ఆమెను ఉప ముఖ్యమంత్రిని చేసుకోండి.. నాకు మాత్రం ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాల్సిందే

తెలంగాణలో హ్యాట్రిక్ విజయంపై కన్నేసిన కేసీఆర్ కు తలనొప్పి తప్పడం లేదు. 115 స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే

Update: 2023-08-29 09:47 GMT

తెలంగాణలో హ్యాట్రిక్ విజయంపై కన్నేసిన కేసీఆర్ కు తలనొప్పి తప్పడం లేదు. 115 స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో టికెట్ దక్కని సిట్టింగ్ ఎమ్మెల్యేలు, టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు కేసీఆర్పై తీవ్ర అసంత్రుప్తి వ్యక్తం చేస్తున్నారు. కొందరు ఇప్పటికే పార్టీ మారే ఆలోచనలో ఉన్నారు. మరికొందరినేమో బుజ్జగిస్తూ, ఇతర పదవుల ఆశ చూపిస్తూ కేసీఆర్ దారికి తెచ్చుకుంటున్నారని టాక్. ఇక అభ్యర్థులను ప్రకటించకుండా పెండింగ్లో ఉంచిన నాలుగు స్థానాల్లో టికెట్ల కోసం పోటీ నెలకొంది. ఇందులో ముఖ్యంగా మెదక్ జిల్లా నర్సాపూర్ టికెట్ విషయంలో ఇద్దరు నేతల ఢీ అంటే ఢీ కొడుతున్నారని తెలిసింది.

నర్సాపూర్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మదన్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం ఖాయమని చెబుుతున్నారు. నర్సాపూర్ నియోజకవర్గాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదలనని మొండి పట్టు పడుతున్నారు. తనకు బీఫాం కచ్చితంగా ఇస్తారని, ప్రజాబలం.. పార్టీ అండా తనకు ఉందని మదన్ రెడ్డి చెబుతున్నారు. మరోవైపు వచ్చే ఎన్నికల్లో ఇక్కడి నుంచి పోటీ చేసేందుకు మాజీ మంత్రి, రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ సునీతా రెడ్డి ప్రయత్నిస్తున్నారు. టికెట్ కోసం హరీష్ రావుతో కలిసి ఆమె ప్రగతి భవన్కు కూడా వెళ్లారని తెలిసింది.

పైకి మదన్ రెడ్డి, సునీతా రెడ్డి బాగానే కనిపిస్తున్నా లోపల మాత్రం టికెట్ కోసం ఎవరి ప్రయత్నాలు వాళ్లు చేస్తున్నట్లు టాక్. అయితే సునీతా రెడ్డి విషయాన్ని పరోక్షంగా ప్రస్తావించిన మదన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కావాలంటే ఆమెను ఎమ్మెల్సీ చేసి, ఆపై ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చినా తనకు అభ్యంతరం లేదని మదన్ రెడ్డి అన్నారు. కానీ ఎమ్మెల్యే టికెట్ మాత్రం తనకే దక్కాలని బల్ల గుద్ది మరీ స్పష్టం చేస్తున్నారు. లేదంటే నియోజకవర్గంలో బీఆర్ఎస్ ముక్కలయ్యే ప్రమాదం కూడా ఉందని మదన్ రెడ్డి హెచ్చరిస్తున్నట్లు తెలిసింది.

Tags:    

Similar News