'మరియమ్మ' సంగతి మరిచి పోతే ఎలా కేటీఆర్ గారూ!
తెలంగాణలో తాజాగా జరిగిన దళిత మహిళపై పోలీసుల అరాచకాన్ని అందరూ ఖండించాల్సిందే. ఖండిస్తున్నారు కూడా
తెలంగాణలో తాజాగా జరిగిన దళిత మహిళపై పోలీసుల అరాచకాన్ని అందరూ ఖండించాల్సిందే. ఖండిస్తున్నారు కూడా. దొంగతనం కేసులో అదుపులోకి తీసుకున్న దళిత మహిళను షాద్ నగర్ పోలీసు స్టేషన్‌లో ఒక రాత్రంతా ఉంచి దారుణంగా కొట్టిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ దారుణ ఘోరంపై పోలీసులు వెంటనే స్పందించారు. సంబంధిత అధికారులపై చర్యలు తీసుకునేందు కు విచారణ కు కూడా ఆదేశించారు.
అయితే.. దీనిని భూతద్దంలో చూపిస్తూ.. రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎక్కడున్నాయని మాజీ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. ''ఇందిరమ్మ పాలన అంటే ఇదేనా?'' అంటూ రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దళిత మహిళపై దాష్టీకం చేశారని, దొంగతనం ఒప్పుకోవాలంటూ థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తారా? మహిళ అని కూడా చూడకుండా ఇంత అమానవీయంగా ప్రవర్తిస్తారా? నిక్కర్ తొడిగి, బూటు కాళ్లతో తన్నటమా..! ఇంత కర్కశత్వమా... సిగ్గు సిగ్గు..! కొడుకు ముందే చిత్ర హింసలా?' అంటూ మండిపడ్డారు.
నిజమే.. ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ తరఫున కొంత ఆలస్యంగా అయినా.. ఆయన స్పందించారు. కానీ.. ఇక్కడే కేటీఆర్ తమ పాలనలో జరిగిన ఘటనలను మరిచిపోతున్నారు. 2021, జూలై 21న కూడా ఇంతకంటే ఘోరం జరిగిన విషయం ఆయనకు గుర్తుకు లేకపోయినా.. రాష్ట్ర ప్రజలకు, మీడియాకు కూడా ఇంకా గుర్తుంది. అప్పుడు కూడా సేమ్ టు సేమ్ దళిత మహిళే. ఇళ్లలో పనులు చేసుకునే కుటుంబమే. అయితే.. ఇప్పట్లో కనీసం చావు తప్పింది. అప్పట్లో ఏకంగా పోలీసులు చంపేశారు. ఆ విషయాన్ని కేటీఆర్ మరిచిపోయినట్టుగా ఉన్నారు.
అప్పట్లో ఏం జరిగింది?
మరియమ్మ అనే మాదిగ సామాజిక వర్గానికి చెందిన 45 ఏళ్ల మహిళను యాదగిరి జిల్లా అడ్డగూడూరు పోలీసులు దొంగతనం కేసులోనే స్టేషన్‌కు పిలిపించారు. అప్పుడు కూడా.. ఆమెకు ఉన్న వికలాంగుడైన కుమారుడి ముందే.. చిత్ర హింసలు పెట్టారు. చివరకు ఆమె పోలీసు దెబ్బలతో స్టేషన్‌లోనే కుప్పకూలి ప్రాణాలు కోల్పోయింది.
అప్పట్లో కనీసం స్పందించేందుకు కేసీఆర్‌కానీ, కేటీఆర్ కానీ ముందుకు రాలేదు. సుమోటోగా తీసుకున్న హైకోర్టు.. కుటుంబానికి న్యాయం చేస్తారా? లేదా? అని నిప్పులు చెరిగితే.. తూతూ మంత్రంగా చేసి చేతులు దులుపుకొనేందుకు ప్రయత్నించారు. మరో ఆరు మాసాలకు హైకోర్టు ఏం చేశారని ఆరా తీసి మొట్టికాయలు వేస్తే.. ఆ కుటుంబానికి ఓ కాంట్రాక్టు ఉద్యోగం ఇచ్చి.. అప్పటి వరకు వెనుకేసుకువచ్చిన దండ ధరులను ఉద్యోగాల నుంచి తొలగించారు.
మరి అప్పుడు దళిత బిడ్డకు అన్యాయం జరగలేదా?
రక్షించాల్సిన పోలీసులతోనే రక్షణ లేని పరిస్థితిని కల్పించలేదా? ''ఈ ప్రభుత్వానికి ఆడబిడ్డల ఉసురు మంచిది కాదని హెచ్చరించి''న కేటీఆర్‌కు ఆ విషయం కనిపించడం లేదా? ప్రభుత్వం మారినా పోలీసుల్లో మార్పు రావడం లేదన్నది ఇక్కడ అసలు విషయం.. దానిపై పోరాటం చేస్తే మంచిది. ప్రస్తుతం వెలుగు చూసింది కాబట్టి.. షాద్ నగర్ పోలీసుల బాగోతం బయట పడింది. కానీ, రాష్ట్ర వ్యాప్తంగా ఇలానే ఉందన్నది వాస్తవం.