అయ్యా మోడీ.. అమరావతి మాదిరి రైల్వేజోన్ విషయంలో చేయొద్దు

అయితే.. ఇక్కడే ఒక చిక్కు. అదేమంటే.. మోడీ 1.0లో ఏపీ రాజధానిగా అమరావతిని ఆయన చేతుల మీదుగా శంకుస్థాపన చేయటం తెలిసిందే.

Update: 2024-10-08 10:30 GMT

రాష్ట్ర విభజన వేళ.. దారుణంగా నష్టపోతున్న ఏపీకి వరంగా విశాఖపట్నం కేంద్రంగా కొత్త రైల్వే జోన్ ను మంజూరు చేస్తామంటూ అప్పటి కేంద్రప్రభుత్వం హామీ ఇవ్వటం తెలిసిందే. అయితే.. మోడీ సర్కారు ఆ హామీని తుంగలో తొక్కటమే కాదు.. రైల్వే జోన్ ను విశాఖకు కేటాయించే విషయంలోఎన్ని మలుపులు తిరిగాయో తెలిసిందే. ఇటీవల వెల్లడైన సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో బీజేపీకి బొటాబొటి మెజార్టీ రావటం.. కేంద్రంలో ఎన్డీయే సర్కారు కొలువు తీరే విషయంలో చంద్రబాబు కీలకం కావటం తెలిసిందే.

మొత్తంగా విభజన వరంగా పేర్కొన్న విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ కల ఇన్నాళ్లకు సాకారం కానుంది. డిసెంబరులో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సమక్షంలో రైల్వే జోన్ కు శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించాలని డిసైడ్ చేశారు. ఈ భేటీ సందర్భంగా విశాఖ రైల్వే జోన్ ను సాధించటమే కాదు.. శంకుస్థాపన వరకు విషయాన్ని తీసుకెళ్లటం గ్రేట్ అచీవ్ మెంట్ గా చెప్పాలి.

అయితే.. ఇక్కడే ఒక చిక్కు. అదేమంటే.. మోడీ 1.0లో ఏపీ రాజధానిగా అమరావతిని ఆయన చేతుల మీదుగా శంకుస్థాపన చేయటం తెలిసిందే. ఐదేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ.. అమరావతిని రాజధానిగా గుర్తించకపోవటం.. ఆ తర్వాత మూడు రాజధానుల అంశం తెర మీదకు రావటం తెలిసిందే. ఇంత జరుగుతున్నా.. తన చేతుల మీదుగా అమరావతికి శంకుస్థాపన చేసిన ప్రధాని నరేంద్ర మోడీ.. ఆ తర్వాత దాని స్థానే మూడు రాజధానులు అన్నప్పటికీ కేంద్రం తరఫున తాను చేయాల్సిన పనులను ఏ రోజు పట్టించుకున్నది లేదు.

మూడు రాజధానుల మాట తెర మీదకు వచ్చినప్పుడు.. తన చేతుల మీదుగా శంకుస్థాపన చేసిన అమరావతికి అన్యాయం జరగకుండా మాట్లాడింది లేదు. మౌనంగా ఉన్న మోడీ.. తన పదేళ్ల పదవీకాలంలో ఏపీకి ఇవ్వాల్సిన రైల్వే జోన్ ను ఇచ్చింది లేదు. మొత్తంగా ఈ మధ్యన వెల్లడైన సార్వత్రిక ఫలితాలతో ఆయనకు ఆదరణ తగ్గటం.. అనుకున్నన్ని సీట్లు రాకపోవటంతో కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం కొలువు తీరక తప్పని పరిస్థితి. దీంతో.. ఎన్నాళ్ల నుంచో పెండింగ్ లో ఉన్న విశాఖ రైల్వే జోన్ అంశం ముందుకు వచ్చింది.

మొత్తానికి డిసెంబరులో రైల్వే జోన్ కు శంకుస్థాపన చేసే కార్యక్రమానికి ప్రధాని మోడీ వస్తానని ఓకే చేయటం తెలిసిందే. అయితే.. ఇక్కడ ఒకే ఒక్క సందేహం. ఏపీ రాజధానిగా అమరావతిని మోడీ చేతలు మీదుగానే శంకుస్థాపన జరగటం.. ఆ తర్వాత దాన్ని పట్టించుకోకుండాఉండిపోవటం తెలిసిందే. ఇప్పుడు రైల్వే జోన్ విషయంలోనూ శంకుస్థాపనకు రానున్న ప్రధాని మోడీ.. కనీసం దీని అంశంలో అయినా.. కాస్త కేర్ తీసుకోవాలన్న మాట వినిపిస్తోంది.

అమరావతి మాదిరి మధ్యలో వదిలేయకుండా.. రైల్వే జోన్ అంశాన్ని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాల్సిన అవసరం ఉందంటున్నారు. మరి.. దీనికి మోడీ మాష్టారు మాటల్లో కంటే చేతల్లో చేసి చూపిస్తే.. సుదీర్ఘకాలంగా ఏపీ ప్రజలకు స్వప్నంగా ఉన్న కొత్త రైల్వేజోన్ కల తీరినట్లుఅవుతుందని చెప్పాలి. అమరావతి విషయంలో మోడీ సెంటిమెంట్ భయపెడుతున్నా.. ఇప్పుడున్న పరిస్థితుల్లో మార్పు ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరేం జరుగుతుందో చూడాలి.

Tags:    

Similar News