పోతూ పోతూ పోతిన గాజు గ్లాస్ కి చిల్లు పెట్టేశారు...!

ఒక సగటు మనిషి కూడా ఎమ్మెల్యే అయి అసెంబ్లీలోకి వెళ్లవచ్చు అన్న ఆశ ఆయనకు పవన్ కలిగిస్తే దాన్ని నమ్మి చిత్తశుద్ధితో పనిచేశారు పోతిన మహేష్.

Update: 2024-04-09 03:30 GMT

పోతిన మహేష్ జనసేనలో కరడు కట్టిన నేత. ఆయన అంటే వైసీపీ నేతలకు కూడా ఒక దశలో భయపడే పరిస్థితి వచ్చింది అంటే అతిశయోక్తి కాదేమో. జనసేన సిద్ధాంతాన్ని ఆయన అలవరచుకోలేదు. ఏకంగా తన శరీరం నిండా జీర్ణించేసుకున్నారు. పవన్ ఆశయాలు ఆయన పార్టీ సిద్ధాంతాలు ఎందరు అర్ధం చేసుకున్నారో తెలియదు. ఎందరు పాటించారో కూడా తెలియదు. కానీ మనసా వాచా పాటించిన వారు పోతిన మహేష్.

ఆయనకు రాజకీయాలు తెలియవు. జనసేన జెండాతోనే ఆయన రాజకీయం స్టార్ట్ అయింది. ఒక సగటు మనిషి కూడా ఎమ్మెల్యే అయి అసెంబ్లీలోకి వెళ్లవచ్చు అన్న ఆశ ఆయనకు పవన్ కలిగిస్తే దాన్ని నమ్మి చిత్తశుద్ధితో పనిచేశారు పోతిన మహేష్.

ఏ పార్టీకి అయినా హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉంటారు. అలాగే హార్డ్ కోర్ లీడర్స్ కూడా అవసరం. ఇపుడు చూస్తే అలాంటి లీడర్ పోతిన మహేష్ జనసేన నుంచి బయటకు వెళ్లిపోవడం ఆ పార్టీకి తీరని నష్టమే కలగచేస్తుంది అని అంటున్నారు. పోతిన మహేష్ ని ఏ విజయవాడ పశ్చిమ సీటుకో పరిమితం చేసి లైట్ తీసుకుంటే అది జనసేనకే నష్టం అని అంటున్నారు.

ఆయన ఏపీలోని మొత్తం జనసేన నేతలకు రోల్ మోడల్ గా ఉన్నారు. ఆయన కష్టం ఆయన శ్రమను అధినాయకత్వం ఎంతవరకూ గుర్తించిందో తెలియదు కానీ ఆయనను చూసి అలా మారాలనుకునే వారు స్పూర్తిగా తీసుకున్న వారు జనసేనలో కో కొల్లలు. అలాంటి పోతిన మహేష్ చెప్పే ప్రతీ మాటకు ఎంతో విలువ ఉంటుంది. ఇంకా చెప్పాలి అంటే పవన్ కంటే కూడా ఆయన మాటలకే జనసేనలో విలువ ఉంటుంది అనుకున్నా తప్పు లేదేమో.

ఎందుకంటే నాయకుడు పార్టీ పెడతారు. అనుసరించిన సేవకుడినే క్యాడర్ అంతా చూస్తారు. నమ్ముతారు. సో అలా పోతిన మహేష్ జనసేన నుంచి పోతూ పోతూ చేసిన కామెంట్స్ కానీ ఆయన పవన్ మీద చేసిన విమర్శలు కానీ ఆ పార్టీకి తీరని నష్టాన్ని తెస్తున్నాయని అంటున్నారు. ఆయన కాస్ట్ ని కూడా ముందుకు తెచ్చారు. కమ్మ వారి కోసం కాపులు త్యాగాలు చేయాలా అన్న ఒక్క ప్రశ్న చాలు జనసేన సమాధానం చెప్పడానికి ఎంతో వెతుక్కోవాలన్నది చెబుతుంది.

