"మంచు" కరిగినంత సులువుగా కుటుంబ పరువు పోయిందా?

ఈ సమయంలో కుటుంబ కలహాలు రోడ్డెక్కడంతో శిఖరం అంత ఎత్తున కుటుంబ పరువు 'మంచు'లా కరిగిపోయిందా అనే చర్చా తెరపైకి వచ్చింది.

Update: 2024-12-11 05:43 GMT

మంచు మోహన్ బాబు కుటుంబ కలహాల వ్యవహారం ఇప్పుడు పబ్లిక్ ఫ్లాట్ ఫామ్ పైకి వచ్చేసిన సంగతి తెలిసిందే. ఇంతకాలం మూసి ఉన్న పిడికిలిలా ఉన్నట్లు కనిపించిన మోహన్ బాబు ఫ్యామిలీ... ఇప్పుడు వదిలిన పిడికిలిలా మారిందని, గుట్టంతా బయటపడిందని, వేళ్లు అన్నీ వేరయ్యాయని, వాటి మధ్యలో చాలా గ్యాప్ వచ్చేసిందనే చర్చ బలంగా వినిపిస్తుందని అంటున్నారు.

ఈ సమయంలో కుటుంబ కలహాలు రోడ్డెక్కడంతో శిఖరం అంత ఎత్తున కుటుంబ పరువు 'మంచు'లా కరిగిపోయిందా అనే చర్చా తెరపైకి వచ్చింది. 'క్రమశిక్షణే ఆయన్ను చూసి క్రమశిక్షణ నేర్చుకుంటుంది!'.. ఓ సినిమాలో మోహన్ బాబుని ఉద్దేశించి మరో క్యారెక్టర్ చెప్పిన డైలాగ్! తన పిల్లలను అత్యంత క్రమశిక్షణతో పెంచాను అనేది ఆయన చాలా సార్లు చెప్పిన మాట!

ఇంత క్రమశిక్షణ కలిగిన కుటుంబంలో ఎవరు క్రమశిక్షణ తప్పడం వల్ల ఈ సమస్య వచ్చింది.? అసలు ఇదంతా ఎక్కడ మొదలైంది.? దీనికి గల ప్రత్యక్ష కారకులు, పరోక్ష కారకులు ఎవరు.? సూత్రదారులు ఎవరు.? ఇంత వ్యవహారం బయటకు రాకుండానే చక్కదిద్దుకునే పరిపక్వత 'పెదరాయుడు'కి లేదా.? ఇవన్నీ అభిమానుల మదిని తొలిచేస్తోన్న ప్రశ్నలు అని అంటున్నారు!

అవును... మోహన్ బాబు విడుదల చేసిన ఆడియోలో చెప్పినట్లుగా.. ప్రతీ కుటుంబంలోనూ కలహాలు ఉంటాయి! ఇక అన్నదమ్ముల మధ్య ఆస్థి తగాదాలు అనేవి అత్యంత సహజమైన విషయమనే చెప్పాలి! ఇంతవరకూ మోహన్ బాబు చెప్పింది నిజమే... కానీ, ప్రాణహాని ఉందంటూ కొడుకు, కొడుకుపై తండ్రి పోలీస్ స్టేషన్ కు వెళ్లడం మాత్రం అత్యంత అరుదనే చెప్పాలి!

తన పోరాటం ఆస్తుల కోసమో, డబ్బు కోసమో కాదని.. ఆత్మగౌరవం కోసమని, తన భార్య బిడ్డల క్షేమం కోసమని మనోజ్ చెబుతున్నారు! మరోపక్క... మౌనికను వివాహం చేసుకోవడం మోహన్ బాబు ఫ్యామిలీ మెంబర్స్ కి ఏమాత్రం ఇష్టం లేదని ఆ ఇంట్లో పని మనిషి చెబుతున్న పరిస్థితి!

ఆమె మాటలు విని తన కొడుకు విపరీతంగా తాగుడుకు బానిసైపోయాడని, ఇంట్లో పని వాళ్లను కొడుతున్నాడని మోహన్ బాబు చెబుతున్నారు. మోహన్ బాబు పెద్ద కుమారుడు విష్ణుని ఎక్కువగా చూస్తున్నారని.. మనోజ్ ని సరిగా చూడటం లేదని మరో చర్చ అని అంటున్నారు. ఇలా కుటుంబంలో నుంచి బయటకు రాకూడని విషయాలన్నీ నేడు వీదుల్లోకి వచ్చేశాయని అంటున్నారు!

దీంతో... వ్యాయామ ఉపాధ్యాయుడిగా జీవితాన్ని ప్రారంభించి, నేడు అత్యంత ప్రతిష్టాత్మకమైన యూనివర్శిటీని స్థాపించే స్థాయికి చేరిన భక్తవత్సలం నాయుడు కుటుంబం పరువు "మంచు"లా కరిగిపోతోందనే చర్చ తెరపైకి వచ్చిందని అంటున్నారు. 50 ఏళ్ల నట జీవితం.. 573 సినిమాల్లో నటన.. సుమారు 72 చిత్రాల నిర్మాణం..!

1995 - 2001 వరకూ రాజ్యసభ సభ్యుడిగా పని చేయడం.. విద్యావేత్తగా గుర్తింపు తెచ్చుకోవడం.. నట ప్రపూర్ణ, కలెక్షన్ కింగ్, డైలాగ్ కింగ్, 4 డికేడ్స్ స్టార్, యాక్టర్ ఆఫ్ ది మిలీనియం, లైఫ్ టైం అచీవ్ మెంట్ అవార్డ్స్ నుంచి మొదలు 2007లో 'పద్మశ్రీ' అందుకోవడం వరకూ ఎన్నో బిరుదులు మరెన్నో పురస్కారాలు మోహన్ బాబు సొంతం.

చిత్తురు జిల్లా, ఏర్పేడు మండలం, మోదుగులపాలెం లో జన్మించిన భక్తవత్సలం నాయుడు.. జీవితంలో "స్వర్గం నరకం" చూశారని అంటారు. అంతటి ఉన్నత శిఖరం వంటి మోహన్ బాబు ఇంటి పరువు ఒక్క ఎపిసోడ్ తో "మంచు"లా కరిగిందని అంటున్నారు. ఇప్పటికైనా అయిపోయిందేమీ లేదు.. చక్కదిద్దుకుంటే అని మరికొంతమంది చెబుతున్నారు.

అలా కానిపక్షంలో మీడియాకు ఫుల్ మీల్స్ అయిపోతుంటారు.. ఈ రచ్చలో ప్రత్యర్థులు చలి కాచుకుంటూ ఉంటారు! జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను తట్టుకున్న "పెద రాయుడు".. ఇక "మా ఇంటి కథ" గుట్టు రట్టు అవ్వకూడదని "ఎం ధర్మరాజు ఎంఏ" స్థాయిలో ఫిక్సయితే... సమస్య సద్దుమణుగుతుందని అభిమానులు భావిస్తున్నారు!

Tags:    

Similar News