మంగళగిరిలో టీడీపీ దాష్టికం!... వైసీపీ కార్యకర్త వెంకటరెడ్డి మృతి!

గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో ద్విచక్ర వాహనాలతో వైసీపీ కార్యకర్తలపై పలువురు దుండగులు ఢీకొట్టిన సంగతి తెలిసిందే

Update: 2024-04-20 04:24 GMT

గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో ద్విచక్ర వాహనాలతో వైసీపీ కార్యకర్తలపై పలువురు దుండగులు ఢీకొట్టిన సంగతి తెలిసిందే! ఇదంతా టీడీపీ కార్యకర్తలు, నారా లోకేష్ అనుచరుల పనే అంటూ తీవ్ర ఆందోళనలు వ్యక్తమయ్యాయి. అయితే ఈ దాడుల్లో తీవ్రంగా గాయపడిన వైసీపీ కార్యకర్త మేకా వెంకటరెడ్డి తీవ్రంగా గాయపడి కోమాలోకి వెళ్లిన సంగతీ తెలిసిందే. అయితే.. కోమాలో ఉన్న వెంకటరెడ్డి శుక్రవారం రాత్రి మృతి చెందారు.

అవును... గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో పలువురు టీడీపీ కార్యకర్తలు చేసిన దారుణమైన దాడిలో తీవ్రంగా గాయపడిన వైసీపీ నాయకుడు, జేసీఎస్‌ కన్వినర్‌ మేకా వెంకటరెడ్డి కన్నుమూశారు. దాడి అనంతరం ఆస్పత్రిలో జాయిన్ అవ్వగా.. తొలుత ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని మణిపాల్‌ వైద్యులు శుక్రవారం తెలిపారు. ఈ క్రమంలో వెంటిలేటర్‌ పై ఉన్న వెంకటరెడ్డి కన్నుమూసినట్లు శుక్రవారం ప్రకటించారు.

ఈ వార్త తెలియడంతో వెంకటరెడ్డి భార్య, కుమారుడు, కుమార్తె, కుటుంబసభ్యులు ఆస్పత్రి వద్దే కుప్పకూలారు. ఈ సమయంలో వారంతా కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కాగా.. తాడేపల్లి రూరల్‌ మండలం కుంచనపల్లిలో గురువారం రాత్రి ఎన్నికల ప్రచారం చేస్తున్న వైసీపీ వర్గీయులను టీడీపీకి చెందినవారు దుర్భాషలాడటమేగాక ద్విచక్ర వాహనాలతో ఢీకొట్టిన సంగతి తెలిసిందే. దీంతో... కిందపడిపోయి తలకు తీవ్రగాయమైన మేకా వెంకటరెడ్డికి చికిత్స చేసినా ఫలితం లేకపోయింది.

అయితే... వెంకటరెడ్డిపై దాడికి తెగబడిన బ్యాచ్ టీడీపీ తాడేపల్లి పట్టణ కార్యాలయంలో తలదాచుకున్నట్లు చెబుతున్నారు. ఈ సమయంలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వెంకటరెడ్డి పరిస్థితి తెలుసుకోవడం కోసం ఢీకొట్టిన ద్విచక్ర వాహనంపైనే ఒక రౌడీ షీటర్, మరికొంతమంది యువకులు అక్కడకు చేరారని అంటున్నారు. ఈ క్రమంలో ఆ వాహనంపై ఉన్న వ్యక్తి ప్రస్తుతం మహానాడులో నివాసముంటున్న మాదల గురువర్ధన్‌ అని చెబుతున్నారు.

దీంతో వెంకటరెడ్డిపై దాడికి ఉపయోగించిన ద్విచక్ర వాహనంతోపాటు గురువర్ధన్‌ ను పట్టుకున్న వైసీపీ కార్యకర్తలు.. అతడిని పోలీసులకు అప్పగించారని తెలుస్తుంది. ఇదే సమయంలో.. వెంకటరెడ్డిని ద్విచక్ర వాహనంతో ఢీకొట్టిన బొమ్మలబోయిన ఈశ్వర్‌ ను పోలీస్‌ స్టేషన్‌ లో అప్పగించారని సమాచారం. ఇదే సమయంలో... వెంకటరెడ్డిని వెనుక నుంచి బైక్‌ తో ఢీ కొట్టడంతోనే ఈ ఘటన జరిగిందని పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో తేల్చారని తెలుస్తోంది.

ఈ క్రమంలో... టీడీపీ కార్యకర్తలు చేసిన దుశ్చర్య ఇది అంటూ తీవ్ర విమర్శలు తెరపైకి వస్తున్నాయి. కేవలం ఓటమి భయంతోనే నారా లోకేష్.. తన బ్యాచ్ తో ఈ పనులకు పాల్పడుతున్నారని అంటున్నారు. ఈ సమయంలో ఇలాంటి పనులకు పాల్పడుతున్నవారిని ప్రజలు దూరంగా పెట్టాలని వైసీపీ నేతలు ప్రజలకు పిలుపునిస్తున్నారు.

Tags:    

Similar News