మోదీ కేబినెట్ లో 99 శాతం మంది కోటీశ్వరులు..!
కొత్తగా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన 71 మందిలో 70 మంది కోటీశ్వరులేనని వెల్లడించింది
కేంద్రంలో కొత్తగా కొలువుదీరిన మోదీ సర్కారు లోని కొత్త కేబినెట్ లో 99 శాతం మంది కోటీశ్వరులేనని ఏడీఆర్ నివేదిక వెల్లడించింది. కొత్తగా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన 71 మందిలో 70 మంది కోటీశ్వరులేనని వెల్లడించింది. వీరిలో 39 శాతం మందిపై క్రిమినల్ కేసులున్నాయని, 80 శాతం మంది గ్రాడ్యుయేషన్ లేదా ఆపై డిగ్రీ కలిగి ఉండగా, 15 శాతం మంది 12వ తరగతి వరకే చదువుకున్నారని తెలిపింది.
అందరి మంత్రుల ఆస్తుల విలువ సగటున రూ. 107.94 కోట్లుగా ఉంది. ఆరుగురు మంత్రుల ఆస్తులు రూ. 100 కోట్లకు పైమాటేనని నివేదిక స్పష్టంచేసింది. ప్రస్తుత లోక్‌సభలో గెలిచిన అభ్యర్థుల్లో అత్యధికంగా 93% మంది కోటీశ్వరులేనని వెల్లడించడం విశేషం.
కేంద్ర గ్రామీణాభివృద్ధి డాక్టర్ చంద్రశేఖర్ పెమ్మసాని ( రూ.5705 కోట్లు), ఈశాన్య ప్రాంత అభివృద్ధి, కమ్యూనికేషన్స్ మంత్రి జ్యోతిరాదిత్య ఎం. సింధియా (రూ.425 కోట్లు), భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్‌డి కుమారస్వామి (రూ.217 కోట్లు) , సమాచార మరియు ప్రసార మంత్రి అశ్విని వైష్ణవ్ (రూ.144 కోట్లు, స్టాటిస్టిక్స్ మరియు ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ మంత్రి రావ్ ఇంద్రజిత్ సింగ్ (రూ.121 కోట్లు), వాణిజ్య పరిశ్రమల శాఖా మంత్రి పీయూష్ గోయల్ (రూ.110 కోట్లు, కేంద్ర హోం, సహకార శాఖా మంత్రి అమిత్ షా (రూ.65 కోట్లు, సహకార మంత్రిత్వ శాఖ సహాయమంత్రి క్రిషన్ పాల్ (రూ.62 కోట్లు), జలశక్తి శాఖ సహాయమంత్రి వి.సోమన్న (రూ.60 కోట్లు, ఆర్థికశాఖ సహాయమంత్రి పంకజ్ చౌదరి (రూ.41 కోట్లు)లు టాప్ టెన్ జాబితాలో ఉండడం గమనార్హం.