాయిదా వేశారు. మరేం జరుగుతుందో చూడాలి.