ఏపీకి మోడీ ఏమి చేశారో చెప్పగలరా...!?

దేశానికి ఆయన ప్రధాని. ఎన్నో విజయాలు ఆయన ఖాతాలో ఉండవచ్చు. ఆయన ఇమేజ్ గడచిన కాలంలో అమాంతం పెరగవచ్చు.

Update: 2024-03-25 12:30 GMT

దేశానికి ఆయన ప్రధాని. ఎన్నో విజయాలు ఆయన ఖాతాలో ఉండవచ్చు. ఆయన ఇమేజ్ గడచిన కాలంలో అమాంతం పెరగవచ్చు. ఆయన పట్ల అభిమానంతో ఉత్తరాది రాష్ట్రాలు ఊగిపోవచ్చు. కానీ ఏపీలో బీజేపీ బలం ఎంత. అసలు మోడీ పట్ల జనంలో ఉన్న భావనలు ఏమిటి. ఇటువంటి ప్రశ్నలు వస్తూనే ఉంటున్నాయి.

మోడీ దేశమంతా గెలిచినా ఆఖరుకు ఈశాన్య రాష్ట్రాలను సైతం కమలం ఖాతాలో వేసుకున్నా చిక్కనిది దక్కనిది మాత్రం ఏపీనే. దానికి కారణాలు అనేకం. ఉమ్మడి ఏపీలో ఉన్నపుడే తెలంగాణాలో కొంత బలం తప్ప ఏపీలోని ఉమ్మడి పదమూడు జిల్లాలలో కమల వికాసం ఎపుడూ పెద్దగా జరిగిన దాఖలాలు లేవు. 1998లో మాత్రం నాలుగు ఎంపీ సీమాంధ్రలో బీజేపీ గెలుచుకుంది. అదే పెద్ద విజయం ఆనాటికీ ఈనాటికీ కూడా అని చెప్పాలి.

మరో వైపు చూస్తే ఉమ్మడి ఏపీ విభజన తరువాత సీమాంధ్ర దారుణంగా నష్టపోయింది. మోడీ ప్రధానిగా వస్తే బాగుపడుతుంది అని ఆశించింది. కానీ పదేళ్ల కాలంలో అలాంటిది ఏమీ జరగలేదు. దాంతోనే సీమాంధ్ర ప్రజానీకంలో బీజేపీ పట్ల వ్యతిరేకత పెరిగిపోతోంది.

పొత్తులతో ఎత్తులతో బీజేపీ జనం ముందుకు రావచ్చు. కానీ దాని అధినాయకుడు నరేంద్ర మోడీ ఏపీకి వచ్చినపుడు విభజన వల్ల కునారిల్లిన ఏపీకి గట్టిగా ఒక మేలు చేశామని ఏమి చెప్పగలుగుతారు అన్నదే కీలకమైన ప్రశ్న.

గట్టిగా మాట్లాడితే ఏపీకి మోడీ ఏమి చేసారో చెప్పగలరా అనే కోట్లాది జనం నుంచి వస్తోంది. మోడీ ఇటీవల చిలకలూరిపేట సభలో మాట్లాడారు. ఆయన ఎన్డీయే విజయం అంటున్నారు. నాలుగు వందల సీట్లు అంటున్నారు తప్ప ఏపీలో ఉన్న ప్రధాన సమస్యల మీద అసలు టచ్ చేసి మాట్లాడలేదు. అంతవరకూ ఎందుకు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయం కూడా మోడీ ప్రస్తావించలేకపోయారు.

మేము దాన్ని ఆపుతున్నామనో లేక ఆ సమస్య లేకుండా చూస్తామనో నిర్దిష్టమైన హామీ అయితే ఇవ్వలేకపోయారు. ఇక పోలవరం ప్రాజెక్ట్ ని చూస్తే చాలా బాధ కలుగుతుంది. అది జాతీయ ప్రాజెక్ట్. దానిని పూర్తి చేయడానికి కేంద్రానికి పదేళ్ల సమయం సరిపోలేదు అంటే ఆశ్చర్యపోవాల్సి ఉంటుంది.

