జీ 20 సమ్మిట్... మోడీ రికార్డు ఇదే !

ఇక జీ 20 కి సారధ్యం వహించే అవకాశం ఎపుడూ ఇతర దేశాలకే ఉంటూ వచ్చింది. తొలిసారిగా భారత్ ఆ చాన్స్ ని దక్కించుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సామర్ధ్యానికి ఇది మచ్చుతునక అని అంతా అంటున్నారు.

Update: 2023-09-08 14:26 GMT

దాదాపు పాతికేళ్ల తరువాత జీ 20 కూటమికి నాయకత్వం వహించే చాన్స్ భారత్ కి వచ్చింది. 1999లో అప్పటి ఆర్ధిక సవాళ్ళు, సంస్కరణల వల్ల వచ్చే ఫలితాలు, పర్యవసానాల నేపధ్యంలో అగ్ర రాజ్యాలు అభివృద్ధి చెందుతున్న దేశాలు అన్నీ కలసి ఏర్పాటు చేసుకున్నదే జీ 20 కూటమి. మొదట్లో కేవలం అధికారుల స్థాయిలలోనే సమావేశాలు సదస్సులు నడిచేవి.

ప్రపంచాన్ని కుదిపేసిన పెను ఆర్ధిక సంక్షోభం 2007 2008 ప్రాంతంలో వచ్చింది. దాంతో జీ 20 కూటమి ప్రాముఖ్యత ఇంకా బాగా పెరిగింది. నాటి నుంచి దేశాధినేతలు అంతా ఈ కూటమి సమ్మిట్స్ కి వరసగా హాజరవుతూ వస్తున్నారు. అలా అగ్ర రాజ్యం నుంచి మధ్య స్థాయిలో ఉండే దేశాల వరకూ ఇందులో చోటు సంపాదించుకుని తమదైన శైలిలో వాణిని బలంగా వినిపిస్తున్నాయి.

ఇక జీ 20 కి సారధ్యం వహించే అవకాశం ఎపుడూ ఇతర దేశాలకే ఉంటూ వచ్చింది. తొలిసారిగా భారత్ ఆ చాన్స్ ని దక్కించుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సామర్ధ్యానికి ఇది మచ్చుతునక అని అంతా అంటున్నారు. ఇక జీ 20 సదస్సుకు మొత్తం దేశాల నేతలు అంతా తరలివస్తున్నారు.

ఇలా వచ్చిన వారితో ఒక వైపు సదస్సు సాగుతూంటే మరో వైపు భారత్ వారితో చర్చించడం ద్వారా భారత్ అవసరాలు అవకాశాలను కూడా తెలియచేయడానికి దీన్ని ఉపయోగించుకుంటోంది. ప్రధాని నరేంద్ర మోడీ విషయానికి వస్తే రానున్న మూడు రోజులల్లో ఏకంగా డబుల్ డిజిట్ నంబర్ తో వివిధ దేశాధినేతలతో భేటీలు వేయడం ద్వారా సరికొత్త రికార్డుని క్రియేట్ చేయనున్నారు అని అంటున్నారు.

అలా కనుక చూసుకుంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరో మూడు రోజుల్లో ప్రపంచ నేతలతో 15కి పైగా ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించనున్నారు. ఇది శుక్రవారం నుంచే మొదలు కానుంది. దానికి వేదిక కూడా ప్రధాని అధికారిక నివాసం కానుంది.

మోడీ తన నివాసంలో మారిషస్, బంగ్లాదేశ్ దేశాధినేతలతో పాటు అమెరిక ప్రెసిడెంట్ జో బైడెన్ తో కూడా భేటీలు జరగనున్నాయి. ఇలా కీలక దేశాధినేతలతో భారత్ జరిపే ద్వైపాక్షిక సమావేశాలు రానున్న రోజులలో మంచి ఫలితాలను ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు.

వరసబెట్టి మోడీ శుక్ర శని ఆదివారాలలో జీ20 సమావేశాలకు వచ్చే యూకే, జపాన్, జర్మనీ, ఇటలీ దేశాల నేతలతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించనున్నారు. ఇదే వరసలో చూస్తే ఈ ఆదివారం, మోదీ ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌తో వర్కింగ్ లంచ్ సమావేశం కూడా నిర్వహించనున్నారు.

అదే విధంగా కెనడా దేశాధినేతలో మరో వైపు మోడీ సమావేశం జరగనుంది. ఇలా లిస్ట్ కనుక చూసుకుంటే కొమొరోస్, టర్కియే, యూఏఈ, దక్షిణ కొరియా, యూరోపియన్ యూనియన్, యూరోపియన్ కమీషన్, బ్రెజిల్ మరియు నైజీరియాలతో మోడీ ద్వైపాక్షిక సమావేశాలు ఉంటాయి.

అంటే క్షణం కూడా తీరుబాటు లేకుండా మోడీ ప్రపంచ దేశాల అధినేతలతో భేటీలు వేస్తారన్న మాట. బహుశా దేశ చరిత్రలో మరే ప్రధానికీ ఇన్ని భేటీలు వరసగా అతి తక్కువ టైం లో నిర్వహించే అవకాశం వచ్చి ఉండకపోవచ్చు. మోడీ ఈ విషయంలో సరికొత్త రికార్డునే క్రియేట్ చేస్తున్నారని అంటున్నారు. ఇది భారత్ గొప్పదనాన్ని ప్రపంచ పటంలో ఉంచే వినూత్న ఘట్టమని బీజేపీ నేతలు అయితే గట్టిగా చెబుతున్నారు. దటీజ్ మోడీ అని కూడా అంటున్నారు.

Tags:    

Similar News