పొత్తు ధర్మం గురించి ఆయన అన్న మాటలు ఆలోచింపచేసేవే. కొవ్వొత్తిగా తమ పార్టీ కరిగిపోవాలా అన్న ఆయన ప్రశ్న లక్షలాది జనసైనికుల మెదళ్లకు పదును పెట్టేవే. నేను మోసపోయారు. మీరు కూడా ఆలోచించుకోండి అంటూ ఆయన జనసైనికులకు ఇచ్చిన పిలుపు కూడా వారిని ఎంతగానో ప్రేరేపించేదే. ఇప్పటిదాకా జనసేనలో పనిచేసిన లీడర్స్ బయటకు వెళ్ళిపోతూ కొన్ని విమర్శలు మాత్రమే చేశారు.

కానీ మహేష్ అయితే ఏకంగా జనసేన కూసాలనే కదిలించే ప్రయత్నం చేశారు. ఆయన అంటున్నది కూడా జనసేన శ్రేయస్సు కోరుతూనే కాబట్టి అంతా తప్పక వింటారు అంటున్నారు. రాజకీయాల్లో నటన కుదరదు అని ఆయన అనడం ఎక్కడో గుచ్చుకునేదే. అంతే కాదు పవన్ మాటలను ఆయనకే అప్పచెబుతూ పది ఇరవై సీట్లు తీసుకోవడానికి మేము టీడీపీ కుక్క బిస్కట్లుకు పడే వారమా అని ఒకనాడు గర్జించారు పవన్. ఇపుడు అదే కోట్ చేస్తూ పవన్ ని నిలదీశారు. 21 సీట్లను తీసుకోవడం కోసం ఎందుకు లొగింపోయారు అని అధినేతనే గద్దించారు.

వీటికంటే పదునైన మాట మరోటి ఉంది. తామంతా కలిసే జనసేనను బతికించుకుంటే పవన్ మాత్రం పార్టీని చంపేస్తున్నారు అని. ఇది మొత్తం క్యాడర్ కి గట్టిగా ఆలోచింపచేసేలా ఉంది అని అంటున్నారు. జనసేనకు జెండా లేదు అజెండా లేదు, గాజు గ్లాస్ గుర్తు లేదు అసలు జనసేనను పట్టించుకునే నాధుడు లేడు అంటూ కరడు కట్టిన నేత పోతిన మహేష్ నిప్పుల వర్షం కురిపించారు. అంతే కాదు 40 లక్షల క్రియాశీలక కార్యకర్తలు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాలని కోరారు.

పోతిన మహేష్ జనసేన నుంచి వెళ్లిపోవచ్చు కానీ ఆయన ప్రభావం మాత్రం జనసేన మీద తీవ్రంగానే ఉంటుంది అని అంటున్నారు. ఒకనాడు ఎన్టీయార్ టీడీపీ నుంచి బయటకు వెళ్లిన నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి ఆ పార్టీని జనాల్లో బదనాం చేసి 1989లో టీడీపీ అధికారంలో రాకుండా చేయగలిగారు.

తెలంగాణాలో ఎదురులేదనుకున్న కేసీఆర్ కి ఈటల రాజెందర్ అన్న నేత ఈటె ముల్లుతో గులాబీని గుచ్చేసి మరీ 2023 లో భారీ ఓటమికి ఎంతో కారణం అయ్యారు. అందువల్ల తమతో నడచిన నాయకులు ఒక్కరే కదా బయటకు పోయేది అనుకోకూడదు. అందరూ నాయకులూ ఒక్కరు కాదు. ఆ ఒక్క నాయకుడూ అందరిలా కాదు. అలాంటి లిస్ట్ లో పోతిన మహేష్ కచ్చితంగా ఉన్నారు. ఒక విధంగా జనసేనకు ఆయన అతి పెద్ద సవాల్ విసిరారు. జనసేన విశ్వసనీయత మీదనే దెబ్బ కొట్టారు. ఇది చాలా ప్రమాదకరం. చూడాలి మరి దీనిని ఎలా పార్టీ అధిగమిస్తుందో.

Tags:    

Similar News