ఉక్రెయిన్-రష్యా యుద్ధానికి ముగింపు.. మళ్లీ మోదీ టూర్?

యుద్ధం విరమణకు స్నేహితుడిలా సాయం చేస్తానని ప్రకటించారు. మరి దీనికి ఎప్పుడు ముహూర్తం? అన్న ప్రశ్నలు వచ్చాయి.

Update: 2024-09-13 08:22 GMT

జూలై నెలలో అనూహ్యంగా రష్యా పర్యటనకు వెళ్లారు ప్రధాని మోదీ.. మిగతా ప్రపంచం అంతా రష్యాను వెలి వేసినట్లుగా చూస్తున్న సమయంలో.. చైనా, ఉత్తర కొరియా, ఇరాన్ తప్ప మిగతా ఏ దేశాలు కనీసం కన్నెత్తి చూడని వేళ.. మోదీ పర్యటన అందరినీ ఆశ్చర్యపరిచింది. అసలు రెండేళ్ల పాటు ఉక్రెయిన్-రష్యా మధ్య సమాన దూరం పాటిస్తున్న భారత్ వైఖరిలో ఇంత మార్పు ఏమిటా? అని నోరెళ్ల బెట్టారు. ఇక రష్యా అధ్యక్షుడు పుతిన్ ను మోదీ ఆలింగనం చేసుకోవడంపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ మండిపడ్డారు. మిగతా ప్రపంచ వ్యాప్తంగానూ రష్యా వైపే భారత్ అన్న సందేహాలు కలిగాయి. ఈ నష్ట నివారణకో ఏమో.. మోదీ ఆగస్టు నెలలో ఉక్రెయిన్ వెళ్లారు. జెలెన్ స్కీనీ ఆలింగనం చేసుకున్నారు. యుద్ధం విరమణకు స్నేహితుడిలా సాయం చేస్తానని ప్రకటించారు. మరి దీనికి ఎప్పుడు ముహూర్తం? అన్న ప్రశ్నలు వచ్చాయి.

అడుగులు పడ్డాయి..

బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికాలతో కూడిన బ్రిక్స్‌ జాతీయ భద్రతా సలహాదారుల సమావేశంలో భారత్ నుంచి అజిత్ దోవల్ పాల్గొంటున్నారు. గురువారం రష్యా రెండో అతిపెద్ద నగరం సెయింట్‌ పీటర్స్‌బర్గ్ లో ఆయన పుతిన్‌ తో భేటీ అయ్యారు. కరచాలనం చేశారు. దీంతో పాటు ప్రధాని మోదీని ఉద్దేశిస్తూ తన స్నేహితుడి కోసం ఎదురుచూస్తున్నానని చెప్పారు. ఆయనకు శుభాకాంక్షల సందేశం పంపారు. ఈ సందర్భంగా జెలెన్‌ స్కీతో మోదీ జరిపిన చర్చల గురించి పుతిన్‌కు దోవల్‌ వివరించారు. తమ ప్రధాని ఆదేశాల మేరకు రష్యా పర్యటనకు వచ్చినట్లు చెప్పారు.

ఈ నెల 22 తర్వాత

ఈ నెల 22-24 మధ్యన రష్యా నగరం కజన్‌ లో బ్రిక్స్‌ దేశాల సదస్సు జరగనుంది. దీనికి మోదీ వెళ్తారని తెలుస్తోంది. అప్పుడు పుతిన్ తో మోదీ భేటీ కావాలనుకుంటున్నట్లు దోవల్‌ చెప్పారు. మరోవైపు భారత్‌-రష్యా మధ్య కుదిరిన ఒప్పందాల అమలుపై ఫలితాలు, భవిష్యత్ అవకాశాలను వివరించేందుకు బ్రిక్స్ సదస్సులో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించాలని పుతిన్ సూచించారు. ఇక ఉక్రెయిన్ పర్యటన సందర్భంగా తాము యుద్ధంలో తటస్థం కాదని.. శాంతి పక్షమని మోదీ చెప్పిన సంగతి తెలిసిందే. ఒకవేళ బ్రిక్స్ సదస్సుకూ మోదీ వెళ్లి రష్యా-ఉక్రెయిన్ మధ్య శాంతి చర్చలకు పునాది వేస్తారేమో చూడాలి.

Tags:    

Similar News