కుంభమేళాలో ముస్లింల మతమార్పిడులు జరుగుతున్నాయా?

ఉత్తరప్రదేశ్ లోని త్రివేణి సంగమంలో పన్నెండేళ్లకు ఒసారి మహా కుంభమేళాను.. నాలుగేళ్లకు ఒకసారి కుంభమేళా వేడుకల్ని నిర్వహించటం తెలిసిందే.

Update: 2025-01-06 05:46 GMT

పుష్కరానికి వచ్చే మహా పండుగగా మహా కుంభమేళాను అభివర్ణిస్తారు. ఉత్తరప్రదేశ్ లోని త్రివేణి సంగమంలో పన్నెండేళ్లకు ఒసారి మహా కుంభమేళాను.. నాలుగేళ్లకు ఒకసారి కుంభమేళా వేడుకల్ని నిర్వహించటం తెలిసిందే. అయితే.. తాజాగా జరిగేవి మహా కుంభమేళా వేడుకలు. ఇలాంటి వేళ మహా కుంభమేళా జరిగే ప్రాంతాల వైపు ముస్లింలు వెళ్లొద్దని ఆలిండియా ముస్లిం జమాత్ అధ్యక్షుడు మౌలానా షాహబుద్దీన్ రజ్వీ బర్వేలీ చేసిన వివాదాస్పద వ్యాఖ్యల వేళ.. ఆయన మరో సంచలన ఆరోపణ చేశారు.

పన్నెండేళ్లకు ఒకసారి జరిగే మహా కుంభమేళ వేడుకలో ముస్లింల మతమార్పిడికి ప్రయత్నాలు జరుగుతున్నట్లుగా ఆయన ఆరోపించారు. మహాకుంభ మేళ కార్యక్రమంలో మతమార్పిడుల తంతు జరగబోతున్నట్లుగా తమకు విశ్వసనీయ సమాచారం అందినట్లుగా పేర్కొన్న ఆయన.. దీనికి సంబందించిన అంశాలను యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కు లేఖ ద్వారా తెలియజేసినట్లు పేర్కొన్నారు. ఈ అంశంపై చర్యలు తీసుకోవాల్సింది రాష్ట్ర ప్రభుత్వమేనని తేల్చారు.

సనాతన ధర్మాన్ని పాటించే హిందువులు నడిపే దుకాణాల నుంచి పూజాసామాగ్రిని కొనుగోలు చేయాలని అఖిల భారతీయ అఖాడ పరిషత్ పిలుపును ఇచ్చిన తరుణంలో అందుకు భిన్నమైన ఆరోపణలు రావటం ఇప్పుడు సంచలనంగా మారింది. ఈసారి మహా కుంభమేళా వేడుకలు ఈ నెల 13 నుంచి 26వ తేదీ వరకు ప్రయాగ్ రాజ్ లో జరగనున్న సంగతి తెలిసిందే.

కుంభమేళా జరిగే ప్రాంతాల్లో స్థానిక ముస్లింలు వ్యాపారాలు చేసుకోనివ్వకుండా అడ్డుకోవాలనే ఉద్దేశంతో కొన్ని హిందూ సంస్థలు కుట్ర పన్నుతున్నట్లుగా విమర్శలు వస్తున్నాయి. ఇలాంటి వేళ.. ఆలిండియా షియా పర్సనల్ లా బోర్డు ప్రధాన కార్యదర్శి మౌలానా యాసూబ్ అబ్బాస్ స్పందన మరోలా ఉంది. కుంభమేళా పరిసరాలకు ముస్లింలు వెళ్లినా వారికేమీ నష్టం ఉండదని.. ఒక ప్రార్థనా స్థలానికి వెళ్లినంత మాత్రాన ముస్లిం వ్యక్తి తన మత విశ్వాసాన్ని మార్చుకునేంత బలహీనంగా ఇస్లాం లేదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేయటం గమనార్హం.

Tags:    

Similar News