టెకాఫ్ అయిన కాసేపటికే విమానంలో మంటలు... వీడియో వైరల్!
ఇటీవల కాలంలో విమానాలకు సంబంధించిన పలు వార్తలు హల్ చల్ చేస్తున్న సంగతి తెలిసిందే
ఇటీవల కాలంలో విమానాలకు సంబంధించిన పలు వార్తలు హల్ చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రధానంగా విమానాల్లో టాయిలెట్ డోర్స్ లాక్ పడిపోవడం, విమానం గాల్లో ఉండగానే డోర్స్ ఊడిపోవడం, బోల్టులు లూజుగా ఉండటం, పైలట్ లు మధ్యం సేవించారని చెబుతుండటం... ఒకటేమిటి ఏన్నో విషయాలు ఇటీవల కాలంలో వెలుగులోకి వస్తూ ఆందోళన కలిగిస్తున్నాయి! ఈ సమయంలో తాజాగా గాల్లో ఉన్న విమానంలో మంటలు చెలరేగాయి.
అవును... విమానం గాల్లో ఉన్న సమయంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో ఒక్కసారిగా ఆందోళన వ్యక్తం అయ్యింది. ఇంజిన్ లో సాంకేతిక సమస్య తెలెత్తడం వల్ల మంటలు చెలరేగాయని చెబుతున్నారు. అయితే అది కార్గో విమానం అని, అందులోని సిబ్బందికి ఎలాంటి హానీ జరగలేదని చెప్పడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.
వివరాళ్లోకి వెళ్తే... అమెరికా కాలమానం ప్రకారం గురువారం రాత్రి సమయంలో మియామీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ నుంచి అట్లాస్ ఎయిర్ కు చెందిన బోయింగ్ 747-8 విమానం ప్యూర్టోరికాకు బయల్దేరింది. ఇలా టేకాఫ్ అయిన కొద్దిసేపటికే అందులో మంటలు చెలరేగాయి. దీంతో ఆ విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు.
ఈ విషయాలపై స్పందించిన అధికారులు... విమానం టేకాఫ్ అయిన కొన్ని నిమిషాలకే ఇంజిన్ లో సాంకేతిక సమస్య తలెత్తి మంటలు చెలరేగాయని.. అయితే, అప్రమత్తమైన పైలట్ వెంటనే విమానాన్ని వెనక్కి మళ్లించి మియామీ ఎయిర్ పోర్టులో అత్యవసరంగా ల్యాండ్ చేశారని తెలిపారు. ఇదే సమయంలో... ఇది కార్గో విమానమని.. అందులోని సిబ్బందికి ఎలాంటి హానీ జరగలేదని పేర్కొన్నారు.
దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.