ఏటా 20 లక్షల కోట్లకు పైగా బడ్జెట్ ని కేంద్రం పెడుతుంది. అంటే ఆ లెక్కన పదేళ్ళలో రెండు వందల లక్షల కోట్ల బడ్జెట్ అన్న మాట. అందులో ఏడాదికి కనీసం మూడు నాలుగు వేల కోట్లు తీసి పక్కన పెట్టినా ఏనాడో పోలవరం ప్రాజెక్ట్ పూర్తి అయ్యేది.

కానీ పోలవరం విషయంలో దాగుడుమూతలు ఆడడం రాష్ట్రం మీద నెపం నెట్టడం, ఖర్చు పెరిగిపోతున్నా దాన్ని భరించేందుకు ముందుకు రాకపోవడం ఇవన్నీ కేంద్రంలోని బీజేపీ చేసిన తప్పిదాలే అని అంతా అంటారు. సో ఆ విషయం మీద మోడీ మాట్లాడగలరా అన్నదే ప్రశ్న.

ఇంకో ప్రధాన సమస్య ఉంది. అదే ప్రత్యేక హోదా. దాన్ని లేవనెత్తింది పది కాదు పదిహేనేళ్ళు మేము అధికారంలోకి వస్తే ఇస్తామని నిండు పార్లమెంట్ లో చెప్పింది బీజేపీ పెద్దలే. అంతే కాదు తిరుపతి సాక్షిగా మోడీ కూడా ఆనాడు దీని మీద హామీ ఇచ్చారు. ఇపుడు అది ముగిసిన అధ్యాయం అయిపోయింది. అసలు ఎందుకు ప్రత్యేక హోదా ఇవ్వలేదు అన్న దానికి బీజేపీ పెద్దల వద్ద సమాధానమే లేదు. ఇక మోడీ ఈ విషయం గురించి మాట్లాడగలరా అంటే దానికి కూడా స్పందన ఉండదేమో.

ఇవి చాలదు అన్నట్లుగా తెలంగాణా నుంచి ఏపీని విడగొట్టినపుడు అక్కడే ఉండిపోయిన ఉమ్మడి ఆస్తులు షెడ్యూల్ 9, షెడ్యూల్ 10 అని విభజన చట్టంలో పెట్టారు. ఆ ఆస్తులు అన్నీ కలిపితే ఏకంగా రెండు లక్షల కోట్ల పై దాటుతాయి. వాటికి సంబంధించి ఏపీకి నిధులు ఇప్పించాలి. తెలంగాణా ద్వారానే ఆ పని చేయించాలి. మధ్యవర్తిగా కేంద్రం ఉండాలి. మరి ఆ పాత్ర పదేళ్లలో బీజేపీ పొషించిందా అంటే లేదు అనే జవాబు వస్తుంది.

ఇవే కాదు విభజన హామీలను పూర్తిగా తుంగలోకి తొక్కేశారు. ఏ ఒక్కటీ నెరవేర్చలేదు. దేశానికి మేలు చేస్తే ఆయా రాష్ట్రాలలో బీజేపీకి అవకాశం ఉంటుందేమో కానీ ఏపీకి అన్యాయం చేసిన తీరుకు జనాలకు ఇప్పటికీ కోపమే ఉందని అంటున్నారు.

వీటన్నిటికీ జవాబు మోడీ ఎన్నికల సభలలో చెప్పరలగా అని సగటు ఆంధ్రుడు ప్రశ్నిస్తున్నారు. పదేళ్ల బీజేపీ ఏలుబడిలో కేంద్రం నుంచి అప్పులు చేసుకునే వెసులుబాటే ఇచ్చారు తప్ప స్పెషల్ గ్రాంట్స్ మాత్రం రూపాయి కూడా ఇవ్వలేదు. దాని వల్ల ఏపీ అప్పుల కుప్ప అయింది. ఇపుడు ఏపీలో అభివృద్ధి లేదు అంటే ఆ తప్పు ఎవరిది అన్న ప్రశ్నలు వస్తున్నాయి. కేవలం రాజకీయాల కోసం పాతిక ఎంపీ సీట్లో కోసం తనదైన పొలిటికల్ స్ట్రాటజీస్ తో బీజేపీ ఏపీలో పోటీ చేయవచ్చు. కానీ ఆ పార్టీ అధినాయకుడు మాత్రం దేనికీ సరిగ్గా సమాధానం అయితే చెప్పలేరనే అంతా అంటున్నారు.

Tags:    

Similar News