5 రాష్ట్రాల ఎన్నికలు.. మోడీ తాయిలాలు ఓ రేంజ్‌లో!!
నేరుగా ప్రజలకు తాయిలాలు ఇవ్వకుండా.. పరోక్షంగా ఎన్నోఏళ్లుగా ఉన్న కొన్ని డిమాండ్లను తాజాగా పరిష్కరించే ప్రయత్నం చేసింది.
కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టిన విషయం తెలిసిందే. నేరుగా ప్రజలకు తాయిలాలు ఇవ్వకుండా.. పరోక్షంగా ఎన్నోఏళ్లుగా ఉన్న కొన్ని డిమాండ్లను తాజాగా పరిష్కరించే ప్రయత్నం చేసింది. కేంద్ర కేబినెట్ నిర్ణయాలు సంచలనంగా ఉన్నాయి. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపైనా ప్రభావం చూపించనున్నాయి. తాజాగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఏకంగా 4 శాతం డీఏ(కరువు భత్యం) పెంచారు. అదేసమయంలో రైల్వే ఉద్యోగులకు 78 రోజలు వేతనాన్ని బోనస్‌గా ప్రకటించారు. ఈ రెండు పరిణామాలు ఏటా జరిగేవే అయినప్పటికీ.. ఇప్పుడు ఎన్నికల నేపథ్యంలో వెంటనే అమల్లోకి తీసుకువచ్చారు.
ఇక, మరో కీలకమైన అంశం.. గోధుమలు సహా.. ఆరు రకాల రబీ పంటలకు కేంద్ర సర్కారు మద్దతు ధరలు పెంచింది. గోధుమలకు ఎప్పటి నుంచో రైతులు డిమాండ్ చేస్తున్న క్వింటాల్‌కు రూ.150 చొప్పున ఎంఎస్‌పీని కేంద్ర ప్రభుత్వం పెంచడం గమనార్హం. ప్రస్తుతం దేశంలోని ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్లు వచ్చాయి. వీటిలో ఈశాన్య రాష్ట్రం మిజోరాం సహా.. ఛత్తీస్ గఢ్(కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది), రాజస్థాన్(కాంగ్రెస్ అధికారంలో ఉంది), మధ్య ప్రదేశ్, తెలంగాణల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. ఆయా రాష్ట్రాల్లో పాగా వేయాలనేది మోడీ సహా బీజేపీ వ్యూహం.
అయితే.. నేరుగా ఆయా రాష్ట్రాలకు ప్రయోజనం కలిగిస్తే.. ఎన్నికల నిబంధనావళి ఒప్పుకోదు. ఈ నేపథ్యంలో అనూహ్యంగా ఉద్యోగులకు డీఏ, రైల్వే ఉద్యోగులకు 78 రోజుల బోనస్, కీలకమైన(మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లో గోధుమలకు డిమాండ్, పంట కూడా ఎక్కువే) పంటలకు ఎంఎస్‌పీ పెంపును అమలు చేయనున్నట్టు కేంద్రం ప్రకటించింది. ఈ పరిణామాలు అసెంబ్లీ ఎన్నికలపై ప్రభావం చూపుతాయని పరిశీలకులు చెబుతున్నారు.
సుమారు కోటి కుటుంబాలకు డీఏ(ఉద్యోగులు, పెన్షనర్లు) ప్రయోజనం దక్కుతుందని, అదేసమయంలో లక్షల సంఖ్యలో రైల్వే ఉద్యోగులకు మేలు జరుగుతుందని, అదేవిధంగా రైతులకు మద్దతు ధరల పెంపు కూడా ప్రయోనకారిగా ఉంటుందని.. ఫలితంగా ఎన్నికల్లో బీజేపీ వ్యూహం ఫలించే అవకాశం ఉంటుందని అంటున్నారు. మొత్తానికిమోడీ.. ఎన్నికల నేపథ్యంలో తీసుకున్న ఆయా నిర్ణయాలు ఫలితాన్ని ఇస్తాయని అంటున్నారు పరిశీలకులు.