మజ్లిస్ కోటకు బీటలు వారనున్నాయా?

మిగిలిన రంగాల సంగతి ఎలా ఉన్నా.. రాజకీయ రంగంలో అంచనాలు అంత తేలికైన విషయం కాదు.

Update: 2023-12-01 04:55 GMT

మిగిలిన రంగాల సంగతి ఎలా ఉన్నా.. రాజకీయ రంగంలో అంచనాలు అంత తేలికైన విషయం కాదు. అయితే.. ప్రజలకు.. రాజకీయ పక్షాలకు సన్నిహితంగా ఉండాలే కానీ చాలా విషయాలు ఇట్టే తెలుస్తుంటాయి. తాజాగా ముగిసిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నట్లు చెబుతున్నారు. ప్రభుత్వం ఏది ఉన్నా.. ఎన్నికలు ఏవి జరిగినా.. హైదరాబాద్ మహానగరంలోని పాతబస్తీ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు బైడిఫాల్ట్ మజ్లిస్ సొంతంగా ఉంటాయన్న విషయం తెలిసిందే.

దశాబ్దాల తరబడి.. పాతబస్తీకి ఏమీ చేయున్నా.. ఓవైసీ బ్రదర్స్ హవాకు తిరుగు లేని పరిస్థితి. అక్కడి ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో మైనార్టీలు సైతం మరో పార్టీని నమ్మే పరిస్థితి లేదు. ఒకవేళ నమ్మే వాతావరణం ఉన్నా.. దాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవటానికి సామ దాన దండోపాయాల్ని ప్రయోగించే విషయంలో మజ్లిస్ అస్సలు మొహమాటానికి గురి కాదన్న సంగతి తెలిసిందే. గడిచిన కొన్ని దశాబ్దాల కాలంలో మజ్లిస్ తనకు పట్టున్న ఏడు అసెంబ్లీ స్థానాల్లో విషయంలో ఏ పార్టీకి అవకాశాన్ని ఇవ్వదు.

ఇలాంటి వేళ నాంపల్లి అసెంబ్లీ నియోజకవర్గాన్ని టార్గెట్ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి ఫిరోజ్ ఖాన్ ఒక పట్టాన వంట పట్టే రకం కాదని చెప్పాలి. ఇదే అతన్ని మిగిలిన వారికి భిన్నంగా నిలిపిందని చెప్పాలి. 2009 నుంచి నాంపల్లి స్థానం నుంచి పోటీ చేస్తున్న ఆయన.. ఇప్పటివరకు తిన్న ఎదురుదెబ్బలు అన్నిఇన్ని కావు. గత ఎన్నికల వరకు ఓడిపోతూ వస్తున్న ఆయన.. ఈసారి మాత్రం ఫలితం ఆయనకు అనుకూలంగా ఉంటుందన్న మాట బలంగా వినిపిస్తోంది.

మజ్లిస్ తో ఇంత సుదీర్ఘకాలం పోరాడుతూ.. వారి కోటను బద్ధలు కొట్టాలన్న తలంఫుతో పని చేస్తున్న ఫిరోజ్ ఖాన్ ను పలువురు పట్టువదలని విక్రమార్కుడిగా అభివర్ణిస్తారు. మజ్లిస్ ఏ రీతిలో అయితే వ్యవహరిస్తుందో.. అవసరమైతే దానికి రెండు ఆకులు తిన్న విధంగా వ్యవహరించే గుణం ఫిరోజ్ ఖాన్ కు ఉందని చెబుతారు. ఈ కారణంతోనే మజ్లిస్ ను ఎదుర్కొని ఇంతకాలం పోరాడుతున్నట్లుగా వ్యాఖ్యానిస్తారు.

అంగబలం.. అర్థబలంతో పాటు.. పక్కా ప్లానింగ్ తో ఎన్నికల బరిలో దిగినప్పటికీ.. ప్రతిసారీ చివరి రెండు గంటల్లో జరిగే పోలింగ్ కారణంగా ఓటమి పాలవుతున్నట్లుగా చెబుతారు. ఈసారి మరింత పట్టుదలతో.. అంతకు మించిన మొండితనంతో వ్యవహరిస్తున్న ఫిరోజ్ ఖాన్ కు కాంగ్రెస్ గాలి కూడా వర్కువుట్ అయ్యే అవకాశం ఉందంటున్నారు. ఈ వాదనకు బలం చేకూరేలా తాజా పరిణామాలు చోటు చేసుకున్నాయి.

పోలింగ్ పూర్తి కావటానికి కాస్త ముందు మజ్లిస్ అభ్యర్థి బలంగా ఉండే పోలింగ్ బూత్ ల వద్దకు వెళ్లిన ఫిరోజ్ ఖాన్ పై మజ్లిస్ అభ్యర్థితో పాటు అతడి అనుచరగణం దాడికి పాల్పడే ప్రయత్నం చేశారు. ఆ సమయంలో పోలీసులు కనుక అక్కడ లేకుంటే పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారేది. ఇదంతా చూస్తే.. మజ్లిస్ కోటలో కలకలం మొదలైందని.. మారిన పరిస్థితులు ఫస్ట్రేషన్ కు గురయ్యేలా చేస్తుందని చెబుతున్నారు. అయితే.. ఈ వాదనలో నిజం ఎంతన్నది తేలాలంటే.. ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంట వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఆ సమయానికి పూర్తి క్లారిటీ రావటం ఖాయం. మజ్లిస్ కోటకు బీటలు వారే చారిత్రక సన్నివేశం.. ఫిరోజ్ ఖాన్ చేతుల్లో ఉందా? లేదా? అన్నది తేలనుంది.

Tags:    

Similar News