ఏబీఎన్ ఆర్కే వర్సెస్ ఎంపీ విజయసాయి: సవాలుకు ప్రతి సవాల్ వచ్చేసింది!

ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాక్రిష్ణకు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి మధ్య ఇటీవల మొదలైన సవాళ్లు మరో లెవల్ కు తాజాగా చేరుకున్నాయి.

Update: 2024-11-20 04:17 GMT

ఒకరికి మించి మరొకరు అన్నట్లుగా వ్యవహారించే ఇద్దరు ప్రముఖుల మధ్య తెర మీదకు వచ్చిన సవాళ్లు.. ప్రతి సవాళ్లతో రెండు తెలుగు రాష్ట్రాల వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాక్రిష్ణకు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి మధ్య ఇటీవల మొదలైన సవాళ్లు మరో లెవల్ కు తాజాగా చేరుకున్నాయి. ప్రతి ఆదివారం తన ఆంధ్రజ్యోతి దినపత్రికలోని ఎడిటోరియల్ పేజీలో రాసే తన వ్యాసంలో విజయసాయి రెడ్డి మీద తీవ్రస్థాయిలో విరుచుకుపడటం తెలిసిందే.

ఇటీవల కాలంలో తనపై తీవ్రస్థాయిలో విమర్శలు.. ఆరోపణలు చేస్తున్న ఎంపీ విజయసాయి మీద ఒక రేంజ్ లో నిప్పులు చెరిగిన ఆర్కే.. తనతో ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే కార్యక్రమాన్ని చేసే దమ్ముందా? అంటూ సవాలు విసిరారు. హైదరాబాద్ లో కాకుండా.. ఢిల్లీ వేదికగా తాను చేపట్టే కార్యక్రమానికి వస్తే.. అక్కడే నేరుగా తేల్చుకుందామని.. ఆ కార్యక్రమాన్ని లైవ్ గా ప్రజల ముందు ఉంచుదామన్న ప్రతిపాదనను చేశారు ఆర్కే. ఈ సందర్భంగా విజయసాయిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

తనను బహిరంగ వేదికల మీద నానా మాటలు అనేసే విజయసాయి.. నాలుగు గోడల మధ్య మాత్రం తనకు వివరణ ఇచ్చుకుంటున్న విషయాన్ని ఆయన వెల్లడించారు. ఈ వ్యవహారంపై మంగళవారం రాజ్యసభ సభ్యుడు విజయసాయి ఓపెన్ అయ్యారు. ఎక్స్ వేదికగా ఆర్కేకు ప్రతి సవాలు విసిరారు. ''రాధాక్రిష్ణ.. బహిరంగ చర్చకు నేను రెఢీ. నీ ఛాలెంజ్ స్వీకరిస్తున్నా. ఫేస్ టు ఫేస్.. కౌంటర్ కు ఎన్ కౌంటర్ నేను సిద్ధం. నువ్వు సిద్దమా? అయినా నీ పక్షపాత టీవీ ఛానల్ ఆంధ్రజ్యోతికి నేను రావాలా? ఢిల్లీలో ఎన్జీవోలు.. మేధావులు.. జర్నలిస్టులు.. అన్ని టీవీ చానల్స్ ను అందరిని ఆహ్వానిద్దాం'' అంటూ కొత్త ప్రతిపాదనను తెర మీదకు తీసుకొచ్చారు.

ఈ సందర్భంగా ఆంధ్రజ్యోతి ఆర్కేపై పలు వ్యాఖ్యలు చేశారు. జర్నలిస్టు కాలనీలో నువ్వు ఉండే ప్యాలస్.. నేను ఉండే బాడుగ ఇళ్లు కూడా చూపిద్దాం. ఫిలింనగర్ మొయిన్ రోడ్డులో నువ్వు కొన్ని రూ.100 కోట్లు విలువ చేసే స్థలం.. దాన్లో ఇంకో రూ.200 కోట్లతో కడుతున్న ఆఫీస్ భవంతిని పరిశీలిద్దాం. రాధాక్రిష్ణ.. నీ పత్రిక.. టీవీని ఏ పునాదులపై నిర్మించుకున్నావో మరువద్దు. నష్టాలు వస్తున్నాయని ఇప్పటికీ అమెరికాకు వెళ్లి ఎన్నారైల దగ్గర చందాలు తెచ్చుకోవటం వాస్తవం కాదా? కలర్ బ్లైండ్ నెస్ లా నీ కళ్లకు కొందరే కనిపిస్తారు. మిగితావాళ్లంతా నీవేం అన్నా పడాలి'' అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

తాను ఐక్య రాజ్య సమితి నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఎప్పుడైనా బహిరంగ చర్చకు సిద్దమన్న విజయసాయి.. 'ఎవరి చిత్తశుద్ధి ఏంటో తేల్చుకుందామని.. తగ్గేదేలే.. భయపడేదేలే అని వ్యాఖ్యానించారు. గత 5 ఏళ్లలో మద్యం.. ఖనిజ సిండికేట్ బ్రోకర్లు.. మిగతా ఇతరత్రా డీల్స్ లో మీ బాస్ పేరు చెప్పి వసూళ్లు చేైసి వారికి ఇవ్వకుండా ఎంత తీసుకున్నావో అన్ని అంశాలు కూలంకషంగా చర్చిద్దాం' అంటూ తన ఘాటు ఆరోపణలతో వాతావరణాన్ని మరింత వేడెక్కించే ప్రయత్నం చేశారు. మరి.. విజయసాయి తాజా ప్రతిసవాలుకు ఆంధ్రజ్యోతి ఆర్కే ఎలా రియాక్టు అవుతారో చూడాలి.

Tags:    

Similar News