జమిలి తొందరతో జెండా పీకేస్తున్నారు !
ఇక జమిలి ఎన్నికలు అంటే 2027లో జరుగుతాయని అంటున్నారు ఆ ఎన్నికలకు ఇప్పటి నుంచే వైసీపీ మాజీలు సిద్ధపడుతున్నారు.
కేంద్రం జమిలి ఎన్నికలకు రెడీ అవుతోంది. బీజేపీ ప్రభుత్వం అనుకుంటే జమిలి ఎన్నికలు రావడం తధ్యమన్నది అందరికీ తెలిసిందే. ఇక జమిలి ఎన్నికలు అంటే 2027లో జరుగుతాయని అంటున్నారు ఆ ఎన్నికలకు ఇప్పటి నుంచే వైసీపీ మాజీలు సిద్ధపడుతున్నారు.
వారంతా ఈసారి సరైన పార్టీని ఎంచుకుని ఎన్నికల్లో పోటీ చేసి గెలవాలని అనుకుంటున్నారు. ఇక జమిలి ఎన్నికల కంటే ముందే 2026 నాటికి అసెంబ్లీ పార్లమెంట్ సీట్ల పునర్ వ్యవస్థీకరణ ఉంటుంది. అలా ఏపీలో ఉన్న 175 సీట్లు కాస్తా విభజన చట్టం ప్రకారం 225 సీట్లుగా మారుతాయి. అదే విధంగా లోక్ సభ సీట్లు కూడా మరో పది దాకా పెరుగుతాయి. దాంతో బోలెడు అవకాశాలు ఉంటాయని భావించి తెలివిగానే వైసీపీని వీడుతున్నారు అని అంటున్నారు. ముందుగానే తాము కోరుకున్న పార్టీలలోకి వెళ్తే తమకు అవకాశాలు దక్కుతాయని కూడా లెక్క వేసుకుంటున్నారు అని అంటున్నారు.
మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ అయినా భీమవరం మాజీ మంత్రి గ్రంధి శ్రీనివాస్ అయినా జమిలి ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే వైసీపీ జెండాని పీకేశారు. వైసీపీలో ఉంటే గెలవలేమని డౌట్లు ఉన్న వారు ఇపుడు కూటమి దిశగా క్యూ కడుతున్నారు. రాజీనామాలు వైసీపీకి చేసిన గ్రంధి శ్రీనివాస్ అయినా అవంతి శ్రీనివాస్ అయినా జనసేనను పొగుడుతున్నారు. పవన్ కి కితాబు ఇస్తున్నారు.
అంటే రేపటి ఎన్నికల్లో జనసేన తరఫున వీరు పోటీకి దిగాలని చూస్తున్నారా అన్న చర్చ అయితే నడుస్తోంది. జనసేన 2024 ఎన్నికల్లో 21 సీట్లు తీసుకుని పోటీ చేసి మొత్తానికి మొత్తం గెలిచింది. ఈసారి కనీసంగా యాభై సీట్లు కోరుతుంది అని అంటున్నారు.
దాంతో జనసేనలో చేరితే సీటు హామీతో పాటు కచ్చితంగా గెలుస్తామని భావిస్తున్నారు అని అంటున్నారు. టీడీపీలో అయితే ఆశావహులు ఎక్కువ మంది ఉంటారని దాంతో కొత్త పార్టీ అయిన జనసేనలో తమకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయని కూడా అంచనా కడుతున్నారు.
ఇక సామాజిక వర్గ సమీకరణలు రాజకీయ పరిచయాలు జనాలలో ఉన్న ఆలోచనలు అన్నీ బేరీజు వేసుకుని మరీ జనసేన వైపే ఎక్కువ మంది వైసీపీ నేతలు చూస్తున్నారు అని అంటున్నారు. జనసేన సైతం మరో రెండేళ్లలో ఎన్నికలు అంటే ఎక్కువ సీట్లలో పోటీ పడాల్సి ఉంటుంది కాబట్టి అంగబలం అర్ధబలం ఉన్న నేతలు వస్తే కనుక వారిని చేర్చుకుని తమ బలాన్ని పెంచుకోవాలని చూస్తోంది. ఇలా ఉభయ కుశలోపరి గానే ఈ వ్యవహారం కాస్తా మారిందని అంటున్నారు. మొత్తానికి జమిలి ఎన్నికలు వస్తే వైసీపీ బలపడుతుందని అనుకూలం అవుతుంది అనుకుంటే దెబ్బ పడుతోంది అని అంటున్నారు.