ప్రాణం తీసిన హెయిర్ ట్రాన్స్ ప్లాంట్.. అసలేం జరిగింది?

ఇటీవల కాలంలో వయసుతో సంబంధం లేకుండా జుట్టు ఊడిపోవడం అత్యంత సహజమైన విషయంగా మారిన సంగతి తెలిసిందే.

Update: 2024-09-26 11:30 GMT

ఇటీవల కాలంలో వయసుతో సంబంధం లేకుండా జుట్టు ఊడిపోవడం అత్యంత సహజమైన విషయంగా మారిన సంగతి తెలిసిందే. జీన్స్ వల్ల కొందరికి ఊడితే.. కాలుష్యం, ఒత్తిడి వల్ల మరికొంతమందికి జుట్టు ఊడిపోతుంది. ఇందులో పెళ్లి కాని యువకుల జాబితా కూడా ఎక్కువగానే ఉందని అంటున్నారు.

ఒకప్పుడు ఇలా జుట్టు ఊడినవాళ్లు విగ్గులు పెట్టుకునేవారు.. అయితే ఇప్పుడు హెయిర్ ట్రాన్స్ ప్లాంట్ చేయించుకుంటున్నారు. తమ అందాన్ని తిరిగి తెచ్చుకుంటున్నారు! అయితే తాజాగా ఈ ప్రయత్నమే చేసిన ఓ యువకుడు ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఇది మరోసారి కాస్మొటిక్ సర్జరీలు విఫలమైతే జరిగే పరిణామాలపై చర్చకు తెరలేపింది.

అవును... మంగుళూరులో కాస్మొటిక్ సర్జరీ సమయంలో ఓ విషాద ఘటన జరిగింది. ఇల్లాల్ లోని అక్కరెకెరె నివాసి మహమ్మద్ మజిన్.. బెండోర్ వెల్ లోని ఫ్లాంట్ కాస్మొటిక్ సర్జరీ, హెయిర్ ట్రాన్స్ ప్లాంట్ క్లీనిక్ లో గైనెకోమాస్టియా కోసం శస్త్రచికిత్స చేయించుకుంటున్నాడు.

ఈ సమయంలో అతడి ఆరోగ్యం విషమించిందని చెబుతున్నారు. వాస్తవానికి అరగంట మాత్రమే ఈ చికిత్స ఉంటుందని.. అయితే సాయంత్రం వరకూ అతడు రాకపోవడంతో తల్లితండ్రులు ఆందోళన వ్యక్తం చేశారని అంటున్నారు. ఈ సమయంలో తమ కుమారుడి పరిస్థితి గురించి ఆస్పత్రిలో ఆరా తీయగా.. అతడి ఆరోగ్యం విషమించిందని సమాచారం అందిందట.

అప్పటికే అతడిని ఆ క్లీనిక్ వారు స్థానిక ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారని అంటున్నారు. దీంతో... శస్త్రచికిత్స సమయంలో వైద్యుల నిర్లక్ష్యమే మహమ్మద్ అకాల మరణానికి కారణమైందని కుటుంబీకులు ఆరోపిస్తున్నారు.

ఈ వ్యవహారంపై దక్షిణ కన్నడ జిల్లా ఆరోగ్య శాఖ అత్యంత సీరియస్ గా వ్యవహరిస్తోందని అంటున్నారు. శస్త్రచికిత్స సమయంలొ మాజిన్ అనూహ్య క్షీణత గురించి నివేదికలు వెలువడిన తర్వాత సమాచారాన్ని సేకరించేందుకు జిల్లా ఆరోగ్య అధికారి క్లీనిక్ ని సందర్శించారు.

ఈ సందర్భంగా స్పందించిన ఆయన... ఈ ఘటనను సీరియస్ గా పరిగణిస్తున్నామని.. క్లీనిక్ సిబ్బంది, యాజమాన్యం నుంచి సమాచారాన్ని సేకరిస్తున్నమని ఆయన తెలిపారు. ఇదే సమయంలో సమగ్ర దర్యాప్తు కోసం ఓ కమిటీని ఏర్పాటు చేయనున్నారని తెలుస్తొంది. మరోపక్క కద్రి స్టేషన్ లో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు!

Tags:    

Similar News