పార్టీ నిర్ణయం మేరకే చేరికలు.. పీసీసీ చీఫ్ కీలక వ్యాఖ్యలు

ఈ క్రమంలో జీవన్ రెడ్డి డిమాండ్‌పై పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్‌గౌడ్ స్పందించారు.

Update: 2024-10-23 10:18 GMT

నిన్న జగిత్యాలలో జరిగిన హత్యతో ఒక్కసారిగా రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపింది. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రధాన అనుచరుడు నిన్న దారుణ హత్యకు గురయ్యాడు. దాంతో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జీవన్ రెడ్డి ఆ పార్టీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘మీ పార్టీకో దండం.. మీకో దండం’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘పార్టీ వద్దు ఏం మొద్దు.. ఇక నుంచి ఓ స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసుకొని సేవ చేసుకుంటా..’ అని మాట్లాడుకొచ్చారు. అంతటితో ఆగకుండా తన అనుచరులతో కలిసి రహదారిపై బైఠాయించారు. పార్టీలో ఫిరాయింపు దారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

అయితే.. నిన్నటి నుంచి జీవన్ రెడ్డి ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. పార్టీలోకి ఫిరాయింపుదారులు రావడం వల్లే ఈ దుస్థితి వచ్చిందని, అనుచరుడు చనిపోయాడంటే.. తాను చనిపోయినట్లే ఉందని ఆవేదన చెందారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చిన ప్రతీ ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వారందరిపై వేటు వేయాలని అన్నారు. ఇప్పటికే గత ఆరు నెలలుగా పార్టీలో ఎన్నో అవమానాలు ఎదుర్కొంటూ వస్తున్నానని.. ఇక తన వల్ల కాదని చెప్పుకొచ్చారు. జగిత్యాల ఎమ్మెల్యేను చేర్చుకునే సందర్భంలోనూ తనకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని జీవన్ రెడ్డి గతంలోనే ఆవేదన వ్యక్తం చేశారు.

తాజాగా కూడా జీవన్ రెడ్డి పరోక్షంగా ఫిరాయింపు ఎమ్మెల్యేపై పలు ఆరోపణలు చేశారు. వారి వల్లే ఈ రోజు తన అనుచరుడు చనిపోవాల్సి వచ్చిందంటూ సంచలన ఆరోపణలు చేశారు. రాజకీయ కక్షతోనే చంపేశారని అన్నారు. ఈ చర్యలపై ఊరుకునేది లేదని పట్టుబట్టారు. మరోవైపు.. టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్‌గౌడ్ కూడా జీవన్ రెడ్డికి ఫోన్ చేసి బుజ్జగించే ప్రయత్నం చేశారు. కానీ.. జీవన్ రెడ్డి అస్సలు వినిపించుకోలేదు. అంతేకాకుండా చీఫ్ మాట్లాడుతుండగానే ఆ ఫోన్‌ను కూడా విసిరిపారేసినట్లుగా సమాచారం.

ఈ క్రమంలో జీవన్ రెడ్డి డిమాండ్‌పై పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్‌గౌడ్ స్పందించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడంపై ఆయన హాట్ కామెంట్స్ చేశారు. ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకోవడం అనేది పార్టీ అధిష్టానం నిర్ణయమని క్లారిటీ ఇచ్చారు. పార్టీ నిర్ణయం ప్రకారమే వారిని పార్టీలో చేర్చుకున్నామని చెప్పారు. దీని వల్ల జీవన్ రెడ్డి ప్రతిష్టకు ఎక్కడా భంగం వాటిళ్లలేదని పేర్కొన్నారు. దీంతో జీవన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు ఒక్కసారిగా చెక్ పడినట్లయింది. ఈ విషయంలో జీవన్ రెడ్డి వెనక్కి తగ్గుతారా..? అధిష్టానం సైతం ఏ నిర్ణయం తీసుకోబోతోందా అన్నది ఆసక్తికరంగా మారింది.

Tags:    

Similar News