మోడీ ఫస్ట్రేషన్ లో ఉన్నారా? తాజా వ్యాఖ్యల మర్మమేంటి?
తాజాగా జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో కీలకమైన రెండో అంకం షురూ అయిన వేళ.. ఆయన నోటి నుంచి ఆ వ్యాఖ్యల లెక్కేంటన్నది ఇప్పుడు పెద్ద చర్చగా మారింది
కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తే సంపద మొత్తం ముస్లింలకే.. అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పెద్ద చర్చకే తెర తీశారు. తాజాగా జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో కీలకమైన రెండో అంకం షురూ అయిన వేళ.. ఆయన నోటి నుంచి ఆ వ్యాఖ్యల లెక్కేంటన్నది ఇప్పుడు పెద్ద చర్చగా మారింది. ఇంతకూ ప్రధాని నరేంద్ర మోడీ అసలేం అన్నారు? అన్నది ఒకటైతే.. తాజా వ్యాఖ్యల్లో ముస్లింల ప్రస్తావన తీసుకురావటం ఒక ఎత్తు అయితే.. దానికి కాంగ్రెస్ మేనిఫెస్టోను ఆధారంగా చూపించటం ఒక ఎత్తు.
ఇంతకూ కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో ఏముంది? దాన్ని మోడీ ఎలాంటి వ్యాఖ్యానాన్ని జోడించారన్న దానిపై పెద్ద ఎత్తున వాదనలు జరుగుతున్నాయి. తమకు పట్టున్న రాజస్థాన్ లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభల్లో ఆయన నోటి నుంచి ఈ తరహా వ్యాఖ్య రావటం చూస్తే.. వ్యాఖ్యలు మొత్తం వ్యూహాత్మకమేనని చెప్పాలి. కాంగ్రెస్ ఆరోపించినట్లుగా మొదటి దశ పోలింగ్ జరిగిన 13 రాష్ట్రాల్లో ఓటింగ్ సరళి తాము అనుకున్నట్లుగా జరగకపోవటంతోనే ప్రధాని మోడీ తన మాటల డోసును పెంచారంటూ కాంగ్రెస్ మండిపడుతోంది.
మొదటి దశలో 21 రాష్ట్రాల్లోని 102 లోక్ సభా స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఇందులో తమిళనాడు మొత్తం స్థానాల (39)కు ఎన్నికలు జరగ్గా.. రాజస్థాన్ లో 12, ఉత్తరప్రదేశ్ లో 8, మధ్యప్రదేశ్ లో 6, మహారాష్ట్రలో 5, ఉత్తరాఖండ్ లోని మొత్తం 5 స్థానాలకు.. అసోంలో 5, బిహార్ లో 4, పశ్చిమబెంగాల్ లో 3, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, మేఘాలయల్లో రెండేసి చొప్పున స్థానాలు ఉన్నాయి. మొత్తం ఆరు స్థానాల్లోనే ఎన్నికలు జరిగాయి. ఛత్తీస్ గఢ్ లో 1, మిజోరం, నాగాలాండ్, సిక్కింలో ఒక్కో స్థానం ఉంది. ఈ మూడు స్థానాల్లోనూ ఎన్నికలు జరిగాయి. త్రిపురలో 1, జమ్ముకశ్మీర్ 1, అండమాన్ నికోబార్, లక్ష్యద్వీప్, పాండిచ్చేరిలో ఒక్క స్థానమే ఉండగా.. వాటన్నింటిలోనూ ఎన్నికలు జరిగాయి.
రెండో విడత పోలింగ్ ఏప్రిల్ 26న జరగనుంది. రెండో ఫేజ్ లో అసోం.. బిహార్.. చత్తీస్ గఢ్.. జమ్ముకశ్మీర్..కర్ణాటక..కేరళ.. మధ్యప్రదేశ్.. మహారాష్ట్ర.. మణిపూర్.. రాజస్థాన్..త్రిపుర.. ఉత్తరప్రదేశ్.. పశ్చిమ బెంగాల్ లో జరగనున్నాయి. మొదటి దశతో పోలిస్తే.. బీజేపీకి రెండో దశ చాలా కీలకం. ఆ మాటకు వస్తే మూడో దశ కూడా ఆ పార్టీకి ముఖ్యమే. రెండో ఫేజ్ లో 89 స్థానాల్లో పోలింగ్ జరగనుంది. మూడో ఫేజ్ లో అసోం, బిహార్, చత్తీస్ గఢ్,, దాద్రా అండ్ నగర్ హవేలీ, డామన్ డయ్యూ, గోవా, గుజరాత్, జమ్ముకశ్మీర్, కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లోని లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.
నిజానికి మొదటి దశ కంటే కూడా బీజేపీకి రెండు.. మూడు దశలు చాలా ముఖ్యం. దీంతో.. తమ ఓటును బ్యాంకును సమీకరించుకోవటంతో పాటు.. ముక్కలు కాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి వేళ.. తమ ఓటు బ్యాంక్ ను మరింత బలోపేతం చేసేందుకు వీలుగా తాజా వ్యాఖ్యలు ప్రధాని మోడీ నోటి నుంచి వచ్చి ఉంటాయని చెప్పాలి. మొదటి దశలో పోలింగ్ జరిగిన 102 ఎంపీ స్థానాల్లో సరాసరి 64 శాతం పోలింగ్ నమోదైంది. త్రిపురలో రికార్డు స్థాయిలో 80 శాతం పోలింగ్ నమోదైతే.. అతి తక్కువగా బిహార్ లో 49 శాతమే ఓటింగ్ జరిగింది. మొదటిదశతో పోలిస్తే.. మిగిలిన దశల్లో పోలింగ్ పెద్ద ఎత్తున జరగాల్సి ఉంది.
అందుకు ఏదో ఒక భావోద్వగ అంశం కారణం కావాలి. సాధారణంగా.. తక్కువ పోలింగ్ జరగటం అధికార పార్టీకి హెచ్చరికగా భావిస్తారు. అందుకే అలెర్టు అయిన ప్రధాని.. తన మాటలతో ఎన్నికల హీట్ ను మరింత పెంచే ప్లాన్ లో భాగంగానే తాజా వ్యాఖ్యలు ఉంటాయని చెబుతున్నారు. ఇటీవల కాలంలో ఒక మతం పేరుతో నేరుగా వ్యాఖ్యలు చేసింది లేదు. తాజాగా చేసిన వ్యాఖ్యలు చూస్తే.. కాంగ్రెస్ పార్టీ మైనార్టీల వైపు పూర్తిగా వాలిపోవటమే కాదు.. మెజార్టీ హిందువుల ఆస్తులపై గురి పెట్టినట్లుగా ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యానించటం ఇప్పుడు సంచలనంగా మారింది. ఏమైనా.. తాజాగా మోడీ చేసిన వ్యాఖ్యలు చూసినప్పుడు కాసింత ఒత్తిడిలో ఉన్నట్లుగా చెప్పాలి. తాము టార్గెట్ చేసిన 400 ప్లస్ సీట్ల సాధన కష్టంగా మారటం.. 370 స్థానాలు ఖాయమన్న మాటపై కూడా సందేహాలు వ్యక్తమువుతున్న వేళ.. తన అమ్ములపొది నుంచి భారీ అస్త్రాన్ని బయటకు తీశారని చెప్పాలి. మరీ.. మాటల మంటలు ఎంతవరకు వెళతాయన్నది ఇప్పుడు అసలు ప్రశ్న.